Diwali Celebration Date Controversy: ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు.. ఈ రోజు జరుపుకుంటే మంచిదని కొందరు.. లేదు.. ఆ రోజే బెటర్ అని మరికొందరు వాదించిన సందర్భాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం.. పండుగల సమయంలో.. పంచాంగ కర్తలు మధ్య రెండు వాదనలు.. విభేదాలకు దారితీస్తున్నాయి.. అయితే.. ఇప్పుడు దీపావళి పండుగను ఏ తేదీన జరుపుకోవాలనే విషయంపై పంచాంగ కర్తల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. దీపావళి అక్టోబర్ 31వ తేదీన కాదు.. నవంబర్ 1న జరుపుకోవాలని కోనసీమ ధృక్ సిద్ధాంత పంచాంగ కర్తలు గణన చేస్తుండగా.. లేదు లేదు.. అక్టోబర్ 31వ తేదీనే జరుపుకోవాలని రేలంగి తంగిరాల పంచాంగ కర్తలు పేర్కొంటున్నారు.
Read Also: AP Incharge Ministers: జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రుల నియామకం.. పవన్ కల్యాణ్, లోకేష్‌కు నో ఛాన్స్..!
రేలంగి తంగిరాల వారి పంచాంగాన్ని.. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం అధికారికంగా అనుసరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీపావళి సెలవును అక్టోబరు 31న ప్రకటించింది. కానీ, రేలంగి తంగిరాల పంచాంగం సరైన పద్ధతిలో గుణించలేదని.. అది తప్పని కోనసీమ పంచాంగ కర్తలు పేర్కొంటున్నారు. పూర్వ పద్ధతి, ధృక్ సిద్ధాంతాన్ని కలగలిపి పంచాంగాన్ని రూపొందించిన రేలంగి తంగిరాల సిద్ధాంతి వైఖరిని.. కోనసీమ పంచాంగ కర్తలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ధృక్ సిద్ధాంత పంచాంగాన్నే ఆమోదించిందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోనసీమ పంచాంగ కర్తలు కారుపర్తి నాగ మల్లేశ్వర సిద్ధాంతి, గొర్తి సుబ్రహ్మణ్య పట్టాభి సిద్ధాంతి, ఉపద్రస్ట నాగాదిత్య సిద్ధాంతి, విజయవాడకు చెందిన పులిపాక చంద్ర శేఖర శర్మ సిద్ధాంతి విజ్ఞప్తి చేశారు. సూర్యోదయం ఉన్న తిథినే ప్రామాణికంగా తీసుకుని దీపావళి పండుగను నవంబర్ 1వ తేదీన జరుపుకోవాలని కోనసీమ పంచాంగ కర్తలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే, దీపావళి ఏ రోజు అనే విషయంలో వివాదం చోటుచేసుకున్న వేళ.. ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఏమైనా ప్రకటన చేస్తుందేమో చూడాలి.