Site icon NTV Telugu

Taliban – Pakistan Meeting: ఊపిరి పీల్చుకున్న దాయాది.. దోహాలో పాక్-ఆఫ్ఘన్ సమావేశం?

Pakistan Afghanistan Ceasef

Pakistan Afghanistan Ceasef

Taliban – Pakistan Meeting: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలలో భారీ కాల్పులు, బాంబు దాడుల తరువాత ప్రస్తుతం రెండు వైపులా కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాజాగా ఆఫ్ఘన్ మీడియా.. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లు, పాక్‌తో చర్చలు జరపవచ్చని నివేదించింది. ఈ సమావేశంలో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై ఇరు వర్గాలు చర్చించే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి మౌల్వీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ నాయకత్వం వహిస్తారని సమాచారం. పాకిస్థాన్ ప్రతినిధి బృందంలో అనేక మంది సీనియర్ భద్రతా, నిఘా అధికారులు ఉంటారని తెలుస్తుంది. అయితే ఈ చర్చలపై ఇరు దేశాల ప్రభుత్వాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

READ ALSO: Fraud: పేరుకు డాక్టర్లు చేసేది మోసాలు.. చిట్టీల పేరుతో రూ. 150 కోట్లు స్వాహా..

ఆఫ్ఘన్ -పాక్ సమస్య పరిష్కారమవుతుందా?
బుధవారం పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ వేర్వేరు ప్రకటనలు జారీ చేస్తూ, సరిహద్దులో రోజుల తరబడి కాల్పుల విరమణను ప్రకటించాయి. కాల్పుల విరమణ ప్రకటనకు ముందు పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి.

కాబూల్‌పై వైమానిక దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘన్.. పాకిస్థాన్ పోలీసు శిక్షణా కేంద్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడిలో అనేక మంది భద్రతా సిబ్బంది మరణించారు. దీని తరువాత పాక్ మళ్లీ ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసింది. పలు నివేదికల ప్రకారం.. పాక్ సైన్యం ఆఫ్ఘన్‌లోని నివాస ప్రాంతంపై దాడి చేసి, అనేక మంది పౌరులను చంపింది. గతంలో పాక్ అధికారులు క్వెట్టాలో నివసించే వారి ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేయమని వారం గడువు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆఫ్ఘన్ ఆన్‌లైన్ ఖామా న్యూస్ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు పేర్కొంది.

పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య వివాదం కొత్తది కానప్పటికీ, TTP రహస్య స్థావరాలపై అణిచివేతపై ఇటీవల వివాదం తీవ్రమైంది. కాబూల్, ఇతర ప్రాంతాలలోని పాకిస్థానీ తాలిబాన్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు దాయాది దేశం పేర్కొంది. కానీ ఆఫ్ఘనిస్థాన్ ఇది తన సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలు దాదాపు యుద్ధంగా మారాయి. తాజాగా ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం ఎన్ని రోజులు అమలులో ఉంటాయో తెలియదు. దోహాలో ఇరుదేశాల ప్రతినిధులు సమావేశం కావడంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

READ ALSO: Gujarat Cabinet 2025: గుజరాత్ కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.. జడేజా సతీమణికి ఏ శాఖ కేటాయించారంటే..

Exit mobile version