NTV Telugu Site icon

Off The Record : ఏపీ యంత్రాంగం సీఎం ఆలోచనకు తగ్గట్టు పని చేయడం లేదా..?

Otr

Otr

ఆంధ్రప్రదేశ్‌ అధికార యంత్రాంగంలో అలసత్వం అరచేతి మందాన పేరుకుపోతోందా? సీఎం స్పీడ్‌…స్పీడ్‌… అంటున్నా, వాళ్ళు మాత్రం మన్నుతిన్న పాముల్లా కదులుతున్నారా? తీరు మార్చుకోవాలని సీఎం పదేపదే చెబుతున్న మాటలు ఉన్నతాధికారుల చెవికెక్కడం లేదా? నేను 95 సీఎంని అవుతానన్న చంద్రబాబు ప్రకటనలు కేవలం మాటలేనా? ఆ… అయినప్పుడు చూద్దాంలే అని ఆఫీసర్స్‌ అనుకుంటున్నారా? అసలు ఏపీ సెక్రటేరియెట్‌లో ఏం జరుగుతోంది? నాలో… మళ్ళీ.. నైన్టీ ఫైవ్‌ సీఎంని చూస్తారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ముహూర్తాన అన్నారోగానీ…. అప్పటి నుంచి ఆయనలో స్పీడ్‌ పెరిగిందన్న చర్చ నడుస్తోంది ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో. అదే సమయంలో మరో మాటా వినిపిస్తోంది. స్పీడ్‌ ఆయన ఒక్కడిలో పెరిగితే సరిపోతుందా? మిగతా యంత్రాంగం సంగతేంటన్నది ఇప్పుడు క్వశ్చన్‌. 95లో పని చేసినట్టుగానే… తిరిగి సీఎం యాక్టివ్‌ అవుతున్నా… అధికారులు మాత్రం అందుకు సిద్ధంగా లేరన్నది లేటెస్ట్‌ టాక్‌. అటు ఆఫీసర్స్‌ కావచ్చు… ఇటు మంత్రులు కావచ్చు. అన్ని వైపుల నుంచీ…అనిశ్చితి వాతావరణమే ఉందని అంటున్నారు. సీఎం చెప్తున్న దానికి, వారు చేసే పనికి పొంతనే లేదన్న చర్చ నడుస్తోంది. అసలెక్కడా ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యవహారాలు నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. జనంలో కూడా ఇదే అభిప్రాయం మెల్లిగా బలపడుతోందని అంటున్నారు. ఉదాహరణకు ఫైళ్ల క్లియరెన్స్ అంశాన్నే తీసుకుంటే… ఆ విషయంలో ఉన్నతాధికారులు సైతం అలసత్వంగా ఉన్నారని, కొందరైతే… అసలు అది తమ సబ్జెక్ట్‌ కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. నిజమేనా అన్నట్టు… ఇదే అంశాన్ని తాజా ఆఫీసర్స్ మీటింగ్‌లో ఎత్తి చూపారు చంద్రబాబు. దీంతో అధికారులు ఉదాసీనంగా ఉంటున్నారన్న చర్చ ఎక్కువైంది. సీఎం చెప్పక ముందే కొందరు అధికారుల పని తీరు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గుట్టలు గుట్టలుగా ఫైల్స్‌ పేరుకుపోవడం, మంత్రులు చెప్పినా కూడా కొందరు అధికారులు మాట వినకపోవడం లాంటివి ఎక్కువయ్యాయన్న మాటలు వినిపిస్తున్నాయి సచివాలయ వర్గాల్లో. కొన్ని సందర్భాల్లో మంత్రులే స్వయంగా అధికారులు పై విమర్శలు చేస్తున్నారట. పదవిలో ఉండి కూడా కేవలం అధికారుల వైఖరివల్ల బాధితులకు న్యాయం చెయ్యలేకపోతున్నామని తలలు పట్టుకుంటున్న అధికారులు సైతం ఉంటున్నారంటే… పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. ఈ ఉదాసీనత అటు సీఎంకు సైతం తలనొప్పిగా మారుతున్నట్టు సమాచారం.

