Pakistan: దాయాది దేశం పాకిస్థాన్‌లో షాబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సవరణ లక్ష్యం ఏమిటంటే పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ పదవీకాలం, చట్టపరమైన హోదా చుట్టూ ఉన్న అస్పష్టతను తొలగించడం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా లభించిన విషయం తెలిసిందే. అయితే మునీర్ ఈ పదవి నుంచి అధికారికంగా నవంబర్ 28, 2025న పదవీ విరమణ చేయనున్నారు. కానీ పాక్ తాజా రాజ్యాంగ సవరణ ద్వారా ఆయన పదవీకాలం 2027 వరకు పొడిగించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది సక్సె్స్ అవుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం పాకిస్థాన్‌లో అనిశ్చితి కొనసాగుతోంది.
READ ALSO: అధిక కొవ్వు కరిగి ఫిట్‌గా మారేందుకు సూపర్ సీక్రెట్ టిప్స్ !
పలు నివేదికల ప్రకారం.. 2024లో మునుపటి ప్రభుత్వంలో చట్టపరమైన సంస్కరణ ద్వారా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ల పదవీకాలం మూడు నుంచి ఐదు సంవత్సరాలకు పెంచారు. అయితే ఫీల్డ్ మార్షల్ పదవీకాలం, పదవీ విరమణ లేదా సేవా పరిస్థితులను పాకిస్థాన్ రాజ్యాంగం ప్రస్తావించలేదు. దీంతో మునీర్ భవిష్యత్తు అస్పష్టంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. షాబాజ్ ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా మునీర్ స్థానం, అధికారాన్ని కాపాడటానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోందని అంటున్నారు. మునీర్ పదవీ విరమణ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం, GHQ రావల్పిండి (పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయం) తీవ్రమైన చర్చలు జరిపాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాకిస్థాన్ ఆర్మీ చట్టం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 సాయుధ దళాల కమాండ్, నియంత్రణను నిర్వచించినప్పటికీ, అవి ఫీల్డ్ మార్షల్ హోదాను గుర్తించవు లేదా నియంత్రించవు. దీంతో పాక్ ప్రభుత్వం ప్రతిపాదించిన 27వ సవరణ ఫీల్డ్ మార్షల్ స్థానం, అధికారాలు, సేవా పరిస్థితులను అధికారికం చేయడానికి ఆర్టికల్ 243ను సవరించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇది ప్రస్తుత ఆర్మీ చీఫ్‌కు కొనసాగింపును, చట్టపరమైన రక్షణను ఇస్తుందని అంటున్నారు.
పాకిస్థాన్‌లో ఈ సవరణ ఆమోదం పొందిన తర్వాత, ఆర్మీ చీఫ్ అధికారాలు అపరిమితంగా మారతాయని సమాచారం. ఇకపై దేశంలో ఆయనను సవాలు చేయడానికి ఎవరూ ఉండరు. పాకిస్థాన్‌లో ఇప్పటికే సైన్యానిదే అంతిమ అధికారం. అది ఏమి కావాలంటే అది చేయగలదు. అయితే ఈ సవరణ అసిమ్ మునీర్‌కు రాజ్యాంగ రక్షణను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మునీర్ కూడా చాలా కాలం పాటు ఫీల్డ్ మార్షల్ పదవిలో ఉండాలని అనుకుంటున్నాడని సమాచారం. పాకిస్థాన్‌ను సైన్యం సుప్రీం కమాండర్‌గా పరిపాలించాలని ఆయన కలలు కంటున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Groww Success Story: ఓ రైతు కొడుకు రూ.70 వేల కోట్ల కంపెనీకి అధిపతి అయ్యాడు..!
