NTV Telugu Site icon

Off The Record : తెలంగాణ కాంగ్రెస్‌ పదవుల భర్తీలో వాయిదాల పర్వం

Congress Otr

Congress Otr

తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల భర్తీ కూడా అదిగో పులి అంటే… ఇదిగో తోక అన్నట్టు ఉందా..? ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఎప్పటికప్పుడు ఎందుకు వాయిదా వేస్తున్నారు? కసరత్తు పూర్తయిపోయింది, రెండు రోజుల్లో ఇచ్చేస్తారన్న పదవుల్ని సైతం ఎందుకు పట్టించుకోవడం లేదు? కాంగ్రెస్‌ పెద్దలకు అడ్డుపడుతున్నదేంటి? స్థానిక ఎన్నికల సందర్భంగా ఇచ్చే పదవులన్నా ఇస్తారా..! లేక వాటిని కూడా వాయిదా వేస్తారా? తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల భర్తీ అంశం ఊగిసలాడుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నాయకులంతా ఒకటి రెండు రోజుల్లో మేటర్‌ సెటిలవుతుందని ప్రకటించేశారు. వాళ్ళు చెప్పిన గడువు పూర్తయిందిగానీ… పదవుల పంపకాలు మాత్రం జరగలేదు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నా… ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలో పదవులు భర్తీని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటోంది కాంగ్రెస్‌. ఇది పార్టీలోని అందరు నాయకులతో పాటు పదవులు ఆశించే వారికి ఇబ్బందిగా మారుతోందని అంటున్నారు. పిసిసి చీఫ్‌ని నియమించి ఐదు నెలలు పూర్తయినా… పూర్తి కమిటీ సంగతి తర్వాత… కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ని కూడా వేసుకోలేకపోయామన్న చర్చ జరుగుతోంది పార్టీ సర్కిల్స్‌లో. కసరత్తు జరిగిపోయింది.. ఇక ప్రకటనే మిగిలిందని చెప్పిన గడువు కూడా ముగిసిపోయింది. అయినా సరే… ఇప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. కారణం ఏంటి? మరీ… ఎందుకింతలా సాగదీస్తున్నారని అంటే…. సామాజిక సమీకరణాల కూర్పు విషయంలో కొంత గందరగోళం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం చేసిన కులగణనకు అనుకూలంగా పదవులు భర్తీ చేయాలంటే… సామాజిక వర్గాల వారీగా నాయకుల కొరత ఉన్నట్టు కనిపిస్తోందట.

బీసీ నాయకత్వం పార్టీలో బలం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది సర్వేని బట్టి తెలుస్తోందని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడే నాయకత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందిగానీ… ఆ దిశగా ఇప్పుడు పార్టీ ఆలోచిస్తుందా లేదా అనేది చూడాలంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్స్‌తోపాటు ఉపాధ్యక్షుల నియామకానికి సంబంధించి సామాజిక సమీకరణాల కూర్పులో వ్యత్యాసం కారణంగానే వాయిదా పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. సరే… కులాల లెక్కలు కుదరక అవి వాయిదా పడుతున్నాయని అనుకుంటే… పార్టీకి అత్యంత కీలకమైన ప్రచార కమిటీ నియామకం కూడా ఊగిసలాటలోనే ఉంది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం కూడా నత్తనడకన జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ప్రచార కమిటీని నియమిస్తే ఆ సమస్య తీరిపోతుందని అనుకుంటున్నా….అది కూడా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ప్రచార కమిటీకి చేతినిండా పని ఉంటుంది. కానీ… పార్టీ మాత్రం ఇంకా ఆ విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతోంది. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇస్తారన్న చర్చ నడుస్తోంది. చాలా రోజుల నుంచి ఈ మాట వినిపిస్తున్నా… కొలిక్కి మాత్రం రావడం లేదు. పార్టీలో సీనియర్ నేతలు మొదలుకొని కొత్తగా నాయకత్వ బాధ్యతలు ఎత్తుకుంటున్న వారి వరకు… అందరిలోనూ పార్టీ పదవుల భర్తీ జాప్యం అవడంపై అసంతృప్తి పెరుగుతోందట. కొందరు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, మరికొందరు పార్టీలో పదవులు ఆశిస్తున్నారు. కానీ… ఇద్దరూ నిరాశ పడుతున్న పరిస్థితి. పదవుల భర్తీ సంగతి ఎలా ఉన్నా.. పార్టీకి మాత్రం ఇప్పుడు నాయకత్వం అత్యవసరం. ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలు ఒకవైపు, కార్యక్రమాలను జనంలోకి తీసుకు వెళ్లాల్సిన ఆవశ్యకత మరోవైపు ఉన్నాయి. పూర్తి స్థాయిలో కమిటీలు వేసి వాటికి బాధ్యులు లేకుంటే…సరిగా జనంలోకి వెళ్లే పరిస్థితి ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ప్రచార కమిటీ కూడా కీలకమే. అలాంటి ప్రచార కమిటీని కూడా ఎందుకు తాత్సారం చేస్తున్నారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదంటున్నారు. ఈక్వేషన్స్‌, కేలిక్యులేషన్స్‌ అంటూ… పార్టీ అధిశష్టానం ఇంకెన్నాళ్ళు నానుస్తుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.