NTV Telugu Site icon

Off The Record : ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయా? వైసీపీలో దిద్దుబాటు మొదలైందా?

Ycp Otr

Ycp Otr

ఉమ్మడి ప్రకాశం వైసీపీలో భారీ మార్పులే జరగబోతున్నాయా? ఆ దిశగా పార్టీలో కసరత్తు జరుగుతోందా? ఎన్నికల టైంలో నియోజకవర్గాలు మారిన నేతలు కొత్త స్థానాలు మాకొద్దు బాబోయ్‌…. అని మొత్తుకుంటున్నారా? అలా సేఫ్‌ జోన్‌ వెదుక్కుంటున్న నాయకులు ఎవరు? జిల్లాలో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంది? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక్క ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్‌ మినహా… మిగతా 11 చోట్ల కొత్త అభ్యర్థుల్నే బరిలో దింపింది వైసీపీ. కానీ… కేవలం దర్శి, యర్రగొండపాలెంలో మాత్రమే గెలవగలిగింది. పార్టీ అధిష్టానం వ్యూహాలు వర్కవుట్ కాకపోవటంతో 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీలతో గెలిచిన నియోజకవర్గాల్లో సైతం ఈసారి దారుణ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇక ఎన్నికల తర్వాత జరిగిన పోస్ట్‌మార్టంలో తప్పు తెలుసుకున్న అధిష్టానం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల అధ్యక్షులను మార్చిన అధిష్టానం.. ఇక నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లను సైతం మార్చాలనుకుంటున్నట్టు సమాచారం. వికటించిన ప్రయోగాలన్నిటికీ స్వస్తిచెప్పి తిరిగి నాయకులందర్నీ ఎవరి నియోజకవర్గాలకు వారిని పంపాలని అనుకుంటున్నారట పార్టీ పెద్దలు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, గిద్దలూరు, మార్కాపురం ఇన్ఛార్జ్‌ల మార్పు ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి ఓడిన మాజీమంత్రి మేరుగు నాగార్జునకు ఇటీవలే బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన తన సొంత నియోజకవర్గం వేమూరుకు రిటర్న్ అవ్వవచ్చని భావిస్తున్నారు.. ఇప్పటికే అక్కడి ఆయన అనుచరులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వాట్సాప్‌ పోస్టింగులు సర్క్యులేట్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. బాధ్యతలు ఇవ్వక ముందే అలా ఎలా చేస్తారంటూ… వేమూరు వైసీపీ ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనే ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించినట్లు సమాచారం.

ఇక గత ఎన్నికల్లో మార్కాపురం నుంచి పోటీ చేసిన అన్నా రాంబాబు, గిద్దలూరు నుంచి పోటీ చేసిన కుందురు నాగార్జునరెడ్డి కూడా 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన స్దానాల్లోకే రీ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారట. మార్కాపురం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన నాగార్జున రెడ్డి లాస్ట్‌ ఎలక్షన్స్‌లో గిద్దలూరు నుంచి బరిలో దిగి స్వల్ప తేడాతో ఓడారు. ఫలితాల తర్వాత అడపాదడపా గిద్దలూరు వెళ్తున్నా… ఆయన మనసంతా మార్కాపురం పైనే ఉందట. తాను తిరిగి మార్కాపురం వెళ్తానని పార్టీ అధినేతకు చెప్పినట్టు, త్వరలోనే అంతా సర్దుబాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు మాట్లాడుకుంటున్నాయి స్థానిక పార్టీ వర్గాలు. దీంతో ఇప్పటికే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ప్రస్తుత ఇంచార్జ్ అన్నా రాంబాబును వదిలేసి నాగార్జునరెడ్డికి టచ్‌లోకి వెళ్ళినట్టు సమాచారం. ఇక గిద్దలూరు విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో 80 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన అన్నా రాంబాబును మార్కాపురంలో పోటీ చేయించింది అధిష్టానం. ఓటమి తర్వాత అన్నా కూడా గిద్దలూరు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. 2009 నుంచి గిద్దలూరులో రాజకీయాలు చేసిన అనుభవంతో ఇక అక్కడే ఉండాలనుకుంటున్నారట రాంబాబు. అయితే ఆయన
రీ ఎంట్రీని కొందరు స్దానిక నేతలు వ్యతిరేకిస్తున్నట్లు టాక్. ఒకవేళ ఇంచార్జ్ ను మారిస్తే తనకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారట గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన వైసీపీ నేత కామూరి రమణారెడ్డి. మెజారిటీ నేతలు గిద్దలూరు నియోజకవర్గ నేతలకే ఇన్ఛార్జ్‌ అవకాశం కోసం చూస్తున్నారని, అందుకే లోకల్ కోటాలో తనకు ఛాన్స్‌కావాలని అంటున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఇవేనా? లేక ఇంకేమైనా నియోజకవర్గాల ఇన్ఛార్జ్‌లు మారతారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. దీంతో జరగబోయే మార్పుల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి ఉమ్మడి ప్రకాశం రాజకీయ వర్గాలు.

Show comments