NTV Telugu Site icon

Off The Record : R-5 జోన్ ను అధికార పార్టీ బ్రహ్మాస్త్రంగా భావిస్తోందా?

Lokesh Otr

Lokesh Otr

అమరావతి ఆర్‌5 జోన్‌ వెనక అసలు కథ వేరే ఉందా? మంగళగిరిలో లోకేష్‌ టార్గెట్‌గా అధికార పార్టీ పావులు కదిపిందా? అక్కడ ఇళ్ళ పట్టాలకు, లోకేష్‌ పోటీకి ఉన్న లింకేంటి? వేలాది కుటుంబాల తరలింపుతో వైసీపీ తనను టార్గెట్‌ చేస్తోందని టీడీపీ నేత ముందే పసిగట్టారా? విరుగుడు మంత్రాన్ని సిద్ధం చేసుకున్నారా? పేదల ఇళ్ళ పట్టాల చుట్టూ అసలేం జరుగుతోంది?

ఆర్‌-5 జోన్‌… వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో ఇది ఖచ్చితంగా మేజర్‌ పొలిటికల్‌ జోన్‌గా మారే సూచనలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్‌-5 జోన్‌ పరిధిలో చేస్తోంది ప్రభుత్వం. న్యాయ పరమైన చిక్కుల్ని దాటుకుని పట్టాల పంపిణీకి మార్గం సుగమం అయింది. దీంతో అక్కడ లేఔట్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తం 1402 ఎకరాల్లో 50 వేల పేద కుటుంబాలకు మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ చేసేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలో అన్ని చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ జరిగినా.. ఇక్కడ మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. దీనికి పొలిటికల్‌ కలర్‌ చాలా ఎక్కువగా ఉంది. అసలీ ఇళ్ళ పట్టాల పంపిణీ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ టార్గెట్‌గానే జరుగుతోందన్న చర్చ జరుగుతోంది.

ఆర్‌-5 జోన్‌ పరిధిలోని లబ్దిదారులంతా విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలు, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందినవారు. టార్గెట్‌ లోకేష్‌ అన్న చర్చ జరగడానికి ఇదే అసలు కారణం. మొత్తం లబ్దిదారుల కుటుంబాలు ఐదువేల నాలుగు. వీరంతా పేదలే. అందరికీ కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రు, ఐనవోలు, బోరుపాలెం, నెక్కల్లు, పిచ్చుకలపాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో స్థలాలు కేటాయిస్తున్నారు. వీటిలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రు గ్రామాల్లోనే సుమారు 45 వేల మంది లబ్దిదారులు ఉంటారు. అంటే.. రాబోయే ఎన్నికల నాటికి వీరంతా మంగళగిరి నియోజకవర్గం ఓటర్లు అవుతారు. 45 వేల మంది లబ్దిదారులంటే ఇంటికి రెండు ఓట్ల లెక్కన సరాసరి చూసుకున్నా…90 వేల ఓట్లు ఉంటాయనేది అంచనా. ఈ 90 వేల ఓట్లలో మెజార్టీ వాటా గంపగుత్తగా వైసీపీకి పడితే.. లోకేష్‌ పోటీ చేయబోతున్న మంగళగిరిలో తమపని తేలిక అవుతుందన్నది అధికార పార్టీ లెక్కగా చెబుతున్నారు. అలా జరిగితే వార్‌ వన్‌సైడ్‌ అవుతుందనేది వైసీపీ నేతల అభిప్రాయం.

గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు లోకేష్‌. వేరే నియోజకవర్గానికి మారాలని చాలా సూచనలు వచ్చినా.. పోయిన చోటే వెతుక్కోవాలనే పట్టుదలతో ఉన్నారాయన. ఓడిపోయిన నాటి నుంచి మంగళగిరిపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ప్రతి గ్రామాన్ని.. టచ్‌ చేస్తూ యాత్రలు నిర్వహించారు. విస్తృతంగా పర్యటించి.. స్థానికులతో బాండింగ్‌ ఏర్పాటు చేసుకుంటే ఈసారి గెలుపు తేలిక అవుతుందని భావిస్తున్నారు లోకేష్‌. దీనికి తోడు అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. జనసేనతో పొత్తు ఫైనల్‌ అయితే మంగళగిరిలో లోకేష్‌ గెలుపు నల్లేరు మీద నడకేనని భావించింది టీడీపీ. ఈ పరిస్థితుల్లో ఆర్‌-5 జోన్‌ అనే అస్త్రంతో పక్క నియోజకవర్గాల నుంచి భారీగా ఓటర్లను మంగళగిరిలోకి డంప్‌చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైందట. పక్కా వైసీపీ అనుకున్న వాళ్లంతా ఇళ్ళ పట్టాలు వచ్చాక మంగళగిరిలో ఓటర్లుగా నమోదు చేయించుకుంటే పరిస్థితేంటని అంటున్నారట ప్రతిపక్ష నేతలు.

అయితే దీనికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని, వైసీపీ ఆలోచనకు విరుగుడు మంత్రం తమ దగ్గర ఉందని చెబుతోందట లోకేష్‌ టీం. ఇలా డంప్‌ అయిన ఓటర్లను కూడా తమవైపు తిప్పుకునే ప్రణాళికలు ఉన్నాయంటున్నారు స్థానికంగా లోకేష్‌ వ్యవహారాలు చూస్తున్న నాయకులు. ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్‌-5 జోన్‌ అంశాన్ని తెర మీదకు తెచ్చిందో.. అప్పుడే మంగళగిరిలో లోకేష్‌ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు తాము ఊహించామని అంటున్నారు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్దం చేస్తున్నామని చెబుతున్నారు. అది ఏంటన్నది మాత్రం ఇప్పుడే బయటపెట్టబోమంటున్నారు. వారి ఆలోచనలు అంచనాలు ఎలా ఉన్నా.. లోకేష్‌ టార్గెట్‌గా ఆర్‌-5 జోన్‌ బ్రహ్మాస్త్రమే అంటోంది అధికార పార్టీ. మరి ఆ అస్త్రాన్ని ఎదుర్కుని లోకేష్‌ నిలబడతారా లేక తలొగ్గాల్సి వస్తుందా అన్నది పోలింగ్‌ తర్వాత తేలాల్సిన అంశం.