Pakistan – Afghanistan Conflict: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని కోర్టు భవనం వెలుపల ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిని ఆత్మాహుతి దాడిగా పేర్కొంటున్నారు. ఈ దాడిలో 12 మంది మరణించగా, 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ దీనిని యుద్ధ ప్రకటనగా అభివర్ణించారు. ఈ దాడికి ఆయన ఆఫ్ఘనిస్థాన్‌ను నిందించారు. ఈ దాడికి పాకిస్థాన్ తాలిబన్ (TTP) బాధ్యత వహించిందని వార్తలు రావడంతో, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో పెరిగాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరుగుతుందనే భయాలు అలుముకున్నాయి. అయితే మొదట దాడిని ఎవరు ప్రారంభిస్తారు అనేది ఇక్కడ కీలకంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాకిస్థాన్ సైన్యం ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చేయవచ్చని, కానీ తాలిబన్లు ప్రతీకారం తీర్చుకోవడానికి వెనుకాడరని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Hyderabad: రెడ్ లైట్ ఏరియాగా మారిన శ్రీశైలం హైవే? పట్టించుకోని పోలీసులు..!
పాకిస్థాన్ TTP సభ్యులను చంపినందుకు ఈ ఉగ్ర సంస్థ ఇస్లామాబాద్ కోర్టు వెలుపల పేలుడుకు పాల్పడిందని సమాచారం. TTP ఆఫ్ఘనిస్థాన్‌లో దాక్కుందని పాక్ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో పాకిస్థాన్ తాలిబన్ ప్రభుత్వాన్ని నిందిస్తోంది. ఒక ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ మాట్లాడుతూ.. ఇస్లామాబాద్‌పై దాడి చేయడం ద్వారా ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాన్ని రేకెత్తించిందని అన్నారు. అయితే TTP వాదనల గురించి ఆయనకు చెప్పినప్పుడు, ఆయన “నిజంగానా?” అని అడిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే బాంబు దాడిపై పాక్ ప్రజలు ప్రజలు దేశ నిఘా వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
2025 అక్టోబర్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వెంబడి కాల్పులు పెరిగాయి. అక్టోబర్ 19న రెండు దేశాల మధ్య రెండు వారాల పాటు జరిగిన ఘర్షణలో డజన్ల కొద్దీ మంది మరణించారు. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఏర్పడింది, కానీ ఇప్పుడు అది విచ్ఛిన్నమైంది. ఆఫ్ఘనిస్థాన్‌లో 6 వేల కంటే ఎక్కువ మంది TTP యోధులు దాక్కుని పాకిస్థాన్‌పై దాడులు చేస్తున్నారని పాకిస్థాన్ ఆరోపించింది. పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉన్న క్లిష్టమైన డ్యూరాండ్ లైన్ ఎల్లప్పుడూ వివాదానికి కేంద్రంగా ఉంది. పాకిస్థాన్ దీనిని తన సరిహద్దుగా భావిస్తుంది, కానీ ఆఫ్ఘనిస్థాన్ మాత్రం పాకిస్థాన్ దానిని తప్పుగా గీసిందని పేర్కొంది. 1980ల నుంచి పాకిస్థాన్.. ఆఫ్ఘన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించింది, అలాగే తాలిబన్లకు కూడా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్లు అధికారంలో ఉన్నారు. కానీ TTP వంటి గ్రూపులు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
పాకిస్థాన్ “వ్యూహాత్మక లోతు” విధానం ఎదురుదెబ్బ తగిలిందని నిపుణులు అంటున్నారు. మొదట్లో పాకిస్థాన్ భారతదేశానికి వ్యతిరేకంగా బఫర్ జోన్‌ను సృష్టించాలని ఆశపడింది. కానీ ఇప్పుడు ఆ దేశం TTP వలకు చిక్కుకుంది. భారతదేశం – తాలిబన్ల మధ్య ఇటీవలి సాన్నిహిత్యం పాకిస్థాన్‌ను మరింత చికాకు పెట్టింది. పలు నివేదికల ప్రకారం.. పాకిస్థాన్ ఇప్పుడు భారతదేశాన్ని ఈ వివాదంలోకి లాగుతోంది. సైన్యం పరంగా పాకిస్థాన్ బలంగా ఉంది. దాయాది సైన్యం 2017లో చేసినట్లుగానే ఆఫ్ఘన్ సరిహద్దుపై వైమానిక దాడులు చేయగలదు. కానీ తాలిబన్లకు గెరిల్లా యుద్ధంలో అనుభవం ఉంది. వారు సరిహద్దు దాటి దాడులు చేస్తారు. వాస్తవానికి మొదట పాకిస్థాన్ దాడిని ప్రారంభిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.. ఇది “వ్యూహాత్మక ప్రతిష్టంభనగా” పేర్కొన్నారు. రెండు దేశాలు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ అప్పు $100 బిలియన్లకు మించి ఉంది, ఆఫ్ఘనిస్థాన్ కరువుతో పోరాడుతోంది. యుద్ధం రెండింటినీ నాశనం చేస్తుంది. పాకిస్తాన్ రెండు వైపులా యుద్ధం చేస్తోందని చెబుతున్నారు. దేశం లోపల TTP, బయట ఆఫ్ఘనిస్థాన్‌తో పోరాడుతుంది. త్వరలో యుద్ధం రాబోతుందని అంటున్నారు. యుద్ధం జరిగితే లక్షలాది మంది చనిపోతారు. ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటికే తాలిబన్ల వల్ల నాశనమైంది. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ దేశ సరిహద్దులో తన దళాలను పెంచింది. TTP వంటి గ్రూపులను ఎదుర్కోవడానికి ఇరుపక్షాలు కలిసి పనిచేయాలని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Delhi Blast 2025: ఢిల్లీ పేలుళ్లలో తెరపైకి PAFF పేరు.. ! PAFF ఏ ఉగ్ర సంస్థ అనుబంధమో తెలుసా?
