సింహపురిలో ఫ్యాన్ రెక్కలు వేటికవే వంగిపోయి తిరుగుతున్నాయా? బెండ్ తీసేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నా.. ససేమిరా అంటున్నాయా? ఫ్యాన్ రిపేరవక కేడర్ ఉక్కపోతగా ఫీలవుతోందా? ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? అధికారంలో ఉన్నప్పుడు అట్లున్న పార్టీ ఇప్పుడెట్లా అయిపోయింది? నేతల మనసులు కలవబోమంటున్నాయా? ఏపీలో ఒకప్పుడు వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు ఒకటి. 2014 ఎన్నికల్లో రాష్ట్ర మంతటా టిడిపి గాలి వీచినా నెల్లూరులో మూడు సీట్లకే పరిమితం అయింది. ఇక 2019లో అయితే జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. కానీ…2024కు వచ్చేసరికి పూర్తిగా చతికిలబడిపోయింది. నేతల మధ్య ఐక్యత లోపించడమే అందుకు కారణం అన్నది వైసీపీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ అట. అందుకు తగ్గట్టుగానే… పార్టీ ఓడిపోయాక పలువురు నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటూ … సొంత వ్యవహారాల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి కాకాణితోపాటు అతికొద్ది మంది నాయకులు మాత్రమే పార్టీ తరపున మాట్లాడుతున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు ఎదుర్కోవడంతోపాటు… తామము పవర్‌లో ఉన్నప్పుడు వెలగబెట్టిన వ్యవహారాల మీద దర్యాప్తులు మొదలవుతాయన్న భయం కూడా ఎక్కువ మందిలో ఉన్నట్టు తెలిసింది. ఇక పార్టీ ప్రక్షాళనలో భాగంగా..పాత అధ్యక్షుడిని మార్చేసి కాకాణి గోవర్ధన్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించారు జగన్. ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు కార్పొరేషన్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఆ క్రమంలోనే నెల్లూరు జిల్లా నేతలతో జగన్… ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆదేశించారట. కానీ… అదేదీ వాస్తవంలో కనిపించడం లేదన్నది స్థానిక పార్టీ వర్గాల మాట. కాకాణి జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పార్టీని పటిష్టం చేసేందుకు అన్ని నియోజకవర్గ ఇంచార్జ్ లు..సీనియర్ నేతలతో సమావేశం పెట్టారు. కానీ ఆ మీటింగ్‌కు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి హాజరవలేదు. దీంతో స్వయంగా పార్టీ అధ్యక్షుడు ఆదేశించినా… నేతల మధ్య సమన్వయం కుదరలేదని, వీళ్ళెలా పార్టీని ముందుకు తీసుకువెళ్తారని మాట్లాడుకుంటున్నారట కార్యకర్తలు.
ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే… నాయకుల మధ్య కో ఆర్డినేషన్ లేదుగానీ… నియోజకవర్గాల్లో ఎక్కడైనా కార్యకర్తల్ని వేధిస్తే… అంతా కలిసి ఉమ్మడిగా వెళ్ళి అక్కడ ఆందోళనలు చేయాలని సదరు సమావేశంలో తీర్మానించారట. ఇక కావలి నియోజకవర్గ ఇన్చార్జ్… రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కువ సమయం..బెంగళూరులోనే ఉంటూ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారట. నియోజకవర్గానికి ఆయన చుట్టపు చూపుగా వస్తున్నారే తప్ప రెగ్యులర్‌గా మీటింగ్‌లు పెట్టడం, కేడర్‌కు భరోసా ఇవ్వడం లాంటి కార్యక్రమాలు జరగడం లేదన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఉదయగిరి
ఇన్ఛార్జ్.. మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా ఎక్కువ సమయాన్ని తన సొంత వ్యవహారాలకే కేటాయిస్తున్నట్టు చెబుతోంది కేడర్. గూడూరుకు ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ ఇన్చార్జిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన కూడా నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా ఎక్కడికక్కడ పార్టీ నేతలు కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో మొత్తంగా జిల్లా పార్టీలో నిస్తేజం ఆవరించిందన్నది లోకల్ టాక్. ఎన్నికల సమయంలోనే సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు టిడిపిలోకి వెళ్లిపోయారు. ఇక ఓటమి తర్వాత పెద్ద నాయకులు కూడా పట్టించుకోవడం మానేయడంతో… కార్యకర్తలు డిఫెన్స్‌లో పడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ముఖ్య నాయకులు గ్రామాల్లో పర్యటించి కార్యకర్తల్లో ఊపును తీసుకురావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆదేశించినా… ఒక్కరు కూడా కదిలిన పాపాన పోలేదంటున్నారు. అటు కాకాణి మాత్రం…. ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి టిడిపి నేతల తీరును విమర్శిస్తూ…తమ లీడర్స్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప… వాళ్ళందర్నీ ఒక్క తాటి మీదికి తెచ్చేందుకు ఏం ప్రయత్నాలు చేస్తున్నారన్నది జిల్లాలో జరుగుతున్న చర్చ. నియోజకవర్గ స్థాయి నాయకులు సహకరిస్తేనే జిల్లాలో పార్టీ కొంతమేరైనా కోలుకుంటుందని, లేదంటే… కేడర్‌లో నైతిక స్థైర్యం పోయి…ఇతివార్తాహ అనాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తం అవుతోందట పార్టీ వర్గాల్లో. ఇలాంటి పరిస్థితుల్లో సింహపురి వైసీపీ లీడర్స్ కలిసికట్టుగా సై అంటారా? లేక ఎవరికి వారుగా ఉంటూ నై అంటారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.