Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. ఓ నావికుడు మృతి

Oman Coast

Oman Coast

Oman Coast Ship Attack: ఒమన్ తీరానికి సమీపంలో భారతీయ జెండాతో వెళ్తున్న ఒక కార్గో షిప్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో ఓ భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో షిప్‌లో ఉన్న మిగతా 13 మంది నావికులను ఒమాన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఈ విషయాన్ని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. సోమవారం జరిగిన ఈ ఘటన వివరాల ప్రకారం.. MSV అల్ జుసుఫీ (MSV Al Jusufi) అనే పేరున్న ఈ కార్గో షిప్ ఒమాన్ తీరం వెంబడి ప్రయాణిస్తున్న సమయంలో గుర్తుతెలియని ఏరియల్ ఆబ్జెక్ట్ (విమాన లేదా డ్రోన్ తరహా వస్తువు)తో దాడి జరిగింది. ఈ ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన గంధార్ నహిమ్ అజీజ్ అనే నావికుడికి తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల మంత్రి సోనోవాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.

ప్రస్తుతం ఒమాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ప్రాణాలతో బయటపడిన 13 మందికి తక్షణ సాయం అందేలా చూడటంతో పాటు, వారిని, మృతి చెందిన నావికుడి పార్థివదేహాన్ని త్వరలోనే భారత్‌కు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, హూతీల దాడుల కారణంగా గల్ఫ్ ప్రాంతంలోని కీలక సముద్ర మార్గాల్లో నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారతీయ జెండా ఉన్న నౌకలను టార్గెట్ చేయడం చాలా అరుదైనప్పటికీ, ఈ ప్రాంతంలో నెలకొన్న ఘర్షణల ప్రభావం మాత్రం నావికులపై తీవ్రంగా పడుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన నాటి నుంచి సముద్ర మార్గాల్లో పనిచేస్తున్న 14 మంది నావికులతో సహా మొత్తం 22 మంది భారతీయులు వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.