pakistan economic crisis: గడ్డి తినైనా మేం అణుబాంబును తయారు చేస్తాం అని 1970ల్లో పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో అన్నాడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వద్ద అణు బాంబులు ఉన్నాయి. కానీ తినడానికి తిండి దొరికే పరిస్థితి లేదు. నిజంగా పాకిస్తాన్ ప్రజలు గడ్డి తిని బతికే పరిస్థితి వచ్చింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోబోతోంది. విదేశీమారక నిల్వలు తరిగిపోయాయి. దీంతో ఇక పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని అప్పుల కోసం అడుగుతోంది. అయితే భారత్ ను మాత్రం సాయం అడిగేందుకు ఈగో అడ్డువస్తోంది. కనీసం భారత్ ను, ప్రధాని మోదీని సాయం అడిగితే టమాటా, గోధుమలు, ఆలుగడ్డలైనా వస్తాయంటూ అక్కడి మీడియా కథనాలను ప్రచురిస్తోంది.
ప్రస్తుతం విదేశీమారక నిల్వలను కాపాడుకునేందుకు పాక్ దిగుమతులను తగ్గించింది. అయితే ఇది ఎన్నిరోజులనేది తెలియదు. ఎందుకంటే పాక్ పూర్తిగా దిగుమతులపై ఆధారపడిన దేశం కాబట్టి. ఇక అక్కడ ఆహార సంక్షోభంతో పాటు విద్యుత్, గ్యాస్ సంక్షోభాలు రానున్నాయి. పాకిస్తాన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ చైనా కూడా పాకిస్తాన్ తో లాభం లేదనుకుని సాయం చేయడం లేదు. యూఎస్ కూడా పట్టించుకోవడం లేదు. ఇక మిగతా అరబ్ దేశాలు అప్పులిచ్చే పరిస్థితి లేదని పాక్ కు తెగేసి చెబుతున్నాయి. అయితే ఐఎంఎఫ్ ప్యాకేజ్ కోసం పాక్ ప్రయత్నిస్తోంది. అయితే ఐఎంఎఫ్ షరతులకు ఒప్పుకుంటే ఇప్పటికే దయనీయ పరిస్థితుల్లో ఉన్న పాక్ జనాభా మరింతగా పేదరికంలో కూరుకుపోవడం ఖాయం.
Read Also: Sharwanand: ఘనంగా శర్వానంద్ నిశ్చితార్థం.. రామ్‌చరణ్ దంపతులు హాజరు
దిగుమతుల కోసం వచ్చిన కంటెనర్ షిప్పులు పాకిస్తాన్ ఓడరేవుల్లో నిలిచి ఉన్నాయి. అయితే వీటికి చెల్లించేందుకు మాత్రం పాక్ వద్ద డాలర్ల లేవు. సంక్షోభం నడుమ అక్కడి కంపెనీలు మూతపడ్డాయి. ఆటోమోబైల్ దిగ్గజాలు పాక్ సుజుకీ, టయోటా కంపెనీలు తమ కార్యకలాపాలను బంద్ చేశాయి. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీలంక పరిస్థితే పాకిస్తాన్ కు వచ్చే అవకాశం దాదాపుగా ఖాయం అయినట్లే తెలుస్తోంది. మే నెలలో పాకిస్తాన్ డిఫాల్ట్ అవుతుందని అంచానా వేస్తున్నారు ఆర్థికవేత్తలు. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి గవర్నమెంట్ జీతాల్లో 10 శాతం, మంత్రుల ఖర్చుల్లో 15 శాతం కోత విధించింది.
వరదల కారణంగా అక్కడి వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. సారవంతమైన భూములు కొట్టుకుపోయాయి. దీంతో గోధుమల సంక్షోభం పాక్ ను వేధిస్తోంది. 10 కిలోల గోధుమ పిండి రూ. 3 వేలను దాటింది. ఒక్క బస్తా కోసం ముగ్గురు నలుగురు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ద్రవ్యోల్భనం గరిష్టస్థాయికి వెళ్లి నిత్యావసరాల ధరలు పెరిగాయి. వచ్చే నెలలో గ్యాస్ సంక్షోభం ఏర్పడవచ్చు. లోవోల్టేజ్ కారణంగా అక్కడి విద్యుత్ కష్టాలు ఏర్పడ్డాయి. చివరకు రాజధాని ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ నగరాలకు కూడా కరెంట్ లేని పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే ఇక పాకిస్తాన్ లో పలు ప్రాంతాలు తాము స్వతంత్ర దేశాలుగా మారుతామంటూ నిరసన, ఆందోళనలు చేస్తున్నాయి. ఒక్క పంజాబ్ మినహా సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పీఓకేలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చివరికి గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంత ప్రజలు తమను భారత్ లో కలుపుకోవాలని నిరసనలు తెలుపుతున్నారు.
