NTV Telugu Site icon

Off The Record : ఆ విషయంలో బీజేపీ అత్యాశకు పోతుందా..?

Telangana Bjp

Telangana Bjp

తెలంగాణ బీజేపీ నేల విడిచి సాము చేయాలనుకుంటోందా? ఆ పార్టీ ముఖ్యులు వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తున్నారా? సభ్యత్వ నమోదు విషయంలోనే వాళ్ళ ఆలోచనలోని డొల్లతనం తేలిపోతోందా? అలవికాని లక్ష్యాన్ని పెట్టుకుంటున్నారన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? రాష్ట్రంలో కమలం పార్టీ వాస్తవ సామర్ధ్యం ఎంత? వాళ్ళు పెట్టుకున్న మెంబర్‌షిప్‌ టార్గెట్‌ ఎంత? బీజేపీలో సభ్యత్వ హడావుడి మొదలైంది. ఈసారి తెలంగాణలో భారీ ఎత్తున కొత్త సభ్యత్వాలను ఇప్పించాలని టార్గెట్‌ పెట్టుకుందట పార్టీ. అదీ కూడా అలా ఇలా కాదు… ప్రతి పోలింగ్ బూత్‌లో కనీసం 200 సభ్యత్వాలు చేయించాలన్నది టార్గెట్‌ అట. తెలంగాణలో మొత్తం 37 వేల పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. అంటే ఆ లెక్కన 70 లక్షల మందికి పైగా కొత్త సభ్యులను పార్టీలో చేర్పించాలన్న లక్ష్యం. దీంతో ఆ టార్గెట్‌ సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతున్న పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 35 శాతం ఓట్లు వచ్చాయి. 77 లక్షల దాకా ఓట్లు పడ్డాయి కమలం పార్టీకి. ఆ క్రమంలోనే… ఇప్పుడు పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అంత సభ్యత్వం చేయించాలన్న లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిసింది. అంటే… పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరూ ప్రాధమిక సభ్యత్వం తీసుకుంటారా అన్నది క్వశ్చన్‌. గతంలో మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ నిర్వహించినప్పుడు చేయించిన సభ్యత్వాల సంఖ్య 18 లక్షలు. ఇప్పుడు అంతకు నాలుగు రెట్లు ఎక్కువ టార్గెట్‌ పెట్టుకుంది పార్టీ. దీంతో అనుకోవడానికేముంది… ఎన్నయినా మాట్లాడుకుంటాం. కానీ…అందులో వాస్తవికత ఎంత చర్చ తెలంగాణ బీజేపీ వర్గాల్లోనే జరుగుతోందట. రాష్ట్రంలో గతం కన్నా డబుల్ చేయగలితేనే గొప్ప అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందంటున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 77 లక్షల ఓట్లు రావడానికి చాలా కారణాలున్నాయి. ఓటేసిన వాళ్ళలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. జాతీయ స్థాయి పరిస్థితులు, మోడీ ప్రభావంతో నాడు ఓట్ల సంఖ్య పెరిగింది. కానీ… అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీకి 14 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. పార్టీకి చాలా పోలింగ్ బూత్‌లలో కమిటీ లు లేవు, కార్యకర్తలు లేరు. ఎక్కువ బూత్‌లలో అసలు సభ్యత్వ నమోదు వ్యవస్థే లేదు. ఆన్లైన్ మెంబర్షిప్ అవకాశం ఉన్నందున స్వచ్చందంగా పార్టీ సభ్యులుగా ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉందా… ఉంటే.. ఉండవచ్చుగానీ… అది చాలా పరిమతం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కర్నీ పార్టీ సభ్యులుగా చేర్పించాలనుకోవడం అత్యాశే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు సెప్టెంబర్ ఒకటి నుండి ప్రారంభం కానుంది. తెలంగాణలో 3 నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 1 నుండి 25 వరకు మొదటి విడత, అక్టోబర్ 1 నుండి 15 వరకు రెండో విడతలో దేశ వ్యాప్తంగా సభ్యత్వ నమోదు జరగనుంది. మహిళలు, యువత, రైతులను ఎక్కువగా టార్గెట్‌ చేసుకోబోతున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అనుబంధ మోర్చాలు తమ తమ రంగాల్లో సభ్యత్వం చేయిస్తాయి. వాస్తవానికి వస్తే… తెలంగాణలో ఆ పార్టీ… చెబుతున్నంత కాకున్నా… తక్కువలో తక్కువ 50 లక్షల సభ్యత్వాలు చేయించగలిగితే… సంస్థాగతంగా తిరుగులేని శక్తి అవుతుంది. కానీ… ప్రస్తుతం పార్టీలో స్తబ్దత నెలకొని ఉన్నందున ఆ 50 లక్షల టార్గెట్‌ అయినా రీచ్‌ అవుతారా అన్న డౌట్స్‌ ఉన్నాయట. ఇలాంటి వాతావరణంలో ఎంత మేరకు లక్ష్యాన్ని చేరుకుంటారు? పెరిగేదంతా బలమవుతుందా లేక వాపుగానే మిగిలిపోతుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.