ఎమ్మెల్యే దానం నాగేందర్ అలిగారా? లేక భయపడ్డారా? అత్యంత కీలకమైన పార్టీ మీటింగ్‌కు ఎందుకు డుమ్మా కొట్టారు? దాని గురించి కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయనకు భయమెందుకు? ఒకవేళ అలిగితే రీజనేంటి? అధికారంలో ఉన్నాసరే… అంత యాక్టివ్‌గాలేని కాంగ్రెస్ శ్రేణుల్ని రీ ఛార్జ్ చేసే పని మొదలుపెట్టారట తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్‌తో కలిసి వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారామె. ఈ సందర్భంలోనే… పలు లోటుపాట్లు బయటపడుతున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్ష సమావేశాన్ని గురువారంనాడు నిర్వహించారు మీనాక్షి. కానీ… ఈ మీటింగ్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ డుమ్మా కొట్టారు. అసలు నిర్వహిస్తున్నదే లోక్‌సభ నియోజకవర్గ స్థాయి సమావేశం. అలాంటిదానికి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థే రాకపోవడంపై గాంధీభవన్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోందట. దానం అలకతో రాలేదా? వ్యూహాత్మకంగానా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో బిజీగా ఉన్నాయి కాంగ్రెస్ శ్రేణులు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారు దానం. తర్వాత… ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండానే… కాంగ్రెస్ బీ ఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వేటుపడితే…. ముందు వరుసలో దానం నాగేందరే ఉంటారన్న చర్చ జరుగుతోంది. ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా వేరే పార్టీలోకి జంప్ కొట్టడం ఒక ఎత్తయితే… అదే పార్టీ బీ ఫామ్ మీద పోటీ చేయడమంటే… లిటరల్‌గా ఇరుక్కున్నట్టేనన్న విశ్లేషణలున్నాయి. ఆ కోణంలోనే ఆయనకు ఇబ్బంది తప్పదన్న వాదన బలపడుతోంది. అయితే అదే సమయంలో…దానం ఇలాంటి వాటికి పెద్దగా భయపడే రకం కాదని, సమావేశానికి రాకపోవడం వెనక వేరే కారణాలు కూడా ఉండి ఉండవచ్చంటున్నారు కొందరు.
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పార్టీ సమస్యలు, నేతల మధ్య సమన్వయం లాంటి అంశాలపై మీటింగ్‌లో చర్చ జరిగింది. కానీ….అక్కడ దానం నాగేందర్ లేకపోవడంతో అటెన్షన్ ఆయన పైకి వెళ్ళిందట. ఇప్పటికే అనర్హత వేటు అంశం కోర్ట్‌లో ఉన్నందున, వివిధ వర్గాలు దాని గురించి మాట్లాడుకుంటున్నందున ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నారన్నది కొందరు నాయకుల అభిప్రాయం. అయితే… కొంతకాలంగా ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారని, మెయిన్ రీజన్ అదే అయిఉండవచ్చన్నది మరి కొందరి మాట. గ్రేటర్ హైదరాబాద్‌లో అధికారులు తన మాట వినడం లేదని మీడియాతో బాహాటంగానే అన్నారు నాగేందర్. అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఇదే అంశాన్ని ప్రస్తావించారాయన. దీంతో అదే ప్రధాన కారణం అయిఉండవచ్చంటున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్‌గా కూడా ఉన్నారు నాగేందర్. కానీ పార్టీ నిర్వహించే సమావేశాలకు రాకపోవడం హాట్ టాపిక్ అయింది. పోనీ అందుబాటులో లేరంటే అది నేరే సంగతి. కానీ… సిటీలోనే ఉండి సమావేశానికి రాకపోవడంతో అనర్హత భయం పట్టుకుందా..? లేదా అసంతృప్తితో రాలేదా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నాయట కాంగ్రెస్ వర్గాలు. బీఆర్‌ఎస్‌లో ఉన్నన్నాళ్ళు కామ్‌గానే ఉన్నారు ఎమ్మెల్యే. కానీ… కాంగ్రెస్‌లోకి ఎంటరయ్యాక ఆ పార్టీ స్టైల్ వర్క్ మొదలుపెట్టినట్టున్నారని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.