NTV Telugu Site icon

Off The Record : ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద అట్రాసిటీ కేసు..!

Sudheer Reddy Otr

Sudheer Reddy Otr

ఆ ఎమ్మెల్యే ఏదో…… గొప్పగా…… సెటైరికల్‌గా మాట్లాడదామనుకుంటే….. చివరికి సుర్రు సుమ్మైపోయిందా? మాటలు మిస్‌ ఫైర్‌ అయిపోయి అట్రాసిటీ కేసు పెట్టించుకునేదాకా వెళ్ళాయా? ఫైనల్‌గా జంక్షన్‌ జామైపోయే పరిస్థితులు వచ్చాయా? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ మాటలు బూమరాంగ్‌ అయ్యాయి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలోని వ్యవహారాలు ఆయన మీద అట్రాసిటీ కేసు బుక్‌ చేసేదాకా వెళ్లాయట. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌ని ఉద్దేశించి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ…. ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్‌ చేశారు ఎల్బీనగర్ పోలీసులు. అదేంటీ… ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు అలా ఎలా నోరు జారారని అంటే…. ప్రోటోకాల్ దగ్గర మొదలైన వివాదం అంత దూరం వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈనెల 12న మన్సూరాబాద్ డివిజన్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే… అవే పనులకు తిరిగి తాను కొబ్బరికాయలు కొట్టారు బీజేపీ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి. దానిమీద బీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్ అయ్యారు. మరోచోట కూడా ఇలాగే శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకుని నిరసన తెలిపారు. వాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్‌కు తరలించారు. ఆ సమయంలో పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లను పరామర్శించేందుకు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌ వెళ్ళారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌పై సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడుల వెనుక మధుయాష్కి ఉన్నారని ఆరోపించారు. అదే సమయంలో… బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్మింహా రెడ్డి, వంగ మధుసూదన్‌కు, యాష్కికి మధ్య హనీమూన్ నడుస్తోందన్నారు. అక్కడితో ఆగకుండా…. హస్తినాపురం కార్పొరేటర్‌తోనూ హనీమూన్ నడుస్తోందని అనడంతో అగ్గి అంటుకుంది. ఒక మహిళను పట్టుకుని ఇతరులతో హనీమూన్‌ నడుస్తోందని అంటావా అంటూ భగ్గుమన్నారు హస్తినాపురం బీజేపీ నాయకులు.

ఈ కామెంట్స్‌ను కార్పొరేటర్ సుజాత నాయక్ ఖండించారు. సుధీర్ రెడ్డి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పీఎస్‌తో పాటు మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఆయన ఉద్దేశ్యం ఏదైనా… మహిళ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండవద్దా అన్నది క్వశ్చన్‌. . ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ యుద్ధం గట్టిగానే నడుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ చిన్న చిన్న విషయాలకు పోలీస్ కేసులు పెట్టిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే బానోతు సుజాత బీజేపీలో గెలిచి బిఆర్ఎస్ లో చేరి… స్థానిక ఎమ్మెల్యేతో విభేదించి ప్రస్తుతం కాంగ్రెస్ నేతలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ నేత మధుయాష్కీ ప్రోద్బలంతోనే తనపై అట్రాసిటీ కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే వాపోతున్నారట. ఎమ్మెల్యే బిఆర్ఎస్, మెజార్టీ కార్పొరేటర్లు బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎల్బీ నగర్‌లో ట్రయాంగిల్‌ ఫైట్‌ గట్టిగానే నడుస్తోంది. అందుకే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్లను ఉద్దేశించి వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలను కార్పొరేటర్ సీరియస్ గా తీసుకున్నారని, దాని పర్యవసానమే ఈ కేసులని అంటున్నారు. ఈ పొలిటికల్‌ వార్‌లో ముందు ముందు ఎన్ని మలుపులు ఉంటాయో చూడాలి.