Site icon NTV Telugu

Off The Record : పి.గన్నవరం కూటమిలో కుంపట్లు..TDP, Janasena మధ్య గ్యాప్ పెరుగుతుందా ?

P Gannavaram

P Gannavaram

అక్కడ కూటమిలో కుంపట్లు రగులుకుంటున్నాయా? నా నియోజకవర్గంలో మీ పెత్తనం ఏంటని తెలుగుదేశం నాయకుల మీద జనసేన ఎమ్మెల్యే ఫైరై పోతున్నారా? అక్కడి టీడీపీ లీడర్స్‌ పరిస్థితి కూడా తేలుకుట్టిన దొంగల్లా అయిపోయిందా? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? ఏ విషయంలో తేడా కొట్టింది రెండు పార్టీల మధ్య? కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య గ్యాప్‌ పెరుగుతోందా? అంటే…. వాతావరణం పూర్తిగా అలాగే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట టిడిపి నేతలు పెత్తనం చేసే ప్రయత్నంలో ఉన్నారని, అసలు ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే చాలా పనులు జరిగిపోతుండటంతో గ్యాప్‌ పెరుగుతోందని అంటున్నారు. తాజాగా అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టిందని చెప్పుకుంటున్నారు. టీడీపీ నాయకుడు చిట్టూరి శ్రీనివాస్‌ను ఆ పదవికి నామినేట్‌ చేశారు. కానీ… ఆ విషయమై తనకు కనీస సమాచారం లేదంటూ మండిపడుతున్నారట ఎమ్మెల్యే. అయినవిల్లికి చెందిన చిట్టూరినిఎంపిక చేయడాన్ని టీడీపీలోనే ఓ వర్గం సైతం వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ నాయకుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని మరీ…. ఈ విషయంలో తమ పార్టీ అదిష్టానం పునరాలోచించాలని కోరినట్టు తెలిసింది. చిట్టూరి శ్రీనివాస్‌ది కమ్మ సామాజికవర్గం కాగా…. ఆయనకు బదులు కాపు వర్గానికి చెందిన గణపతి వీర రాఘవులని కోరినట్టు సమాచారం. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి టిడిపి తరపున నాలుగు పేర్లు పంపించారట. దాని ఆధారంగానే ఎంపి జరిగిందని అంటున్నారు. అయితే తాము అనుకున్న వ్యక్తిని కాకుండా వేరే నాయకుడి పేరుకు పార్టీ పెద్దలు టిక్‌ పెట్టడంతో కంగుతిన్న కొందరు టిడిపి నేతలు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి మీరు జోక్యం చేసుకోమని కోరారారట. దాంతో కిందా మీదా కాలిపోయిన ఎమ్మెల్యే ఘాటుగానే రియాక్ట్‌ అయినట్టు సమాచారం. చేయాల్సిందంతా చేసేశారు…. ఇప్పుడు నాతో పనేముంది? నా దగ్గరికి వచ్చి ఉపయోగం ఏంటంటూ పి.గన్నవరం టీడీపీ నాయకులకు క్లాస్‌ పీకినట్టు తెలిసింది.

నాకు కనీసం సమాచారం ఇవ్వకుండా… మీరే మీటింగ్‌ పెట్టుకుని, ఆశావాహుల పేర్లు పంపేసి తీరా ఇప్పుడొచ్చి లబోదిబోమంటే ప్రయోజనం ఏముందని అన్నారట ఎమ్మెల్యే. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పుడు తనకు తెలియకుండా టీడీపీ లీడర్స్‌ గ్రూప్‌కట్టి అధిష్టానానికి లిస్ట్‌ పంపడంపై సీరియస్‌గానే ఉన్నారట సత్యనారాయణ. ఈ విషయం తెలుగుదేశం పెద్దలకు తెలియదా అంటూ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. నీటి సంఘాల చైర్మన్ల ఎంపికలో గానీ, సొసైటీ అధ్యక్షుల విషయంలోగాని… కూటమి ధర్మానికి గౌరవం ఇచ్చి ఏకాభిప్రాయంతోనే పదవులు కేటాయించానని, అందులో తన సొంత పెత్తనం ఏదీ చేయలేదని సన్నిహితుల దగ్గర అంటున్నారట ఆయన. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక విషయంలో కూడా అలాగే చేద్దామనుకుంటే… వాళ్ళు మాత్రం ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని సొంత పెత్తనాలు చేశారంటూ సీరియస్‌గానే అంటున్నట్టు తెలిసింది. వాళ్ళలో వాళ్లే అధిష్టానానికి నాలుగు పేర్లు పంపుకుని ఇప్పుడు తేడా పడిందని భోరుమంటే… నేను మాత్రం ఏం చేయగలనని టీడీపీ నేతల్ని ఉద్దేశించి అంటున్నట్టు తెలుస్తోంది. అధిష్టానానికి మీరు పంపిన ఆ కాగితాన్ని వెనక్కి తీసుకురాగలరా..! అంటూ తనను కలిసిన టీడీపీ నాయకుల్ని నిలదీసినట్టు సమాచారం. ఈ క్రమంలో నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు బయటపడిందని అంటున్నారు పరిశీలకులు. తాము అనుకున్నదానికి విరుద్ధంగా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఘొల్లుమంటున్నారుగానీ… అదే తాము ఊహించినట్టుగా నిర్ణయం తీసుకుని ఉంటే… మా అంత మొనగాళ్ళు లేరంటూ మీసాలు మెలేసేవాళ్ళు కదా అని అంటున్నారట పి.గన్నవరం జనసేన నాయకులు. టీడీపీ అధిష్టానం కూడా కర్రుకాల్చి వాత పెట్టిందని లోలోపల సంబరపడుతున్నారట గ్లాస్‌ పార్టీ లీడర్స్‌. జిల్లాల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ అంతా ఆయా నియోజకవర్గాల్లోని కూటమి ఎమ్మెల్యేల అభిప్రాయంతోనే జరుగుతోంది. కానీ… పి.గన్నవరంలో మాత్రం తన ప్రమేయం లేకుండా జరగడంపై కినుకతోనే ఉన్నారట ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఇలాంటి పరిణామాలే నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచుతున్నాయంటున్నారు పరిశీలకులు. కూటమి పెద్దలు దీనిపై ఎలా రియాక్ట్‌ అవుతారో…. ప్యాచ్‌వర్క్‌ చేస్తారా? లేదా? అన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Exit mobile version