NTV Telugu Site icon

Ola Uber Services: 3రోజుల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసులు బంద్

Ola

Ola

Ola Uber Services: ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసులకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. ఈ మూడు హైరింగ్ సర్వీసులను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీలు ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని చార్జీలను భారీ పెంచాయి. దీంతో మూడు రైడ్ హైరింగ్ సంస్థలు ఏఎన్ఐ టెక్నాలజీస్(ఓలా పేరెంట్ సంస్థ), ఉబర్, ర్యాపిడోలకు నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో సర్వీసులను నిలిపి, నివేదిక పంపాల్సిందిగా కర్ణాటక ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఆదేశించింది. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా ఈ సంస్థలు కనీస చార్జీల కింద 100రూపాయలు వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు కర్నాటక ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్ వద్ద ఫిర్యాదు చేశారు.

బెంగళూరులో మినిమమ్ ఆటో ఛార్జీని తొలి రెండు కిలోమీటర్లకు రూ.30గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత కిలోమీటర్‌కి రూ.15 చొప్పున పెరుగుతూ వెళ్తుంది. కానీ ఈ రైడ్ హైరింగ్ సంస్థల ఛార్జీలు రెండు కి.మీలకే కనీసం రూ.100 ఛార్జీ విధిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అత్యధికంగా ప్రయాణికుల వద్ద నుంచి ఛార్జీలు వసూలు చేయడానికి వీలులేదని తెలిపింది. ఆటో సర్వీసుల మూడు రోజుల్లోగా ఆపివేయాలని ఆదేశించిన ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్.. ట్యాక్సీలను నడుపుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. కర్నాటక ఆన్ డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్స్ రూల్స్, 2016 కింద కేవలం ట్యాక్సీలను నడుపుకునేందుకు మాత్రం లైసెన్సులను మంజూరు చేస్తున్నట్టు ట్రాన్స్‌పోర్టు కమిషనర్ టీహెచ్‌ఎం కుమార్ తెలిపారు. ఈ రూల్స్ ఆటోలకు అప్లయ్ కావని పేర్కొన్నారు.

Read Also: Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ యాక్సిడెంట్.. గేదెల యజమానుల కోసం గాలింపు

ట్యాక్సీలంటే.. డ్రైవర్‌ను మినహాయించి ఆరుగురికి మించి కూర్చునేందుకు వీలు లేని సీటింగ్ సామర్థ్యం ఉన్న మోటార్ క్యాబ్‌ అని టీహెచ్‌ఎం కుమార్ తెలిపారు. పైన పేర్కొన్న రెగ్యులేషన్స్‌ను అతిక్రమించి, ఈ వెహికిల్ అగ్రిగేటర్ సంస్థలు ఆటో రిక్షా సర్వీసులను అందజేస్తున్నాయని అన్నారు. క్యాబ్ అగ్రిగేటర్ లైసెన్సులతో ఆటో రిక్షాలను నడపడానికి వీలు లేదని స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ సెక్రటరీ, ట్రాన్స్‌పోర్టు అదనపు కమిషనర్ ఎల్ హేమంత్ కుమార్ అన్నారు. అగ్రిగేటర్ రూల్స్ కేవలం క్యాబ్‌లకు మాత్రమేనని తెలిపారు. యాప్‌ల ద్వారా అందిస్తున్న ఆటో రిక్షా సర్వీసులను ఆపేయాలని తాము ఆదేశించామని, వెంటనే దీనిపై రిపోర్టు సమర్పించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.