NTV Telugu Site icon

Off The Record: రాజంపేటలో రంజుగా టీడీపీ వార్

Otr Rajampeta

Otr Rajampeta

Off The Record: అక్కడ టీడీపీ వర్సెస్‌ టీడీపీగా యుద్ధం నడుస్తోందా? పార్టీ సీనియర్‌ లీడర్‌ ఏకంగా మంత్రి మీదే ఎర్రచందనం, మట్టి మాఫియా ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వ కార్యక్రమం వేదికగా రోజుకో నాయకుడి మీద పూనకం వచ్చినట్టు ఊగిపోతున్న ఆ టీడీపీ సీనియర్‌ ఎవరు? ఎక్కడ జరుగుతోందా తన్నులాట?

అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగడం, పొలిటికల్‌ గోతులు తీసుకోవడం కామన్‌. ఇలాంటి కార్యక్రమాలు సొంత పార్టీలోనే అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి అరుదైన సన్నివేశాలకు ఇప్పుడు వేదిక అవుతోందట రాజంపేట నియోజకవర్గం. ఇక్కడ ఏకంగా మంత్రి టార్గెట్‌గా టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం సంచలనమవుతోంది. ఎర్రచందనం, మట్టి మాఫియాకు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ అధికారిక కార్యక్రమాల్లో ఆరోపణలు గుప్పిస్తున్నారు పార్టీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన అధికారులను పేషీలో పెట్టుకొని, తన బంధు వర్గానికి లాభం జరిగేలా ప్లాన్స్‌ వేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారట సుగవాసి. రాజంపేట అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సమయంలో తమ్ముళ్ల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలి వానగా మారుతోందంటున్నారు. పార్టీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం, అన్నమయ్య జిల్లా టిడిపి జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు మధ్య తలెత్తిన వివాదం పెద్దలకు తలనొప్పిగా మారుతోందట. దీంతో రాజంపేట నియోజకవర్గానికి తాత్కాలిక ఇన్చార్జిగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని నియమించింది అధిష్టానం.

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు ఆయనకు అప్పగించింది. తాను హాజరవుతున్న ఈ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనకుండా…రాంగోపాల్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్సీని కూడా టార్గెట్‌ చేశారట సుగవాసి. ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడానికి అధికారులు లేకుంటే ఎలాగన్నది ఆయన క్వశ్చన్‌. ఇదే వేదికపై నుంచి ఇటు ఎమ్మెల్సీ, అటు అన్నమయ్య జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పైన ఆరోపణలు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మంత్రి ఎర్రచందనం, మట్టి మాఫియాలను ప్రోత్సహించడమేకాకుండా, తెలుగుదేశం కార్యకర్తలకు కనీస సాయం కూడా చేయడం లేదన్నది సుగవాసి వెర్షన్‌. చివరికి సిఫారసు లేఖలను కూడా అమ్ముకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేయడం జిల్లా రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది.టిడిపి నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కార్యకర్తలను పట్టించుకోని మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని సుగవాసి అనడం ఇంకా కాక రేపుతోంది.

అటు సుగవాసి ఆరోపణలపై రాజంపేట టిడిపి సీనియర్ నేత వెంకట నరసయ్య ఘాటుగా స్పందించారు. ఆయన మంత్రి రాంప్రసాద్ రెడ్డికి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో మరోమారు చెలరేగిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం…. ఎన్నికల్లో తన ఓటమికి మేడా బ్రదర్స్ కారణమని ఆరోపించారు. ఇలా… ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం తమ్ముళ్ళ తన్నులాటలకు వేదికైంది. పార్టీ సీనియర్‌ లీడర్‌ సుగవాసి రోజుకో నాయకుడి మీద ఆరోపణలు చేయడంతో అసలాయన అంతరంగం ఏంటన్న చర్చ జరుగుతోంది. రాజంపేట విభేదాలకు ఆదిలోనే చెక్‌ పెట్టకుంటే…. ముదిరి మరింత సమస్యాత్మకం అవుతాయని అంటున్నారు పరిశీలకులు.