NTV Telugu Site icon

Off The Record : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మారిన విపక్షం తీరు..

Tg Assemly

Tg Assemly

తెలంగాణ అసెంబ్లీలో ఇక నుంచి పాత దృశ్యాలు కొత్తగా కనిపిస్తాయా? ప్రతిపక్షం విషయంలో కఠినంగానే ఉండాలని ప్రభుత్వం డిసైడ్‌ అయిందా? పద్ధతిగా సభ నడుపుదామని తాము అనుకుంటుంటే… ప్రతిపక్షం మాత్రం కట్టు తప్పి ప్రవర్తిస్తున్నట్టు సర్కార్‌ పెద్దలు భావిస్తున్నారా? ఆ విషయంలో సీఎం అంతరంగం ఎలా ఉంది? కనిపించబోయే కొత్త దృశ్యాలు ఏవి? ఇన్నాళ్ళు సజావుగానే సాగుతోంది తెలంగాణ అసెంబ్లీ. ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేసినా…, నిరసనలు స్పీకర్ పోడియం వరకు వచ్చినా, పెద్దగా పట్టించుకోలేదు ప్రభుత్వం. విపక్షానికి నిరసన కూడా తెలియజేసే అవకాశం కల్పించామని చెప్పుకుంది రేవంత్‌ ప్రభుత్వం. కానీ…. ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందన్న భావన వ్యక్తం అవుతోందట ప్రభుత్వ వర్గాల్లో. సభ్యులు చీటికి మాటికి పోడియం దగ్గరికి రావడం, ఛైర్‌ని కూడా అవమానించేలా మాట్లాడడం లాంటి పరిణామాలను ప్రభుత్వ పెద్దలు సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఒకరిద్దరు ప్రతిపక్ష నాయకులు అయినదానికి, కానిదానికి పోడియం దగ్గరికి రావడంతోపాటు ఉద్దేశ్యపూర్వకంగా సభలో గలాటా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని గుర్తించిందట ప్రభుత్వం. అందుకే ఇక వైఖరి మార్చుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు సస్పెన్షన్ లేకుండా సభ నడపాలని భావించామని, కానీ… అది ప్రభుత్వ బలహీనతగా ప్రతిపక్షం భావిస్తోందన్న అభిప్రాయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలిసింది. ఇకపై కఠినంగానే ఉండాలని నిర్ణయించినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇన్నాళ్ళు ప్రతిపక్షం అడిగినప్పుడల్లా మైక్ ఇచ్చింది ప్రభుత్వం. కానీ… సభలో బీఆర్ఎస్ నేతల వ్యవహార శైలి హుందాగా లేదని ప్రభుత్వం అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. దాన్ని సెట్‌ చేయాలంటే… కఠినంగా వ్యవహరించక తప్పదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పోడియం దగ్గరికి వచ్చి నిరసన తెలిపితే సభ్యులను సస్పెండ్‌ చేయవచ్చని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే నిబంధనలను రూపొందించింది. ఇప్పడు వాటినే అమలు చేయాలని భావిస్తోందట కాంగ్రెస్‌ ప్రభుత్వం. అలాగే… ఒకరిద్దరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం కొంత సీరియస్ గానే ఉన్నట్టు కనపడుతోంది.

అందులో భాగంగానే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ సభ్యత్వం రద్దు లాంటి అంశాలను ప్రస్తావించారని అంటున్నారు. దీని ద్వారా పరిస్థితిని బట్టి మేం కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడబోమన్న సందేశం పంపారని అంటున్నారు విశ్లేషకులు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పదేపదే పోడియం దగ్గరికి రావడం, స్పీకర్ చైర్మన్ అవమానించేలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయంతో అధికార పార్టీ ఉంది. ఇప్పుడు తాము మెతగ్గా ఉంటే…వాళ్ళు తగ్గబోరని, అదే అలవాటుగా మారిపోతుందన్న ఉద్దేశ్యంతో ఇక కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నారట సీఎం. బుధవారంనాటి సబితా ఇంద్రారెడ్డి ఎపిసోడ్‌ని రెండో రోజు కూడా కంటిన్యూ చేయాలని భావించింది బీఆర్‌ఎస్‌. కానీ అలాంటి అవకాశం ఇవ్వకూడదని ప్రభుత్వం గట్టిగానే నిర్ణయించుకుంది. సభ నడిచినంత సేపు బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేసినా…సస్పెండ్‌ చేయకుండా వారికి ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. అలా సబిత వివాదం జోలికి వెళ్ళకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది విశ్లేషకుల మాట. ఇకనుంచి సభలో గతంలో మాదిరిగా విపక్షానికి విచ్చలవిడిగా స్వేచ్ఛ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు ప్రతిపక్ష సభ్యుల వ్యవహార శైలిపై కఠినంగానే స్పందించాలని, వాళ్ళ దూకుడుకు కళ్ళెం వేయాలని డిసైడైనట్టే ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి మారిన వైఖరితో ప్రభుత్వం ప్రతిపక్షాన్ని నియంత్రించగలుగుతుందా? లేక వాళ్ళ దూకుడు కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Show comments