బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అతి విశ్వాసంతో తొలి ఇన్నింగ్స్‌ను 448/6 వద్ద డిక్లేర్ చేసిన పాక్.. అందుకు భారీ మూల్యమే చెల్లించుకుంది. పాక్ ఓటమిపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. మాజీ క్రికెటర్ కమ్రన్ అక్మల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ఆటగాళ్ల కంటే క్లబ్ క్రికెటర్లే మెరుగ్గా ఆడతారని ఎద్దేవా చేశారు. చెత్తగా ఓడి కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వుతూ ఎలా ఉండగలిగారో తనకు అర్థం కావడం లేదన్నారు. పాక్ క్రికెట్ పూర్తిగా అపహాస్యమైందని అక్మల్ పేర్కొన్నారు.
కమ్రన్ అక్మల్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘మహ్మద్ రిజ్వాన్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా హాఫ్ సెంచరీ చేశాడు. రిజ్వాన్ పరుగులు చేయకుంటే.. పాక్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిని మూటగట్టుకునేది. గత ఐదేళ్లుగా పాక్ టీమ్ ఏమీ నేర్చుకోలేదు. పసికూన జింబాబ్వేపై కూడా ఓడిపోయారు. గత ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లో కూడా చెత్తగా ఆడారు. 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ అదే పరిస్థితి. పాకిస్తాన్ క్రికెట్ పూర్తిగా అపహాస్యమైంది’ అని మండిపడ్డారు.
Also Read: IPL 2025: రోహిత్ శర్మ చాలా కాస్ట్‌లీ గురూ.. అతడిని కొనడం మా వల్ల కాదు!
‘బంగ్లాదేశ్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. ఆ జట్టు ఆటగాళ్లు చాలా కఠిన పరిస్థితుల్లో ఉన్నారు. అయినా కూడా బంగ్లా బ్యాటర్లు చూపిన తెగువ అద్భుతం. మంచి టెస్టు విజయం ఖాతాలో వేసుకున్నారు. పాక్ క్రికెట్ పతనాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పారు. మా బ్యాటర్లు క్లబ్ క్రికెట్‌లో ఆడినట్లు ఆడారు. కాదు కాదు.. క్లబ్ క్రికెటర్లే మెరుగ్గా ఆడతారు. గెలుద్దామనే ఆలోచన మా జట్టులో లేకుండా పోయింది. చెత్తగా ఓడినా డ్రెస్సింగ్ రూమ్‌లో నవ్వుతూ ఎలా ఉన్నారో అర్థం కావడం లేదు. మమ్మల్ని ఎవరూ అడగరని వారికీ తెలుసు. విజయం సాధించిన బంగ్లాకు నా అభినందనలు’ అని అక్మల్ చెప్పారు.