NTV Telugu Site icon

Off The Record : నర్సాపురం పొలిటికల్‌ లేబొరేటరీస్‌లో వైసీపీ ప్రయోగాలు వికటించాయా..?

Otr Ycp

Otr Ycp

నర్సాపురం పొలిటికల్‌ లేబొరేటరీస్‌లో వైసీపీ ప్రయోగాలు వికటించాయా? ఎవ్వరూ చేయని, కనీసం ఆలోచన కూడా రాని ఎక్స్‌పెరిమెంట్‌కు మేం శ్రీకారం చుట్టామని నాడు గొప్పలు చెప్పుకున్న పార్టీకి నేడు అక్కడ దిక్కు లేకుండా పోయిందా? రండి బాబూ… రండి… పదవి తీసుకోండని పిలుస్తున్నా… అటువైపు చూసేవాళ్ళే కరవయ్యారా? మీ పదవి మాకొద్దు బాబోయ్‌ అని పార్టీ సీనియర్సే దండం పెట్టడానికి కారణం ఏంటి? అసలేంటా పదవి? నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం….. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం. ఇక్కడి నుంచి దాదాపుగా ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ లోక్‌సభకు ప్రాతినిద్యం వహించాయి. అందుకే పొలిటికల్‌గా అంత ప్రాముఖ్యత ఉంది. ఇక 2019ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన వైసీపీ 2024లో ఘోరంగా ఓడిపోయింది. ఆ పార్టీ చేసిన ప్రయోగాలు వికటించడమే అంత ఘోరమైన ఓటమికి కారణం అన్నది లోకల్‌ టాక్‌. కాపు, క్షత్రియ ఓటర్ల డామినేషన్ ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో బీసీ, మహిళకు అవకాశం ఇచ్చింది వైసీపీ. భీమవరం మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన గూడూరి ఉమాబాలకు టిక్కెట్‌ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ఆ విషయంలో జనం సంగతి ఎలా ఉన్నా… చివరికి పార్టీ కేడర్‌ కూడా నిరాశ చెందిందన్నది అప్పట్లో గట్టిగా వినిపించిన మాట. ఉమాబాల అభ్యర్థిత్వాన్ని అప్పట్లో పార్టీ కేడర్‌ సైతం అస్సలు ఊహించలేదట. కాపు, క్షత్రియ డామినేషన్‌ ఉండే నియోజకవర్గంలో బీసీకి, అందునా… ఏ మాత్రం ఆర్ధిక బలం లేని మహిళకు ఇవ్వడం ఏంటంటూ టిక్కెట్‌ ప్రకటన టైంలోనే డీలా పడ్డారట వైసీపీ కార్యకర్తలు.

సాధారణంగా టిక్కెట్‌ ఇచ్చే టైంలో కుల బలమో, ధన బలమో, రెండూ కాదంటే పొలిటికల్‌ ఛరిష్మానో చూస్తారని, స్థానికంగా ఇవేవీ లేని ఓ మున్సిపల్ స్థాయి నాయకురాలికి ఎంపీ టిక్కెట్‌ ఏంటని అప్పట్లోనే మెటికలు విరిచిన వైసీపీ నేతలు ఉన్నారట. చివరికి వాళ్ళంతా అనుకున్నట్టుగానే నర్సాపురంలో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కాస్త ఆలస్యంగా తత్వం బోధపడ్డ పార్టీ అధిష్టానం ఇప్పుడు రిపేర్‌ వర్క్స్‌ మీద దృష్టి పెట్టినా… సరైన పొలిటికల్‌ మెకానిక్‌ కనిపించడం లేదట. నర్సాపురం పార్లమెంటు బాధ్యతలు భుజానికెత్తుకోడానికి నాయకులు ఎవ్వరూ ముందుకు రావడం లేదంటున్నారు. ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఉమాబాల సైతం సైలెంట్ కావడంతో ఇపుడు నియోజకవర్గంలో పార్టీ బరువు మోసేది ఎవరన్నది మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌ అయింది. నడిపే నేత ఎవరు? ఎప్పుడు వస్తారంటూ… పార్టీ శ్రేణులు సైతం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాయట. అసలే కాపు ఓటర్ల డామినేషన్‌ ఉండే పార్లమెంటు నియోజకవర్గం కాబట్టి… అక్కడ కాపు సామాజికవర్గ, లేదా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారట కార్యకర్తలు.

కానీ… ఆ రెండు కులాల నుంచి ముందుకు వచ్చి కాడి పట్టడానికి ఎవరూ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఇప్పటికే భీమవరం, ఆచంట, ఉండి నియోజక వర్గాల్లోని సీనియర్ నాయకులు కామ్ అయిపోయారు. మరోపక్క మిగతా నేతల ఎవరూ యాక్టివ్‌గా లేరు. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు భుజానికెత్తుకున్న వాళ్ళకు ఇబ్బందులు తప్పవన్న భయంతో ఎవ్వరూ ముందుకు రావడంలేదన్న టాక్‌ నడుస్తోంది నియోజకవర్గంలో. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసిపి నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రభావం చూపలేకపోయారు. ఈ సమయంలో అధినేత మళ్ళీ ప్రయోగాలకు పోకుండా…కాస్తో కూస్తో పలుకుబడి ఉన్న వాళ్ళని ఎంపిక చేసి ఆర్ధిక సాయం అందిస్తే పరిస్థితి కాస్త మెరుగుపడవచ్చన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి స్థానికంగా. లేదంటే… నియోజకవర్గంలో పరిస్థితి చుక్కాని లేని నావలా తయారై… మొదటికే మోసం వస్తుందని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. దీంతో వైసీపీ అధిష్టానం నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు స్థానిక పార్టీ నాయకులు. పార్టీ అధిష్టానం మళ్లీ ప్రయోగాలకు పోతుందా? లేక ఉన్నవాళ్లలోనే ఒకర్ని ఎంపిక చేసి సాయం అందిస్తుందా అన్నది చూడాలంటున్నారు స్థానిక నేతలు.

Show comments