Pakistan: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి

  • పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం
  • లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
  • సామర్థ్యానికి మంచి ప్రయాణించడంతో ఘోరం
Pakistan

Pakistan

పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా.. మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు, రెస్క్యూ సిబ్బంది ధృవీకరించారు. రెస్క్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. బలూచిస్తాన్-ఖైబర్ పఖ్తున్‌ఖ్వా రాష్ట్రాల సరిహద్దులోని దానా సర్ ప్రాంతంలో బస్సు అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది.

బలూచిస్తాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి షాహిద్ రింద్ తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా మరో బస్సు మార్గమధ్యలో చెడిపోవడంతో అందులోని ప్రయాణికులను కూడా ఈ బస్సులోకి ఎక్కించారు. దీంతో బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో నిండిపోయిందని తెలిపారు. అధిక లోడ్ కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. ఈ దుర్ఘటనపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కూడా ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.