మీటింగ్‌లో చిన్న పిల్లలకు చెప్పినట్టు ముఖ్యమంత్రి చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. ఉన్నతాధికారులను సైతం స్కూల్‌ పిల్లల్ని మందలించినట్టు మందలించాల్నా? అసలు వాళ్ళకు బాధ్యత లేదా? త్వరగా ఫైల్స్‌ క్లియర్‌ చేసి బాధితులకు న్యాయం చేయలేరా అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అటు టీడీపీ వర్గాలు సైతం ఇలాంటి విషయాల్లో చాలా అసహనంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే…. అందుకు కారణాలు చాలానే ఉన్నాయన్నది ఇంకో వెర్షన్‌. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల కల్చర్‌లో పవర్‌ మారినప్పుడల్లా… అధికారుల స్థానాలు కూడా మారిపోతున్నాయి. నేతల మధ్య పాత కక్షలు, కేసులు ఇలా చాలా అంశాలు ఆఫీసర్స్‌కు అవకాశంగా మారుతున్నాయన్న అబిప్రాయం ఉంది. దీంతో సిన్సియర్‌గా పనిచేయాలనుకునే వారి లక్ష్యం దెబ్బతింటోందని కూడా చెప్పుకుంటున్నారు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటున్న కొంతమంది అధికారులు భూ లావాదేవీలు, సెటిల్మెంట్లు, విచ్చలవిడి వ్యాపారాల్లా మునిగి తేలుతూ అసలు పని మర్చిపోతున్నారట. ఏపీలో పని చేసే చాలామంది అధికారులు హైదరాబాద్ కేంద్రంగా లావాదేవీలు నడిపిస్తున్నారంటే… వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు వీటన్నిటినీ గమనిస్తున్నవాళ్ళు. అమరావతిలో ఉండేది ఐదు రోజులే…. వీకెండ్ వచ్చిందంటే చాలు… ఫ్రైడే సాయంత్రమే హైదరాబాద్‌కు జంప్‌, తిరిగి మండే మధ్యాహ్నానికి రిటర్న్‌ అన్నట్టుగా ఉందట వ్యవహారం. మండే మధ్యాహ్నం నుంచి మళ్లీ శుక్రవారం సాయంత్రం కోసం ఎదురు చూసే బ్యాచే ఎక్కువ అవుతోంది తప్ప…పని మీద శ్రద్ధ తగ్గిపోతోందన్నది సచివాల వర్గాల టాక్‌. చంద్రబాబు నేను మళ్ళీ 95 సీఎంని అవుతానని అంటున్నా… ఆ… చూద్దాంలే, ఇప్పుడది అంత వీజీగా అంటూ సెటైరికల్‌గా మాట్లాడే బ్యాచ్‌ కూడా ఉందట ఏపీ సెక్రటేరియెట్‌లో. ప్రస్తుతం ఆర్థికంగా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున కూటమి ప్రభుత్వంపై బాధ్యత చాలా ఉందని, ఇప్పుడు అధికారులు ఆషామాషీగా ఉంటే… ఇటు గవర్నమెంట్‌తో పాటు అటు రాష్ట్రానికి కూడా చేటన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే… ముఖ్యమంత్రికి యంత్రాంగం మీద పట్టు తప్పుతోందా అని ప్రశ్నించే వాళ్ళు సైతం పెరుగుతున్నారు. ముఖ్యంగా కొందరు అదికారుల్లో భయం పోయి… ఉదాసీనత పెరుగుతోందని, ప్రభుత్వ ఐఎఎస్‌ల నుంచి కింది స్థాయిదాకా… ఒక గట్టి కుదుపు కుదిపితే తప్ప మేటర్‌ సెట్‌ కాదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అధికారులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలని సీఎం చెబుతున్నా…అది ఆచరణలో ఎంతమంది పాటిస్తారన్న చూడాలి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ ఉన్నతాధికారుల్లో అలసత్వం, ఫైళ్ళ క్లియరెన్స్‌లో నిర్లక్ష్యంపై సీఎం కామెంట్స్‌ తర్వాత విస్తృత చర్చే జరుగుతోంది.