ఆ నియోజకవర్గంలో దశాబ్దాలుగా టీడీపీకి ప్రత్యామ్నాయం ఆ నాయకుడే. కాంగ్రెస్ నుంచి ఒకసారి, వైసీపీ నుంచి రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు లెక్క తప్పింది! అనుచరగణమంతా గుడ్ బై చెప్పి పోతున్నారు. ఎందుకలా అంటే సౌండ్ లేదు! కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం. నియోజకవర్గంలో 1994 నుంచి ఇద్దరు నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. మూడు దశాబ్దాలుగా ఇద్దరిదే హవా అక్కడ. అయితే మీనాక్షి నాయుడు. లేదంటే వై. సాయిప్రసాదరెడ్డి. 2004 వరకు కాంగ్రెస్‌లో ఉన్న సాయిప్రసాదరెడ్డి 2009లో ఓటమి తర్వాత 2014లో వైసీపీ నుంచి పోటీ చేశారు. 2019లోనూ ఆయనే గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈసారి కూడా జగన్ ఆయనకే టికెట్ ఇస్తే.. కూటమి లెక్కల్లో పడి ఈక్వేషన్ తారుమారైంది. ఎవరూ మూడోసారి గెలవరనే సెంటిమెంటు నిజమైంది. అలా సాయి ప్రసాదరెడ్డి 18వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. కూటమి అభ్యర్థిగా డా.పార్థసారథి బీజేపీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు. ఆదోనిలొ ఏమాత్రం పట్టులేని బీజేపీ.. భారీ మెజారిటీతో గెలవడంతో షాక్ తినడం కేడర్ వంతైంది.
సీన్ కట్ చేస్తే.. తాజాగా ఆదోని మున్సిపల్ చైర్మన్ శాంత భర్త నాగేంద్ర వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. 2004 నుంచి సాయి ప్రసాద్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరిన నాగేంద్ర.. ఇప్పుడు కాదని వెళ్లిపోయారు. మున్సిపల్ చైర్మన్ శాంత మాత్రం వైసీపీలోనే వున్నారు. భర్తతో కలసి ఆమె బీజేపీలోకి ఎందుకు వెళ్లలేదనే అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది కానీ తర్వాత క్లారిటీ వచ్చింది. ఆదోని మున్సిపాలిటీలో 42 మంది కౌన్సిలర్లు ఉండగా 40 మంది వైసీపీ నుంచి గెలుపొందారు. ఇప్పటికే ఆరుగురు బీజేపీలో చేరారు. అయినా వైసీపీదే బలం. మున్సిపల్ చైర్మన్ పదవి కాపాడుకునేందుకే శాంత వైసీపీలో ఉన్నారనే వాదన వినిపిస్తోంది. ఎంపీపీ గతంలోనే పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇలా సాయిప్రసాద రెడ్డి ముఖ్య అనుచరులంతా ఒక్కొక్కరుగా ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారట. అందుకు కారణం నియోజకవర్గంలో ఆయన పట్టుకోల్పోవడమే అంటున్నారు. అందుకే వలసలు ఎక్కువయ్యాయినే చర్చ జరుగుతోందట. ఆ మాటకొస్తే నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న సాయిప్రసాద రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ఆయన వ్యవహరించిన తీరే పార్టీ బలహీనపడడానికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనుచరులు, కుటుంబ సభ్యులపై రకరకాల ఆరోపణలు పార్టీపై ప్రభావం చూపాయంటున్నారు. మైనారిటీ ఓటు బ్యాంకు చెప్పుకునే స్థాయిలో వున్నా సాయిప్రసాద్ రెడ్డికి ఉపయోగపడలేదట. ఈనేపథ్యంలో సాయిప్రసాద రెడ్డి ముఖ్య అనుచరులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నా ఆపలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్సిపాలిటీ ఏమైపోతుందో అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోందట. ఈ క్రమంలో సాయిప్రసాద రెడ్డి తన వర్గాన్ని కాపాడుకుంటారా, లేక మళ్లీ ఎన్నికలప్పుడు చూసుకుందాంలే అనుకుంటారా.. చూడాలి మరి….