NTV Telugu Site icon

Off The Record : కవిత రాజకీయ అడుగులపై ఆసక్తికర చర్చ.. బతుకమ్మ పండగతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తారా..?

Kavitha Otr

Kavitha Otr

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్‌ రీ ఎంట్రీకి గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారా? రాష్ట్రమంతటా పర్యటించాలనుకుంటున్నారా? ఆమె ఎదురు చూస్తున్న అవకాశం రానే వస్తోందా? అతి త్వరలోనే ఆమె యాక్టివ్‌గా తిరగబోతున్నారా? కవిత రీ ఎంట్రీ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏంటి? అందులో నిజమెంత? ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత… ఇకపై బీఆర్‌ఎస్‌లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారంటూ..ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. అయితే… ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇక ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారట ఆమె. తన బ్రాండ్‌ బతుకమ్మతోనే… గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గతం కంటే దూకుడుగా… రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తూ…. తన మీద వచ్చిన ఆరోపణలు, అభియోగాలకు కౌంటర్స్‌ ఇచ్చే ప్లాన్‌ ఉన్నట్టు సమాచారం. సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్న కవిత.. బతుకమ్మ పండగ రూపంలో వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలోచిస్తున్నారని, పార్టీ సీనియర్స్‌ కూడా ఇదే సూచిస్తున్నారని చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. తన నివాసంలో ఇటీవల కొందరు సీనియర్లు, మేధావులతో సమావేశం అయ్యారట కవిత. నిజామాబాద్‌ లోక్‌సభ సీటు పరిధిలో పార్టీ పరిస్దితితో పాటు.. రీ ఎంట్రీ పై సమాలోచనలు చేసినట్టు సమాచారం.

ఆ సందర్భంగా మెజార్టీ నేతలు బతుకమ్మ పండగతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వమని సూచించినట్టు చెప్పుకుంటున్నారు. త్వరలో స్థానిక సంస్ధల ఎన్నికలు సైతం రాబోతున్నాయి గనుక.. బతుకమ్మతోనే ఎంట్రీ ఇస్తేనే అన్ని విధాలా బాగుంటుందని ఆమె సన్నిహితులు సూచించినట్టు సమాచారం. ఐతే… ఆమె మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించలేదట. రీ ఎంట్రీపై తొందర పడకండా.. ఆచితూచి అడుగులు వేయాలనుకుంటున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్సీని లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐదున్నర నెలల పాటు జైల్లో ఉన్నారు కవిత. ఇటీవల బెయిల్ పై వచ్చాక కుటుంబంతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట. అలాగే సమయం దొరికినప్పుడు కార్యకర్తలు, ముఖ్య నేతలతో రీ ఎంట్రీ పై సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. జైల్లో ఉన్నప్పుడు తలెత్తిన ఆరోగ్య సమస్యలు సెట్‌ అయ్యాక ప్రజల్లోకి వెళితే బాగుటుందని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇప్పుడు పార్టీ అధిష్టానం కవితకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుంది.. ఆమె రోల్ ఎలా ఉండబోతోంది.. రాష్ట్ర స్దాయిలోనే సేవలు వినియోగించుకుంటారా..లేక ఢిల్లీ బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో కుమార్తె రీ ఎంట్రీకి కేసీఆర్‌ ఎలాంటి స్కెచ్ వేస్తున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా బతుకమ్మతో ఆమె తిరిగి జనంలోకి వస్తాయన్న వాదన అయితే గట్టిగా ఉంది రాజకీయవర్గాల్లో. అదే నిజమైతే.. బతుకమ్మ పండగ తర్వాత ఇక రాష్ట్రమంతటా రాజకీయ పర్యటనలు చేస్తారా? తన మీద వచ్చిన ఆరోపణలకు ఎలాంటి వివరణలు ఇచ్చుకుంటారన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి.