NTV Telugu Site icon

Pakistan: కోర్టులకు బెదిరింపు లేఖలు.. రంగంలోకి దర్యాప్తు సంస్థలు

Cue

Cue

పాకిస్థాన్‌లోని న్యాయస్థానాలకు వచ్చిన బెదిరింపు లేఖలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల వచ్చిన తెల్లటి పౌడర్‌తో కూడిన లేఖలు కలకలం సృష్టించాయి. ఇప్పటివరకు ఇస్లామాబాద్‌, లాహోర్‌ హైకోర్టులకు చెందిన 17 మంది న్యాయమూర్తులకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. పదుల సంఖ్యలో ఇటువంటి లేఖలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. వాటిలో తెల్లటి పౌడర్‌ ఉండటం మరింత భయాందోళనలకు కారణమయ్యింది. తొలుత ఆంత్రాక్స్‌ కారక పదార్థంగా భావించినప్పటికీ.. పరీక్షల అనంతరం అది కాదని నిర్ధరించారు. మరోవైపు రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థలు నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. న్యాయమూర్తులను బెదిరించడమే లక్ష్యంగా అవి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చదవండి: YSRCP MP Joins TDP: టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ

పాకిస్థాన్‌లోని లాహోర్‌ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులకు ఏప్రిల్‌ 3న వైట్‌ పౌడర్‌తో కూడిన లేఖలు వచ్చాయి. ఇస్లామాబాద్‌ హైకోర్టులోని ఎనిమిది మందికి ఈ తరహా లేఖలు వచ్చిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. తొలుత దాన్ని ఆంత్రాక్స్‌గా భావించారు. పరీక్షించిన ఫోరెన్సిక్‌ బృందం అది ఆంత్రాక్స్‌ కాదని.. ఆర్సెనిక్‌ కలిగిన పదార్థంగా నిర్ధరించారు.

ఇది కూడా చదవండి: Heat wave & rainfall: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు ఇవే

రావల్పిండిలోని జనరల్‌ పోస్టాఫీసు నుంచి ఈ లేఖలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను కనుక్కోవడం కష్టంగా మారింది. కవర్లపై ఉన్న వేలిముద్రల ద్వారా వారి జాడను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు మునిగిపోయాయి. తమకు అనుకూలంగా తీర్పు పొందేందుకు గూఢచార సంస్థల సిబ్బంది కొందరు తమను వేధిస్తున్నారంటూ ఇటీవల ఆరుగురు ఇస్లామాబాద్‌ న్యాయమూర్తులు ఆరోపించడం సంచలనం రేపింది. ఇందులో భాగంగా తమ నివాసాలపై నిఘా పెట్టడం, బంధువులను అపహరించి, చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు వారు ఆరోపించారు. ఇప్పటివరకు పాక్‌ ఉన్నత న్యాయస్థాలకు చెందిన మొత్తం 17 మంది న్యాయమూర్తులకు ఇటువంటి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఇలా జడ్జీలను భయభ్రాంతులకు గురిచేస్తోన్న ఈ వ్యవహారాన్ని అక్కడి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.

ఇది కూడా చదవండి: Pemmasani Chandrashekar: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ముట్లూరు గ్రామంలో పెమ్మలసాని చంద్రశేఖర్ ప్రచారం

తాజా పరిణామాలపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ స్పందిస్తూ.. న్యాయమూర్తులను బెదిరించేందుకు చేస్తున్న ఈ కుట్రలను బయటపెడతామన్నారు. వాస్తవాలను వెలికితీసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తెలిపారు. మరోవైపు న్యాయస్థానాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకుగానూ లేఖలను ముందస్తుగానే స్కానింగ్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: Pemmasani Chandrashekar: ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ముట్లూరు గ్రామంలో పెమ్మలసాని చంద్రశేఖర్ ప్రచారం