OTR : తాట తీస్తా.. ఎమ్మెల్యే వార్నింగ్! రంపచోడవరం టీడీపీలో కాక!

Rampachodavaram

Rampachodavaram

 

రేయ్‌… తాట తీస్తా….! మీరు పిచ్చి వేషాలేస్తుంటే…. నేను చూస్తూ కూర్చోవాలా? ఏమనుకుంటున్నారు అసలు…? డ్రామాలు చేస్తున్నారు ఒక్కొక్కరు… సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పార్టీ మీటింగ్‌లో సొంత కార్యకర్తకు ఇచ్చిన వార్నింగ్‌ ఇది. ఎవరా శాసనసభ్యురాలు? ఎందుకంత ఆవేశపడ్డారు? మేటర్‌ పార్టీ అధిష్టానం దాకా ఎందుకు వెళ్ళింది? పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు మిరియాల శిరీషదేవి. మొదట్లో పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు కొనసాగించినా.. క్రమంగా ఆమెకు కేడర్‌, లీడర్స్‌తో గ్యాప్ పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన కొంత మందికి ఎమ్మెల్యే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సొంత పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు. గతంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారన్న అసంతృప్తి పసుపు శ్రేణుల్లో పెరిగిపోతోందట. ఈ పరిస్థితుల్లో తాజాగా అడ్డతీగలలో జరిగిన టీడీపీ అంతర్గత సమావేశంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌ కాక రేపుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను బట్టబయలు చేసిందని, ఎమ్మెల్యేకి, మిగతా నాయకులకు మధ్య ఎంత గ్యాప్‌ ఉందో చెప్పకనే చెప్పిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరీ ముఖ్యంగా… పిచ్చి పిచ్చి వేషాలేస్తే తాట తీస్తానన్న వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. శాసనసభ్యురాలి వ్యవహారం ఎలా ఉందో ఈ వ్యాఖ్యలే తెలియజేస్తున్నాయంటూ రంపచోడవరం టీడీపీలో సైతం గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరోవైపు మిరియాల శిరీషాదేవి భర్త విజయభాస్కర్ పాత్రపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా… ఆయన నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూరుస్తూ… షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లే చెవులు కొరుక్కుంటున్నారట. ఎమ్మెల్యేను కలవడానికి వెళ్లే నాయకులు, కార్యకర్తలు ఎవరైనాసరే…. ముందుగా సార్‌ దర్శనం చేసుకోవాలని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాల్లో ఒకటి రంపచోడవరం. 11 మండలాలకు విస్తరించి ఉండటం, గిరిజన ప్రాంతమే ఎక్కువ కావడంతో… సమస్యలు సైతం ఎక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో… నియోజకవర్గ కేంద్రం రంపచోడవరంలో అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే… రాజవొమ్మంగిలో నివాసం, కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దాంతో… దూర ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనులు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేను కలవడానికి ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఎమ్మెల్యే ఆఫీస్‌లోకి ఎంటర్‌ అవ్వాలంటే… చాలా కండిషన్స్‌ పెడుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వాటన్నిటినీ దాటుకుని తీరా లోపలికి వెళితే… పార్టీ కోసం కాదు, మా కోసం పని చేయాలి అన్నట్టు ఎమ్మెల్యే భర్త బూతు పురాణం అందుకుంటారట. దీంతో… ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ… కొందరు కార్యకర్తలు, నాయకులు అసలు ఆ ఆఫీస్‌ వైపు చూడ్డమే మానేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ అసంతృప్తి క్రమంగా పెరిగి పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం వంటి కార్యక్రమాల్లో కొన్నిచోట్ల ఎమ్మెల్యే పాల్గొనలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. సీనియర్స్‌ని కలుపుకుని వెళ్ళమని అధిష్టానం చెబుతున్నా… శిరీష వైఖకి అలా కనిపించడం లేదన్నది పార్టీ కేడర్‌ ఇన్నర్‌ వాయిస్‌.

ఇలాంటి పరిస్థితుల్లో…ఎమ్మెల్యే తాజాగా అడ్డతీగల మండల పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఇంకా కాక పుట్టిస్తున్నాయి. ఆ వ్యాఖ్యలపై గిరిజన సంఘాలతో పాటు సొంత పార్టీ నేతలు కొందరు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలతో ఎమ్మెల్యే మాట్లాడిన తీరు బాధాకరమని అన్నారు మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వర్లు. కార్యకర్తలే టీడీపీకి బలమన్న సంగతిని మర్చిపోకూడదంటూ కామెంట్‌ చేశారాయన. ఒకప్పుడు టీడీపీకి బలమైన నియోజకవర్గం రంపచోడవరం. కానీ… మధ్యలో కాంగ్రెస్, వైసీపీ పట్టు బిగించాయి. తిరిగి 2024లో కూటమి ప్రభంజనంలో మళ్లీ ఇక్కడ టీడీపీ జెండా ఎగిరింది. ఇలాంటి పరిస్థితుల్లో… మళ్ళీ చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి… ఇలా కార్యకర్తల్నే దూరం చేసుకుంటే ఎలాగన్న ప్రశ్నలు టీడీపీ వర్గాల నుంచే వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వ్యాఖ్యల తాలూకా రియాక్షన్స్‌ ఎలా ఉంటాయోనన్న ఆందోళన సైతం కొందరు లోకల్‌ టీడీపీ నాయకుల్లో ఉందట.