NTV Telugu Site icon

Off The Record : ఓటమి పాలయిన మారని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు

Otr Ysrcp

Otr Ysrcp

అధికారంలో ఉన్నన్నాళ్ళు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరించారు. ప్రతిపక్షానికి పరిమితం అయినా…అదే గ్రూపులు మెయింటెన్‌ చేస్తున్నారు. కలిసికట్టుగా పని చేయాల్సిన నేతలు…వర్గాలుగా విడిపోవడంపై సొంత పార్టీ నేతలు కస్సుమంటున్నారు. కేసులు…అరెస్టు భయాలు వెంటాడుతున్న నీ గురించి నేను మాట్లాడను…నా గురించి నువ్వు మాట్లాడొద్దు అనేలా వ్యవహరం మారిపోయింది. ఇంతకీ ఎవరా నేతలు ? ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీకి కంచుకోట. 2019లో 14 స్థానాలకు 13 స్థానాల్లో గెలిచింది. పార్టీకి అత్యధిక స్థానాలు గెలిపించిన జిల్లా మాత్రమే కాదు…ఎందరో కీలక సీనియర్‌ నేతలు చిత్తూరులోనే ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, మిధున్ రెడ్డి, రోజా, నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధుసూదన రెడ్ఢి లాంటి నేతలు జగన్‌కు సన్నిహితంగా మెలిగే వారే. 2019 ఎన్నికల తర్వాత నేతలు గ్రూపులుగా విడిపోతే…మరికొందరు నేరుగానే ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించారు. గత ఐదేళ్లుగా నగరి కేంద్రంగా జరిగిన రచ్చ అంతా కాదు. వాటి వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారంటూ రోజా బహిరంగంగానే ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డితో పాటు నారాయణస్వామితోనూ రోజాకు గొడవలు ఉండేవి. ఇక చెవిరెడ్డి. భుమన కరుణాకర్ రెడ్డి…సెపరేట్‌ టీమ్‌గా వ్యవహరించేవారు. ఆ గ్రూపులో రోజా కూడా చేరినట్టుగా మధ్యలో ప్రచారం సాగింది. అటు చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి మధ్య అంతర్గత వార్‌ నడిచింది. ఇలా ఎవరికి వారే గ్రూపులుగా విడిపోవడంతో…గత ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. కంచుకోట లాంటి చిత్తూరు జిల్లాలో ఇంతటి పరిస్థితి రావడానికి కారణం…నేతల మధ్య గొడవేనని కార్యకర్తలు వాదన.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా…చిత్తూరు జిల్లా వైసీపీ సీనియర్ నేతల్లో ఎలాంటి మార్పు రాలేదంటూ నేతలు, కార్యకర్తలు ఆవేదనలో మునిగిపోయారట. పైకి బాగానే ఉన్నట్టే కనిపిస్తున్నా…లోలోపల మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికీ జిల్లాలో పార్టీ పరిస్థితి మేడిపండులానే ఉందంటూ బహిరంగంగానే మాట్లాడుతున్నారట‌. దీనికి కారణం కొన్ని నెలలుగా జిల్లాలోని…ఆయా నేతలకు కేసులు, అరెస్టు భయాలు వెంటాడటమే కారణమని తెలుస్తోంది. అయినా కూడా ఒకరి గురించి ఒకరు…మాకెందుకులే అన్నట్లు మిన్నుకుండిపోతున్నారట. రోజాను ఆడుదాం ఆంధ్ర వ్యవహారం, పెద్దిరెడ్డికి లిక్కర్ స్కాం, ల్యాండ్ శ్యాండ్, మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ, మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం అగ్ని ప్రమాద ఘటన వ్యవహారం వెంటాడుతున్నాయి‌. చెవిరెడ్డిని…తుడా నిధుల దుర్వినియోగం, భూమనకు టిడిఆర్ బాండ్ల విచారణ, నారాయణ స్వామికి లిక్కర్ కేసు టెన్షన్‌ పట్టుకుందట.

నీ కేసులు గురించి నాకెందుకు…నా కేసుల గురించి మీకెందుకు అన్నట్టుగానే ఉండడంపై జిల్లాలో వైసీపీ క్యాడర్‌కు మింగుడు పడటం లేదు. కనీసం ఓరల్ సపోర్టు కూడా ఇవ్వడానికి నేతలు వెనుకంజ వేయడంపై పార్టీకి డ్యామేజ్ కలిగిస్తుందనేది నేతల ఆవేదన. ఇప్పుడే ఇలా ఉంటే…ఒకవేళ అరెస్టులు పర్వమే మొదలైతే అప్పుడు కూడా ఆ పోతే పోనీలే మనకెందుకు అన్నట్లు ఉంటారా ? అని కేడర్‌ అనుమానం వ్యక్తం చేస్తోందట. కేసులు ఉన్న నేతలు అరెస్టయితే..తమకు ఎంత మేరకు లాభం చేకూరుతుందని కొందరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. ఇలాంటి నేతలపై జగన్ దృష్టి పెట్టకపోతే…పార్టీకి తీరని నష్టం కలుగుతుందని కొందరు నేతలు పార్టీ పెద్దలకు చెప్పినట్టు సమాచారం. చిత్తూరు నేతల వ్యవహారశైలిని వైసీపీ అధినేత కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.