NTV Telugu Site icon

Operation Rope: ట్రాఫిక్‌కు చెక్ పెట్టేలా ‘ఆపరేషన్ రోప్‌ వే’.. యాక్షన్‌లోకి పోలీసులు

Cp Cv Anand

Cp Cv Anand

భాగ్యనగరంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సర్కార్ ఆదేశించింది. ఈ క్రమంలో.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు. ఆపరేషన్ రోప్‌లో భాగంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగించనున్నారు పోలీసులు. ఫిల్మ్ నగర్ నుంచి టోలిచౌకి మెజెస్టిక్ గార్డెన్స్ వరకు రెండు క్యారేజ్‌వేలలో ఆపరేషన్ రోప్‌ను చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు, అధికారులతో కలిసి ఆపరేషన్ రోప్‌లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. రోడ్డుకు అడ్డంగా ఫుట్పాత్‌లపై నిర్మాణాలు, షాపులను తొలగించారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరలో ఆపరేషన్ రోప్ నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు.

Ola Electric: ఓలా నుంచి గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్లు విడుదల.. వీటిల్లో స్పెషల్ ఏంటంటే..?

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో అతి కీలకమైన డిపార్ట్మెంట్ ట్రాఫిక్.. ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించకపోతే నగరవాసులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని సీపీ తెలిపారు. హైదరాబాద్ సిటీలో వాహనాలు సంఖ్య 85 లక్షలకు చేరుకుంది.. రోడ్లు విస్తరించాయి, ఫ్లై ఓవర్స్ నిర్మించారు. వాహనాలు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆశించినంత మేరకు రోడ్లు మాత్రం విస్తరించలేదని పేర్కొన్నారు. నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సీవీ ఆనంద్ కోరారు. ఆపరేషన్ రోప్‌లో స్థానిక ఎమ్మెల్యే రాలేదన్నారు.

నగరంలో ఫుట్ పాత్‌లు చాలా వరకు ఆక్రమణలు గురయ్యాయని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వాళ్లు, పేదవాళ్లు.. మేము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఆక్రమణలు తొలగించాలంటే కొంత మంది అడ్డు పడుతున్నారు.. జీహెచ్ఎంసీ నుండి అనుమతులు లేకుండా ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తున్నారు.. ఇదంతా హైదరాబాద్ సిటీలో మాఫియాలా తయారయిందని తెలిపారు. ఆపరేషన్ రోప్‌లో భాగంగా అనేక అంశాలను పరిశీలించామని సీపీ అన్నారు. మరోవైపు.. వీఐపీ మూమెంట్ పెద్ద సమస్యగా మారింది.. సీఎం, గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు మాత్రమే గ్రీన్ ఛానల్ ఉంటుంది.. తనకు గ్రీన్ ఛానల్ వద్దని సీఎం కోరారు కానీ.. భద్రత దృష్ట్యా గ్రీన్ ఛానల్ పాటించాల్సి ఉంటుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.