TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!

Palamuru

Palamuru

TG20 League 2026: రోహిత్ రాయుడు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో TG20 లీగ్-2026లో పాలమూరు స్ట్రైకర్స్ జట్టు ఘన విజయం సాధించింది. జూన్ 25 రాత్రి జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో మెదక్ ఫాల్కన్స్‌పై పాలమూరు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. జట్టులో విక్రమ్ నాయక్, వరుణ్ యెర్రం చెరో 36 పరుగులతో రాణించి మెదక్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించారు. మిగతా బ్యాటర్లలో నమన్ అగర్వాల్ (21), శృంజిత్ రెడ్డి (19), రవితేజ (13), అశ్విన్ రామ్ (12 రిటైర్డ్ అవుట్) ఫర్వాలేదనిపించారు. పాలమూరు బౌలర్లలో రవి కిరణ్, రిషభ్ చెరో రెండు వికెట్లతో మెదక్‌ను కట్టడి చేయగా.. మహ్మద్ అఫ్రిది, బుడిది తేజ, రోహిత్ రాయుడు తలో వికెట్ తీశారు.

అనంతరం 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు స్ట్రైకర్స్‌కు ప్రారంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రోహిత్ రాయుడు (54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో అద్భుతంగా ఆదుకున్నాడు. అతనికి విఘ్నేష్ రెడ్డి (39), బుడిది తేజ (23) చక్కటి సహకారం అందించారు. చివర్లో ప్రతీక్ పవార్ (27 నాటౌట్) వేగంగా ఆడటంతో పాలమూరు మరో 13 బంతులు మిగిలి ఉండగానే, అంటే 17.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మెదక్ బౌలర్లలో వరుణ్ యెర్రం రెండు వికెట్లు పడగొట్టగా.. రవితేజ, ఘాజీ అబ్బాస్, శృంజిత్ రెడ్డి చెరో వికెట్ దక్కించుకున్నప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు.