Site icon NTV Telugu

Off The Record : తెలంగాణ బీజేపీ నేతలపై Amit Shah Silence కి కారణం ఏంటి ? మారారా ? వదిలేశారా ?

T Bjp Otr

T Bjp Otr

తెలంగాణ బీజేపీ నేతలు మారారా? లేక వీళ్ళింతే… ఇక మారనే మారబోరంటూ అధిష్టానమే వదిలేసిందా? వచ్చిన ప్రతిసారి క్లాస్‌ల మీద క్లాస్‌లు పీకే అమిత్‌ షా ఈసారి ఏమీ మాట్లాడకుండా వెళ్ళడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? తెలంగాణ నేతల తీరుపై ఢిల్లీ పెద్దలు హ్యాపీనా? లేక ఎలక తోలు తెచ్చి ఎందాక ఉతికినా రంగు మారదన్న సామెతను గుర్తుకు తెచ్చుకున్నారా? టీ బీజేపీలో అసలేం జరుగుతోంది? తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లే టార్గెట్‌గా కసరత్తు చేస్తోంది బీజేపీ. అందు కోసం రకరకాల వ్యూహాలు అమలు చేస్తోంది. మోడీ వేవ్‌, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కలిసి వస్తాయని అంచనా వేసుకుంటున్నారట ఆ పార్టీ నేతలు. అందుకే తమకు సానుకూలంగా ఉందని, కాస్త వర్కౌట్‌ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం ఉన్న నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా ఫోకస్‌ పెడుతున్నట్టు తెలిసింది. జాతీయ నేతలు కూడా వీలైనంత ఎక్కువగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మోడీ, అమిత్‌ షా, నడ్డా లాంటి నేతలంతా తెలంగాణ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం లు కూడా వస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వాతావరణం తమకు అనుకూలంగా ఉందనే భావనతోనే ఉన్నారట బీజేపీ పెద్దలు. క్షేత్ర స్థాయిలో స్పందన బాగుందని, కింది నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్ కానీ, సర్వేలు కానీ సానుకూలంగా ఉన్నాయన్నది పార్టీ వర్గాల మాట. ఈ పరిస్థితుల్లోనే తాజాగా రాష్ట్రానికి వచ్చారు అమిత్ షా. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారాయన.

17 ఎంపీ సీట్ల పరిధిలో ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని సూచనలు సైతం చేశారట ఆయన. అయితే… ఆ సమావేశం గతానికి భిన్నంగా జరగడంతోనే ఆశ్చర్యపోయారట పార్టీ నాయకులు. రాష్ట్ర నాయకులతో ఎప్పుడు మీటింగ్‌ పెట్టినా హాట్‌ హాట్‌గా ఉండే షా… ఈసారి మాత్రం చాలా కూల్‌గా కనిపించారట. ఆయన చెప్పాల్సింది చెప్పడంతో పాటు ఎవ్వరి మీద సీరియస్‌ అవలేదని అంటున్నారు సమావేశంలో పాల్గొన్న నాయకులు.పార్టీకి మంచి వాతావరణం ఉందని, కష్టపడండి 12 సీట్లు పక్కా అని చెప్పినట్టు తెలిసింది. ఆయన ఎవర్ని ఏమంటారో… ఎలాంటి చిటపటలు ఉంటాయోనని కంగారు పడ్డ నాయకులంతా నవ్వుతూ మాట్లాడటం చూసి ఊపిరి పీల్చుకున్నారట. మీటింగ్‌ తర్వాత చిట్‌చాట్‌లో ఇదే మెయిన్‌ టాపిక్‌ అయిందంటున్నారు నాయకులు. కొందరు నాయకులైతే… అమిత్ షా ఏంది…? ఏమనకుండా వెళ్ళడం ఏదంటూ…నోరెళ్ళబెట్టినట్టు తెలిసింది. నిజంగానే తెలంగాణలో ఆ రేంజ్‌ సీట్లు కొట్టబోతున్నామా? అందుకే ఆయన కూల్‌గా కనిపిస్తున్నారా? అని కూడా చర్చించుకున్నారట. అదే సమయంలో ఎంత చెప్పినా మారరు… ఎలక్షన్‌ ముందు వీళ్ళని తిట్టడం ఎందుకని ఆయనే వదిలేశారా అని కూడా కొందరు నాయకులు గుసగుసలాడుకున్నట్టు తెలిసింది. మొత్తం మీద తెలంగాణలో గత ఎన్నికల కంటే… ఓట్లు, సీట్ల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు బీజేపీ నేతలు. అమిత్‌ షా ఆనందానికి అది కూడా కారణమై ఉండవచ్చంటున్నారు. ఓవరాల్‌గా ఎప్పుడూ తిట్లతో తలంటే నాయకుడు ఈసారి మాత్రం ఆ పని చేయకపోవడంతో వీళ్ళంతా ఏదన్నా వెలితిగా ఫీలవుతున్నారా? అన్న సెటైర్స్‌ కూడా పడుతున్నాయి.

 

Exit mobile version