NTV Telugu Site icon

Off The Record : పిల్లి బోస్ కు టీడీపీ గాలం వేస్తోందా..?

Otr Pilli Subhas

Otr Pilli Subhas

వైసీపీకి చెందిన ఆ రాజ్యసభ్యుడు టీడీపీలోకి జంప్‌ కొట్టేస్తారా? టీడీపీ గాలం ఆల్రెడీ ఆయనకు టచ్‌ అయిందా? పైకి ఆయన లేదు లేదంటున్నా…. ప్రచారం మాత్రం ఆగడం లేదు ఎందుకు? ఊ.. అంటావా…ఉఊ.. అంటావా అంటూ టీడీపీ ఎదురు చూస్తోందన్నది నిజమేనా? ఇంతకీ ఎవరా ఎంపీ? వెనకున్న కథేంటి? పిల్లి సుభాష్‌చంద్రబోస్…. వైసీపీకి వీర విధేయుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీకి ఏకైక రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడాయనకు టీడీపీ గాలం వేస్తోందన్న ప్రచారం కలకలం రేపుతోంది. మీరొస్తానంటే చెప్పండి… దేనికైనా మేం రెడీ అంటూ తెలుగుదేశం వైపు నుంచి కన్ను గీటుతున్నట్టు ప్రచారం జరుగుతోంది తూర్పు గోదావరి రాజకీయ వర్గాల్లో. ఆ క్రమంలో ఒకరకంగా ఆయన మీద ఒత్తిడి కూడా పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. వాస్తవావాస్తవాల సంగతి ఎలా ఉన్నా… జంప్‌ చేస్తే… భారీగా ముట్టజెప్పే ప్రతిపాదనలు సైతం వచ్చినట్టు ఎంపీ సన్నిహితులు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11మంది సభ్యుల బలం ఉండగా… పార్టీ చరిత్రలో తొలిసారి టీడీపీకి అస్సలు ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

తాజా ఎన్నికల తర్వాత ఎన్డీఏ ఎమ్మెల్యేల బలం గణనీయంగా పెరిగినా ఆ ప్రకారం రాజ్యసభలో బలం రావాలంటే… ఇంకో రెండేళ్ళు పడుతుంది. అందుకే అధికార పక్షం వలసల మీద దృష్టి పెట్టిందని, ఆ గాలానికి పడేది ఎవరన్న చర్చ జరుగుతోంది వైసీపీ వర్గాల్లో. అదే సమయంలో టీడీపీ వైపు నుంచి మాత్రం బయటికి ఎలాంటి స్పందన కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. వైసీపీ సీనియర్‌ సభ్యుల్లో పిల్లి కూడా ఒకరు. అలాగే… జగన్‌తో కూడా ఆయనకు సాన్నిహిత్యం ఉందని అంటారు. 2019 ఎన్నికల్లో మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బోస్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. తర్వాత 2020లో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది వైసీపీ అధిష్టానం. అలాగే ఇటీవలి ఎన్నికల్లో బోస్‌ కుమారుడు ప్రకాష్‌కు రామచంద్రపురం అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. పార్టీ పరంగా ఇంత ప్రాధాన్యం ఇస్తున్న నాయకుడి విషయంలో జరుగుతున్న తాజా ప్రచారం ఒక రకంగా సంచలనమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది రాజకీయ వర్గాల్లో. పార్టీ అధిష్టానానికి వీర విధేయుడని ముద్ర ఉన్న నాయకుడు నిజంగా అలాంటి ఆఫర్‌ వస్తే జంప్‌ చేస్తారా? అసలు నిప్పు లేకుండానే పొగ వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయవర్గాల్లో. ఆయన పార్టీ మారబోరని అనుచరులు ఘంటాపథంగా చెబుతున్నా… కొందరిలో మాత్రం ఎక్కడో ఏదో అనుమానపు మొలకలు మొలుస్తూనే ఉన్నాయట.

చర్చ విస్తృతంగా జరుగుతున్న క్రమంలో తాను పార్టీ మారబోనని బోస్‌ చెబుతున్నా… దేన్నీ నమ్మే పరిస్థితి లేదన్న వాదన సైతం ఉంది. అటు టీడీపీ వైపు నుంచి టచ్‌లో ఉన్నారనిగాని, లేరనిగాని ఎలాంటి ప్రకటన రావడం లేదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో… వైసీపీకి చెందిన ఏ రాజ్యసభ సభ్యుడైనా… టీడీపీ వైపు వెళితే ప్రతిపక్షం చేయగలిగిందేమీ లేదు. అలాగని చట్టపరంగా పోరుబాట ఎంచుకున్నా… అది ఇప్పుడప్పుడే తేలే వ్యవహారం కాదు. మరి బోస్‌ విషయమై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాలంటే… మరికొన్ని రోజులు ఆగాల్సిందేనంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Show comments