ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం ఈరోజు ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమండో ఫోర్స్ (మార్కోస్) చేరుకోనుంది. నేల, నీరు, ఆకాశం.. ఎక్కడైనా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సహాయక చర్యలకు దిగే సత్తా ఈ మార్కోస్‌కు ఉంటుంది. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, ఇంజనీర్లతో కలిసి రెస్క్యూలో మార్కోస్ టీమ్ పాల్గొననుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) లెఫ్టినెంట్ కల్నల్ హరిపాల్‌సింగ్ తన బృంద సభ్యులతో టన్నెల్ వద్దకు రానున్నారు. టన్నెల్‌లో పైకప్పు కుప్పకూలి నాలుగో రోజు అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేసింది.
టన్నెల్ ప్రమాదం జరిగి 96 గంటలు గడుస్తున్నా 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, ఎన్‌జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, ర్యాట్ మైనింగ్ బృందం, మేఘా, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్.. బృందాలు సహాయక చర్యలు చేపట్టినా గల్లంతైన వారి ఆచూకీ తేలలేదు. రెస్క్యూ బృందాలు టన్నెల్‌లో జీరో పాయింట్ దగ్గరకి చేరుకోగలిగాయి. 1600 టన్నుల బరువున్న టీబీఎం మిషన్ అడ్డు తొలగిస్తే తప్ప ముందుకు పోలేని పరిస్థితి నెలకొంది. ఇంజనీర్లు డేంజర్ జోన్‌గా చెబుతున్నారు. రిస్క్ తీసుకుంటే రెస్క్యూ బృందాలకు కూడా రిస్క్ తప్పదని హెచ్చరిస్తున్నారు. బురద, నీరు, సామగ్రిని తొలగిస్తేనే తప్ప కార్మికుల ఆచూకీ గుర్తించడం కష్టమని తేలింది. అందులకే ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఛేదించగలిగే సత్తా ఉన్న మార్కోస్‌ను రంగంలోకి దింపుతున్నారు. మార్కోస్‌తో బీఆర్‌వో భాగస్వామ్యం పంచుకోనుంది. మార్కోస్, బీఆర్‌వోలతో కలిపి 10 మంది నిపుణులతో ఓ ప్రత్యేక బృదం సిద్దమైంది.