NTV Telugu Site icon

Off The Record : కూటమి సునామీని సైతం తట్టుకుని గెలిచిన ఆ YCP నేత పార్టీ మారుతున్నారా?

Ycp Mla Otr

Ycp Mla Otr

టీడీపీ వేవ్‌ను తట్టుకుని నిలబడ్డ ఆ వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గానికి కనీసం గెస్ట్‌గా కూడా రావడం లేదు. ఫలితాలు వచ్చాక జస్ట్‌ ఒకసారి అలా కనిపించి మాయమైపోయారు. పనుల కోసం సొంత పార్టీ వాళ్ళు ఫోన్‌ చేసినా… స్పందించకుండా.. కూల్‌ కూల్‌ అంటూ శాంతి మంత్రం జపిస్తున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన పార్టీ మారతారన్న ప్రచారంలో నిజమెంత? కూటమి సునామీలో కూడా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు బాలనాగిరెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ కేవలం రెండు సెగ్మెంట్స్‌లో మాత్రమే గెలిచింది. అందులో ఒకటి మంత్రాలయం కాగా రెండోది ఆలూరు. అయితే మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దర్శనమే నియోజకవర్గ ప్రజలకు కరవైందట. ఇప్పటికి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు బాలనాగిరెడ్డి. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. దీంతో అనర్హత వేటు పడింది. ఇక 2014, 2019, 2024లో వరుసగా వైసీపీ తరపున గెలిచారాయన. కానీ…టీడీపీ గాలిలోనూ గెలిపించిన ఓటర్లకు గాని, పార్టీ క్యాడర్ కు గానీ ఇప్పుడు అందుబాటులో లేకుండా పోవడంపై చర్చించుకుంటున్నారు స్థానికులు. ఫలితాల తర్వాత కొద్ది రోజులు మాత్రమే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి ఆ తర్వాత హైద్రాబాద్ బాటపట్టి ఇక తిరిగి రాలేదట. ఫలితాలు వచ్చి నెల రోజులవుతున్నా… నియోజకవర్గంలో కనీసం ఓ మీటింగ్‌ పెట్టలేదని, దీన్నెలా అర్థం చేసుకోవాలంటూ పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్న పరిస్థితి.

ఎన్నికల్లో ఎంతో కష్టపడి పనిచేసి గెలిపిస్తే తమ గురించి పట్టించుకోవడం లేదన్న అసహనం కేడర్‌లో పెరుగుతోందంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన పరిస్థితుల్లో… స్థానికంగా పార్టీ కేడర్‌కు అందుబాలో ఉంటూ భరోసా కల్పించాల్సిన ఎమ్మెల్యే అడ్రస్‌ లేకుండా పోవడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది నియోజకవర్గంలో. సెగ్మెంట్‌లో మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు, రేషన్ డీలర్ పోస్టులను లాక్కునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తుంటే వైసీపీ క్యాడర్ కు అండగా ఎవరూ లేరని, పార్టీ అధికారంలో ఉంటేనే ఎమ్మెల్యే అండగా ఉంటారా అని మాట్లాడుకుంటున్నారట వైసీపీ కార్యకర్తలు. కొందరు స్థానిక నాయకులు ఆగలేక శాసనసభ్యుడికి ఫోన్ చేస్తే… సైలెంట్ గా ఉండండి, మన ప్రభుత్వం లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులు పెట్టించుకోవద్దని ఉచిత సలహా ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ధైర్యం నింపాల్సిన ఎమ్మెల్యేనే నియోజకవర్గంలో లేకుండా పోవడంతో పాటు ఇలా గాలికి వదిలేస్తే… గోడు ఎవరికి చెప్పుకోవాలని ఆక్రోశిస్తున్నారట వైసీపీ కార్యకర్తలు. అలాగే ప్రజల సమస్యల మీద ఎవరిని అడగాలన్న క్వశ్చన్‌ కూడా వస్తోందని అంటున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు, గెలిచిన ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం జగన్‌ సమావేశం నిర్వహిస్తే…దానికి కూడా వెళ్లలేదట బాలనాగిరెడ్డి. మీటింగ్‌ అయిపోయాక విడిగా వెళ్ళి జగన్‌ను కలిసినట్టు తెలిసింది. అదే సమయంలో మరో సమస్య కూడా వస్తోందంటున్నారు స్థానిక నాయకులు. మీ ఎమ్మెల్యే పార్టీ మారతారట కదా అని ఎవరైనా అడిగితే… ఏం సమాధానం చెప్పాలో అర్ధంగాక దిక్కులు చూడాల్సి వస్తోందని బాధ పడుతున్నట్టు తెలిసింది. అయితే అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని, ఆయన పార్టీ మారే ప్రసక్తే లేదని అంటున్నారు ఎమ్మెల్యే సన్నిహితులు. దీంతో ఎమ్మెల్యే మనసులో ఏముంది? ముందు ముందు ఆయన ఏం చేయబోతున్నారంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు మంత్రాలయం నియోజకవర్గంలో.