Hyderabad: నగరంలోని పాతబస్తీ మదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. మదర్సాలో చదువుకుంటున్న 11 ఏళ్ల మైనర్ బాలుడిపై అరబిక్ బోధించే మౌల్సాబ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే?
కుర్మగూడలోని ఫాతిమా మసీదు మొదటి అంతస్తులో బాబా షరీఫుద్దీన్ మదర్సా కొనసాగుతోంది. బాధిత బాలుడు ఇక్కడే అరబిక్ పాఠాలు నేర్చుకుంటున్నాడు. రోజూలాగే మదర్సా ముగిసిన తర్వాత ఇంటికి బయలుదేరిన బాలుడిని, అరబిక్ బోధించే మౌల్సాబ్ తిరిగి పై అంతస్తుకు పిలిచాడు. అనంతరం మసీదు ఇన్చార్జ్ అబ్బాస్ గదిలోకి తీసుకెళ్లి, మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూపించాడు. ఆ తర్వాత బాలుడి ప్రైవేట్ భాగాలను తాకుతూ తీవ్ర అసభ్యంగా ప్రవర్తించాడని సమాచారం. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బాలుడిని బెదిరించాడు.
వెలుగులోకి తెచ్చిన తల్లి..
భయాందోళనకు గురైన బాలుడు ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఆరా తీయగా సదరు నిందితుడి పేరు మాసి హుజ్జామా అని తెలిసింది. వెంటనే బాలుడి తల్లి మదన్నపేట పోలీసులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బాధిత బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 127(2), 351(2) సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుంచి చిన్నారుల రక్షణ చట్టం (POCSO) సెక్షన్లు 8, 10 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత బాలుడి వాంగ్మూలం నమోదు చేయడం, కౌన్సెలింగ్ నిమిత్తం భరోసా కేంద్రానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

