Site icon NTV Telugu

Off The Record : తెలంగాణ కమలంలో కమిటీ మంటలు ఇంకా చల్లారలేదా?

Bjp

Bjp

తెలంగాణ కమలంలో కమిటీ మంటలు ఇంకా చల్లారలేదా? సీనియర్స్‌ ఎక్కువ మంది ఇప్పటికీ అలకపాన్పులు దిగలేదా? పదవులు రాలేదన్న బాధ ఒకరిదైతే… వచ్చిన వాళ్ళతో సైతం అసంతృప్తులు పెరుగుతున్నాయా? గతంలో రెగ్యులర్‌గా పార్టీ ఆఫీస్‌కు వచ్చిన వాళ్ళు సైతం ఇప్పుడు గేటు దగ్గరికి కూడా ఎందుకు రావడం లేదు? పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్‌ కమిటీ ప్రకటన తర్వాత అసంతృప్తుల పర్వానికి తెర లేచింది. ఆ విషయమై పార్టీలో ఆనందించే వారికంటే… ఇప్పుడు ఆవేదనతో ఉన్న వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉందట. దశాబ్దాలుగా పార్టీ కోసం సేవ చేస్తున్నా… కనీస గుర్తింపు దక్కలేదని సీనియర్స్‌ చాలా మంది నారాజ్‌గా ఉన్నట్టు సమాచారం. తమ త్యాగాలకు గుర్తింపు లేకుండా పోతోందని సీనియర్స్‌ చాలా మంది లోలోపల మథనపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వరు, పార్టీ పదవుల్లో ఛాన్స్‌ ఇవ్వరు, ఇక దశాబ్దాలుగా అంటిపెట్టుకుని ఉండి ఏం ప్రయోజనం అన్నది వాళ్ళ క్వశ్చన్‌. చేస్తున్న పనికి గుర్తింపుగా మాత్రమే పార్టీ పదవులు అడుగుతున్నాం తప్ప… స్టేటస్ కోసం కాదంటున్నారట సదరు సీనియర్స్‌. రాష్ట్ర కమిటీలో ఛాన్స్‌ కోసం చాలా మంది నాయకులు కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూశారు. అలాగే… పాత కమిటీలో ఉన్న కొందరు కూడా… తమకు ఢోకాలేదని భావించారు. కానీ… ఫైనల్‌ లిస్ట్‌ బయటికి వచ్చాక అలాంటి వాళ్ళంతా షాక్ అయినట్టు తెలిసింది.

పదవులు దక్కని వాళ్ల అసంతృప్తి అలా ఉంటే… దక్కిన వాళ్ళ లెక్కలు మరోలా ఉన్నాయి. తమ స్థాయికి తగ్గ పోస్ట్‌ రాలేదన్నది కొందరి అసహనంగా తెలుస్తోంది. ప్రకాష్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు లాంటి నేతలు చివరికి పార్టీ కార్యాలయానికి కూడా వెళ్ళడం లేదట. నిన్న మొన్నటిదాకా సంస్థఆగత కార్యకలాపాల్లో చురుగ్గా పని చేసిన వారు కూడా ఇప్పుడు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ… సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత కమిటీలో పనిచేసిన ప్రధాన కార్యదర్శులు ఇప్పుడు పార్టీ మెట్లు కూడా ఎక్కడం లేదట. అప్పుడు చెప్పిన పనల్లా చేశాం.. చేతి చమురు వదిలించుకుని సొంత ఖర్చులతో తిరిగాం… తీరా కమిటీ వేసేటప్పుడు మాత్రం మా కులం అడ్డొచ్చిందంట… అసలు ఇదేం పద్ధతి, పనులు చేయించుకునే రోజున మా కులం గురించి తెలియ లేదా? అది గుర్తుకు రాలేదా అంటూ ఎక్కువ మంది ఫైరవుతున్నట్టు సమాచారం. ఎంత చేసినా… ఇంతేనా అన్న ఆవేదన ఎక్కువ మందిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తెలంగాణ కాషాయదళంలో కొత్త చర్చ మొదలైంది. పని చేసి పదవులు రానివాళ్ళని అధినాయకత్వం సముదాయిస్తుందా? లేక మీ ఖర్మ అంటూ వదిలేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల పై పట్టున్న నేతలకు అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం కూడా బీజేపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

 

Exit mobile version