Site icon NTV Telugu

Off The Record : వైసీపీ అధినేత జగన్ దారి మారిందా..?

Ycp

Ycp

వైసీపీ అధినేత జగన్ దారి మారిందా? ఆయన కూడా డైవర్షన్స్ మొదలు పెట్టేశారా? ముక్కుసూటి రాజకీయం వర్కౌట్‌ కాదని తెలుసుకున్నారా? ఎప్పుడూ హైవే పాలిటిక్సే కాదు… ఇక నుంచి డొంక రోడ్డు రాజకీయం కూడా చేద్దామనుకుంటున్నారా? ఇంతకీ ఏం చేయబోతున్నారాయన? ఏంటా అటెన్షన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌? వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎప్పుడూ స్ట్రైట్ లైన్ పాలిటిక్స్ చేస్తారన్న పేరుంది. అది లాభమైనా, నష్టమైనా…. నా దారి రహదారి అన్నట్టుగానే ఆయన వ్యవహారం ఉంటుందని చెప్పుకుంటారు. కానీ… అదంతా గతం, ఇప్పుడాయన కూడా మారిపోయారన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే పెరుగుతోందట. ఇటీవల తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను విశ్లేషిస్తే… ఆ విషయం బోధపడుతోందని అంటున్నారు కొందరు. ఎప్పుడూ నేరుగా కాకుండా… అప్పుడప్పుడూ పక్కకు కూడా చూస్తేనే… పొలిటికల్‌ లెక్కలు తేలతాయని భావిస్తున్నారా అన్న డౌట్స్‌ వస్తున్నాయట. రాజకీయాలు ఎప్పుడూ ఇలానే చేయాలన్న మాన్యువల్‌ ఏమీ ఉండదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా… అప్పటికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్లిపోవటమే ఎత్తుగడ. సాధారణ రాజకీయాల్లో అయితే… ఓ పార్టీ ఏదైనా భారీ కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు దానికి కౌంటర్‌గా ఇతర పార్టీలు ఏ ప్రోగ్రామ్స్‌ చేయవు. కానీ టీడీపీ, వైసీపీల మధ్య అలాంటి లెక్కలు లేవు. హద్దులు అసలే లేవు. వైసీపీ ఏదైనా ప్రోగ్రాం చేస్తే… వెనువెంటనే దానికి కౌంటర్ ఎటాక్స్‌ ప్లాన్ చేస్తుంది టీడీపీ. ఇప్పుడు జగన్‌ కూడా సరిగ్గా ఇలాంటి రాజకీయమే ఇంకాస్త ఎక్కువ డోస్‌తో మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఈ నెల 28న జగన్ సొంత జిల్లాలో టీడీపీ మహానాడు జరిగే సమయంలోనే ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల కోసం పోరుబాట పట్టబోతున్నారు జగన్. రేటు రాక అల్లాడుతున్న పొగాకు రైతులకు అండగా ఉన్నానని చెప్పేందుకు పొదిలి వేలం కేంద్రానికి వెళ్ళబోతున్నారాయన. నిరుడు 36 వేల వరకు పలికిన క్వింటా పొగాకును ఈ ఏడాది 24 వేలకు కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో… తీవ్రంగా నష్టపోయే స్థితిలో ఉన్నారు రైతులు. దీంతో వేలం కేంద్రంలో వారిని కలిసి పరామర్శించేందుకు సిద్దమవుతున్నారట జగన్. ఓవైపు ధర రాకపోవడం, మరోవైపు క్వాలిటీ పేరుతో బయ్యర్లు ఎక్కువగా తిరస్కరిస్తుండటం సమస్యగా మారుతోంది. చివరికి ఆకు కొట్టుడు, చెక్కులు కట్టిన కూలీలకు సైతం డబ్బులు ఇచ్చే పరిస్దితి లేదు. సరిగ్గా ఈ పాయింట్‌ని బేస్‌ చేసుకునే… రంగంలోకి దిగబోతోంది వైసీపీ.

ప్రజా సమస్యల మీద ప్రతిపక్షం ఆందోళన నిర్వహించడం కామనే. కానీ… అందుకు ఎంచుకున్న టైం మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. సరిగ్గా టీడీపీ మహానాడు జరిగే రోజునే జగన్‌ పొదిలి టూర్‌ పెట్టుకోవడం, రైతుల తరపున ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవడంతో… ఆయన కూడా డైవర్షన్‌ పాలిటిక్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. మహానాడులో టీడీపీ నాయకులు చేసే కామెంట్స్‌కు కూడా రైతుల సమక్షంలోనే కౌంటర్స్‌ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటిదే ఇంకో ఎపిసోడ్‌ కూడా ఉంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 4తో ఏడాది పూర్తవుతుంది అవుతుంది. సహజంగానే ఆ రోజున విజయోత్సవాలు, వేడుకలు జరుపుకుంటాయి కూటమి పార్టీలు. సరిగ్గా అదేరోజున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైంది వైసీపీ. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జూన్ 4న వెన్నుపోటు దినంగా జరుపుతున్నట్టు ప్రకటించారు జగన్‌. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా, కుంభకోణాలతో ప్రజల ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. అందుకే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.ఆ రోజున జిల్లా, మండల స్థాయి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలన్నది ప్లాన్‌. అయితే గతంలో టీడీపీ కార్యక్రమాలు ఉన్న రోజున తమ పార్టీకి సబంధించిన ప్రోగ్రామ్స్‌ ఏవీ పెద్దగా నిర్వహించని వైసీపీ…. సడన్ గా మనసు మార్చుకోవటానికి కారణాలేంటనే లెక్కలు వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్.. టీడీపీ మహానాడు జరిగే సమయంలో పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్లటం, ప్రభుత్వ తొలి వార్షికోత్సవం రోజున వెన్నుపోటు దినంగా ప్రకటించడం వెనక గట్టి వ్యూహమే ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. ఆ రెండు సందర్భాల్లో మీడియా, ప్రజల అటెన్షన్‌ మొత్తం టీడీపీ, ఇతర కూటమి పార్టీలపైనే ఉంటుంది. సరిగ్గా అదే రోజుల్లో తాము కార్యక్రమాలు నిర్వహిస్తే… అటెన్షన్‌ డైవర్ట్ చేయడంతో పాటు స్పాట్ కౌంటర్ ఇవ్వవచ్చనే అభిప్రాయం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే సేమ్ డేట్ ఫార్ములా అమలుకు నిర్ణయించి ఉండవచ్చంటున్నారు. జగన్ దారి మార్పు రాజకీయానికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవరి మైలేజ్‌ని ఎవరు కొట్టుకుపోతారోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీకి కొత్త లెక్కలు కలిసొస్తాయా.. ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాలి.

Exit mobile version