ఆ ఇద్దరు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అడుగు పెట్టాలంటే ఏంట్రీ పాస్ కావాల్సిందేనా? ఆ ఇద్దరు సీనియర్స్ ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేకపోతున్నారా? సీనియర్ మినిస్టర్స్ జూనియర్ ఎంపీలను తొక్కేస్తున్నారన్నది నిజమేనా? మరి ఎంపీలు కనీసం క్యాంప్ ఆఫీస్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? ఎవరా మంత్రులు, ఎంపీలు? జనం ఓట్లేసి గెలిపించారు. కానీ… ఇప్పుడు వాళ్ళకే దూరమైపోతున్నామంటూ తెగ ఫీలైపోతున్నారట నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు హాజరువుతున్నా హస్తం పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు దగ్గరవలేకపోతున్నామన్న బాధ వాళ్ళని వేధిస్తున్నట్టు తెలుస్తోంది. అటు కేడర్, ప్రజలు సైతం ఎంపీలు ఇద్దరూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని గుర్రుగా ఉన్నారట. వీళ్ళు వెళ్ళాలని అనుకుంటున్నారు, వాళ్ళు రమ్మంటున్నారు. అంతా బాగానే ఉంది కదా…? ఇక సమస్యేంటి అంటారా? అసలు విషయం అక్కడే ఉందట. ఎన్నికల బరిలోకి దిగిన మొదటి సారే రికార్డు స్దాయి మెజారిటీలతో ఎంపీలు అయ్యారు ఇద్దరూ. ఆ స్థాయిలో పార్లమెంట్‌కు పంపితే…ఇద్దరూ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నది నల్గొండ, భువనగిరి రెండు నియోజకవర్గాల్లో ఉన్న అభిప్రాయం. కానీ… ఆ విషయంలో ఇద్దరు ఎంపీల సన్నిహితుల మాట వేరుగా ఉందట.
ఆ పెద్దోళ్ళు ఇద్దర్నీ కాదని వీళ్ళు ఏం చేయగలుగుతారన్నది ఎంపీల సన్నిహితుల మాట. ఎవరా ఇద్దరు పెద్దలంటే… జిల్లాకు చెందిన మంత్రులు ఇద్దరూ అన్నది వాళ్ళ సమాధానం. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ గతంలో ఎంపీలుగా పని చేశారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. వేదిక ఎక్కడైనా… సందర్భం ఏదైనా సరే… నల్లగొండ, భువనగిరి ఎంపీలను తామే భారీ మెజారీటీతో గెలిపించామని గొప్పగా చెబుతున్నారట ఈ ఇద్దరు సీనియర్స్. ఆ విషయంలో సీనియర్ మంత్రుల ఉద్దేశ్యం ఏదైనా…. అజి ఈ జూనియర్ ఎంపీలకు మాత్రం నెగెటివ్ అవుతోందట. ఇదెక్కడి గొడవరా… బాబూ… ఇదేదో బుగ్గగిల్లి జోల పాడినట్టుగా ఉందంటూ ఎంపీలు ఇద్దరూ తెగ ఫీలైపోతున్నట్టు సమాచారం. అలాగే… జిల్లా సీనియర్ నేతలు, ఇద్దరు మంత్రులతో ప్రమేయం లేకుండా….ఇద్దరు యువ యంపీలు కార్యక్రమాలు నిర్వహించలేని పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. తామము ఎంపీలుగా గెలిచామన్న ఆనందంకంటే… చేతులు కట్టేశారన్న బాధే ఇద్దరిలో ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
తామొకటి తలిస్తే.. దైవమొకటి తలిచినట్టుగా తయారైందని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఎంపీలు. సీనియర్స్‌ని మెప్పించడానికి తాము ఏడాదిగా పోరాడి ఓడిపోతున్నామని, పరిస్థితి ఇలాగే ఉంటే… మా రాజకీయ భవిష్యత్ ఏంకాను అంటూ బాధ పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదే అదనుగా…. ఎంపీల విషయంలో నెగెటివ్ ప్రచారం కూడా మొదలైపోయిందట. మా ఎంపీలు ఎప్పుడూ బిజీగా ఉంటారు, కీలక జాతీయ, రాష్ట్ర నేతల వెంట కనిపిస్తున్నారు తప్ప… నియోజకవర్గాల్లో కనిపించడం లేదంటూ సొంతోళ్ళే సెటైర్స్ వేస్తున్నారట. నియోజకవర్గ ప్రజలు, క్యాడర్ ఎంపీలను కలవాలంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. ఇద్దరికీ నియోజకవర్గ కేంద్రాల్లోగానీ, ఆయా జిల్లాల్లో క్యాంప్ ఆఫీస్ కూడా లేకపోవడంతో కేడర్‌కు తిప్పలు తప్పడం లేదంటున్నారు. ఆపదలో మొక్కులు… సంపదలో మరపులు అన్నట్టుగా వాళ్ళ తీరుందన్న ఆవేదన సొంత పార్టీ క్యాడర్‌లోనే ఉందట. మరి కొందరైతే… ఒక అడుగు ముందుకేసి… వీళ్ళిద్దరి కంటే ముందు ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు దగ్గరగా ఉండేవారంటూ గుర్తు చేసుకుంటున్నారట. ఈ పోలిక కూడా కుర్ర ఎంపీలు ఇద్దరికీ మైనస్‌గా మారుతోందని అంటున్నారు. మమ్మల్ని తొక్కేస్తున్నారన్న బాధ ఎంపీల్లో ఉంటే అది వేరే సంగతి… కనీసం నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంప్ ఆఫీసులు ఎందుకు పెట్టుకోలేకపోతున్నారన్నది స్థఆనికుల ప్రశ్న.