ఆ మాజీ ఎంపీ… ఏపీ డిప్యూటీ సీఎంకు సలహాదారు అవ్వాలనుకుంటున్నారా? ఆయన అడక్కపోయినా… అలాచేసెయ్… ఇలా చేసెయ్ అంటూ ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారా? సీఎం చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్‌కంటే మీరే బెటర్ అంటూ…పవన్‌ను ఆకాశానికెత్తేస్తున్న ఆ సీనియర్ ఎవరు? అడక్కుండానే నేను చెప్పాల్సింది చెప్పేశానని ఎందుకు అంటున్నారు? ఏ విషయంలో డిప్యూటీ సీఎం బెటరని అంటున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, జగన్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ ఆప్షన్ అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అందుకున్న సరికొత్త నినాదం పొలిటికల్ హాట్ అవుతోంది. ఈ మధ్య కాలంలో రాజకీయంగా కాస్త గ్యాప్ తీసుకున్న ఉండవల్లి… తాజాగా మీడియా సమావేశంతో పాటు పలు వేదికల మీద కూడా ఇవే వ్యాఖ్యలు చేస్తుండటం, దానికి తోడు అడక్కపోయినా… పవన్‌కు కొన్ని సలహాలు ఇస్తుండటం చుట్టూ కొత్త చర్చ మొదలైంది. విభజన కారణంగా నవ్యాంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత పవన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మాజీ ఎంపీ. ఉమ్మడి రాష్ట్ర విభజన సరిగా లేదంటూ ప్రస్తుతం న్యాయపోరాటం చేస్తున్నారాయన. ఈ కేసులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉండగా… గత రెండు టర్మ్స్ నుంచి అస్సలు పట్టించుకోలేదు బీజేపీ పెద్దలు. ఇటు రాష్ట్రం నుంచి వత్తిడి పెంచమని అంతకు ముందు చంద్రబాబుకు, ఆ తర్వాత జగన్‌కు ఉండవల్లి విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. అందుకే ఇప్పుడాయన పవన్ పాట పాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కేంద్ర పెద్దల దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి అఫిడవిట్ దాఖలు చేసేలా పవన్ ఒప్పించాలన్నది ఉండవల్లి వాయిస్. తాను చెప్పిన సలహా పాటిస్తే… విభజన నష్టం కారణంగా కేంద్రం నుంచి ఏపీకి రావలసిన 74 వేల 542 కోట్ల రూపాయలు వస్తాయన్నది ఆయన లెక్క. ప్రస్తుతం కేంద్రంలో పవన్ కళ్యాణ్‌కు పలుకుబడి ఉండడం, ఆయన మీద ఎలాంటి కేసులు లేకపోవడంతో ఢిల్లీ పెద్దలకు భయపడరన్నది మాజీ ఎంపీ అంచనా వేస్తున్న అడ్వాంటేజ్ అట.
వాస్తవానికి ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే… వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విధేయుడన్న పేరుంది. కానీ…. జగన్ సీఎం అయ్యాక కారణం ఏదైనా…ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. ఇటీవల వైసిపిలో చేరతారన్న ప్రచారం జరిగినా… అది కరెక్ట్ కాదని తర్వాత తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో ఏపీకి న్యాయం చేయడం ఒక్క పవన్ కళ్యాణ్ వల్లే అవుతుందంటూ… ఉండవల్లి చెప్పడం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్‌తో ఆయనకు గౌరవ ప్రదమైన సంబంధమే ఉందని అంటారు. విభజన హామీలపై చర్చించేందుకు ఇద్దరూ రెండుసార్లు కలుసుకున్నారు కూడా. 2018లో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి రావాలని ఉండవల్లికి పవన్ కళ్యాణ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. 2019 జనవరి 29న విజయవాడలో మాజీ ఎంపీ ఏర్పాటుచేసిన సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీంతో ప్రస్తుతం డిప్యూటీ సీఎంకు మాజీ ఎంపీ సలహాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం సలహాతోనే సరిపెట్టకుండా ఆ పని మీవల్లే అవుతుందని గట్టిగా చెప్పడంతో…దీన్ని పవన్ ఎంత వరకు సీరియస్‌గా తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. గత డిసెంబర్‌లో ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు ఉండవల్లి. రెండు నెలలు దాటినా…అట్నుంచి నో రియాక్షన్. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన సీనియర్ నేత… మంత్రి కందుల దుర్గేష్ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఉండవల్లికి సన్నిహితుడన్న పేరుంది. ఆయన ద్వారానే…ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారట మాజీ ఎంపీ. కానీ… పవన్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోగా…. తాజాగా మళ్ళీ సలహాలివ్వడంపై రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి. అరుణ్‌కుమార్ ఏమన్నా…. పవన్‌కు సలహాదారుగా మారాలని అనుకుంటున్నారా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఈ సలహా ప్రకారం జనసేనాని ముందుకువెళతారా? ఒకవేళ వెళ్ళి సక్సెస్ అయితే… భవిష్యత్‌లో ఉండవల్లి పొలిటికల్ అడ్వైజర్‌గా మారతారా అంటూ ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేసేసుకుంటున్నారు. నా దగ్గర సలహా ఉంది బాబూ… నేనైతే చెప్పేశానంటున్న మాజీ ఎంపీ ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ఆపుతారా? లేక మరో రూపంలో పవన్ మీద వత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.