Pakistan: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. “తాను తవ్వుకున్న గుంతలో తానే పడ్డట్టు” అన్న చందంగా పాకిస్థాన్ పరిస్థితి తయారైంది. భారత్‌ను ఎలాగైనా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న పాక్.. ఉగ్రవాదులకు నిధులు వెచ్చించి మరి పోషిస్తోంది. ఇదే ఉగ్రవాదుల్లోని ఓ వర్గం మాత్రం దాయాదీ దేశానికి చుక్కలు చూయిస్తుంది. వరుస దాడులతో కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా పాకిస్థాన్‌లోని బాజౌర్‌లో ఉన్న మిలిటరీ క్యాంపుపై జరిగిన భారీ ఆత్మాహుతి దాడి ఆ దేశ సైన్యాన్ని వణికించింది. ఈ పక్కా ప్లాన్డ్ అటాక్‌లో ప్రాథమిక సమాచారం ప్రకారం.. కనీసం 15 మంది సైనికులు మరణించారు. ఉగ్రవాదులు ముందుగా సైనిక స్థావరం వద్ద భారీ పేలుడుకు పాల్పడి, ఆ గందరగోళం మధ్యలో ఆయుధాలతో క్యాంపులోకి చొరబడ్డారు. ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య కొద్దిసేపు భీకర కాల్పులు జరిగాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘తహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్’ (TTP) ఈ దాడికి బాధ్యత వహించింది. తమ ‘స్పెషల్ ఇస్తషాదీ ఫోర్సెస్’ (SIF) ద్వారా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రకటించింది. 2025 అక్టోబర్‌లో క్వెట్టాలో జరిగిన దాడి తర్వాత, టీటీపీ అధికారికంగా బాధ్యత వహించిన ప్రధాన ఆత్మాహుతి దాడి ఇదే కావడం గమనార్హం.
ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంత్నంలో కేవలం వారం వ్యవధిలో ఇలాంటి ఆత్మాహుతి దాడి జరగడం ఇది రెండోసారి. అంతకుముందు మంగళవారం లక్కీ మర్వత్ జిల్లాలోని నౌరంగ్ బజార్‌లో పేలుడు పదార్థాలతో నిండిన ఆటో రిక్షాతో జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు, ఒక మహిళ సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఆ పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాలు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మరో దాడిలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. వరుసగా జరుగుతున్న ఈ ఉగ్రదాడులతో బాజౌర్, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి.
