Off The Record: వైస్ ఛాన్స్‌లర్స్ లేకుండా తెలంగాణలో విశ్వవిద్యాలయాలు ఇంకెన్నాళ్ళు అలా ఉండాలి? నియామకం విషయంలో ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదా? పది వర్శిటీలకు పాలక మండళ్ళు లేకుంటే…ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నట్టు? విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామన్న మాట నిలబెట్టుకునేది ఇలాగేనా? వీసీల ఎంపికలో ప్రభుత్వానికి అడ్డుపడుతున్నదేంటి? సీరియస్ ఎపిసోడ్‌ని లైట్ తీసుకుంటున్నారన్న విమర్శల్లో నిజమెంత?
తమ హయాంలో విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తామంటూ… ప్రాధాన్యతలేంటో… మొదట్లోనే చెప్పేసింది తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్. మరీ ముఖ్యంగా విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చి స్టూడెంట్స్ భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తామని కూడా గొప్పలకు పోయారు పాలకులు. కానీ… తొమ్మిది నెలల తర్వాత చూసుకుంటే…. మాటలు కోటలు దాటాయిగానీ… చేతలు మాత్రం గడప దాటలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో చెప్పిన మాటలకు, కార్యాచరణకు పొంతనే లేదంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వర్సిటీలకి ఇస్తున్న ప్రాధాన్యత ప్రభుత్వ వర్సిటీలకు ఇవ్వడం లేదన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇదే విషయమై విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తున్న పరిస్థితి. మెజార్టీ వర్శిటీలకు వైస్ ఛాన్స్‌లర్స్ లేక పాలన పడకేసిన పరిస్థితి. దీంతో కార్యకలాపాలన్నీ ఏదో సాగిపోతున్నాయి తప్ప… ఒక పద్ధతి ప్రకారం జరగడం లేదంటున్నారు. తెలంగాణలోని 10 యూనివర్సిటీల వీసీల పదవీ కాలం ఈ ఏడాది మే 21తో ముగిసింది. ఆ మరుసటి రోజు నుంచి ఇన్ఛార్జ్ వీసీల పాలనే నడుస్తోంది. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్స్‌గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్‌ని నియమించడంతో…. వాళ్ళు అటు తమ శాఖల మీద దృష్టి పెట్టలేక, ఇటు యూనివర్శిటీ పరిపాలనా వ్యవహారాలను పట్టించుకోలేక సతమతం అవుతున్నట్టు తెలిసింది. తమ శాఖలకే ప్రాధాన్యం ఇస్తూ…. వర్సిటీలను గాలికి వదిలేస్తున్నారన్న ప్రచారం ఉంది. దీంతో మొత్తం కుంటుపడుతోందని, వెంటనే రెగ్యులర్ వీసీల్ని నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు.
కానీ… ఆ విషయంలో ప్రభుత్వం మాత్రం ఒక క్లారిటీకి రాలేకపోతోందట. ఉన్నవాళ్ళ పదవీ కాలం ముగిసేలోపే కొత్త వారిని ఎంపిక చేయాలని మొదట్లో అనుకున్నా….. మూడు నెలలు గడిచాక కూడా ఎంపిక చేయలేకపోవడానికి రకరకాల వత్తిళ్లే కారణమని తెలిసింది. మూడు నెలలు గడుస్తున్నా…ఇంకా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఏ వర్సిటీకి ఎవర్ని వీసీగా పెట్టాలన్న విషయంలో ప్రభుత్వ పెద్దలు ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారట. అలాగే సామాజిక సమీకరణాలు కూడా అడ్డొస్తున్నట్టు తెలిసింది. ఇక మరోవైపు కొందరు ప్రొఫెసర్స్ గట్టిగా లాబీయింగ్ చేసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. మంత్రులు, సీనియర్ శాసనసభ్యులు, ఇతర బలమైన ప్రజా ప్రతినిధులు… ఇలా ఎవరి స్థాయిలో వారు తమకు తెలిసిన వారి ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారట. ఇంకొందరైతే ఓవర్ టు ఢిల్లీ అనుకుంటూ…. ఏఐసీసీ పెద్దలతో కూడా చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అలాగే… ఉన్నత విద్యామండలికి కొత్త టీమ్ ను నియమించాల్సి ఉంది. వాటి కోసం కూడా పైరవీలు చేసుకుంటున్నారట చాలా మంది… అదంతా కొలిక్కి వస్తే తప్ప…. వీసీల నియామక ప్రక్రియ ముందుకు సాగేలా లేదంటున్నారు. సెర్చ్ కమిటీ ఒక్కో వీసీ పోస్ట్‌లకు ముగ్గురిని సిఫార్సు చేస్తుంది… ఆ జాబితాను గవర్నర్ కి పంపిస్తే అందులో నుంచి ఒకరికి ఎంపిక చేస్తారు. గవర్నర్‌కి వెళ్ళే జాబితాలోనే ప్రభుత్వం కావాలనుకునే వారి పేరు ఉంటుంది. ఇంతవరకు అలాంటి ప్రక్రియ ఏదీ జరక్కపోవడంతో… ఇన్ఛార్జ్ వీసీల పాలన ఇంకెన్నాళ్ళంటూ ఆందోళనను ఉధృతం చేసే యోచనలో ఉన్నాయట విద్యార్థి సంఘాలు.
