NTV Telugu Site icon

Off The Record : రాజకీయ పార్టీలను చూసి భయపడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..?

Otr Siddipet

Otr Siddipet

Off The Record : సిద్దిపేట ఫ్లెక్సీ వార్‌ ఎట్నుంచి ఎటు వెళ్తోంది? దాన్ని తల్చుకుని పోలీసులు ఎందుకు భయపడుతున్నారు? సాక్షాత్తు పోలీస్‌ అధికారులే మా వల్ల కాదు బాబోయ్‌…. అని మొత్తుకోవడానికి కారణం ఏంటి? రాజకీయ పార్టీలను చూసి పోలీసులు భయపడాల్సినంత పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు సిద్దిపేటలో ఏం జరుగుతోంది?

తెలంగాణలో రుణమాఫీ రాజకీయం యమ రంజుగా మారుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి డెడ్‌లైన్‌లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ చెబుతుంటే..సగం మందికే మాఫీ అయిందని, మిగతా వాళ్ళ సంగతేంటని ప్రశ్నిస్తోంది బీఆర్‌ఎస్‌. ఈ క్రమంలో… ముందు చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి హరీష్‌రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నది కాంగ్రెస్‌ డిమాండ్‌కాగా ఒక్కసారిగా ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రుణమాఫీ జరిగితే రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రావు ముందు ఆ పని చేయాలంటూ ఉన్నట్టుండి ఫ్లెక్సీలు వెలిశాయి. సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంచార్జ్ హరికృష్ణ పేరుతో ఆ ఫ్లెక్సీలు పెట్టడాన్ని నిరసిస్తూ…. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. పోటీగా కాంగ్రెస్ నాయకులు వచ్చి గులాబీ పార్టీకి వ్యతిరేక నినాదాలు చేశారు. కాంగ్రెస్ పెట్టిన ఫ్లెక్సీలను తీసివేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అదే సమయంలో… అటు కాంగ్రెస్ నాయకులు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఉన్న KCR ఫ్లెక్సీని చింపివేశారు. వెంటనే పోలీసులు కాంగ్రెస్ నాయకుల్ని కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళారు. ఆ ఎపిసోడ్‌లో రెండు పార్టీల నాయకుల మీద కేసులు బుక్‌ అయ్యాయి. దీంతో పోలీసుల మీద ఒక్కసారిగా వత్తిడి మొదలైందట. మా తప్పు లేకుండా మా వాళ్ళని ఎలా అదుపులోకి తీసుకుంటారని అంటూ… రెండు పక్షాల ముఖ్యులు పోలీసుల మీద వత్తిడి తెచ్చినట్టు తెలిసింది. తప్పు అవతలి పార్టీదైతే మా నాయకులను ఎందుకు అరెస్ట్ చేశారని ఇరు పార్టీల పెద్దలు పోలీసు పెద్దలతో ఫోన్లోనే వాగ్వాదానికి దిగారట. అధికార పార్టీకి పోలీసులు వంత పాడుతున్నారని BRS ఆరోపిస్తుంటే… కాంగ్రెస్ నేతలు మాత్రం BRS ఎమ్మెల్యే హరీష్ రావుకే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో మేటర్‌ సీఎంవో దాకా వెళ్ళినట్టు తెలిసింది.

వ్యవహారం ముదరడంతో… ఫ్లెక్సీ వార్‌పై సిద్దిపేట సీపీని నివేదిక కోరినట్టు సమాచారం. రాజకీయంగా ఎవరి ఎత్తుగడలు వారివైతే… మధ్యలో మా పరిస్థితి మద్దెల వాయింపుడులాగా మారిపోయిందని తలలు పట్టుకుంటున్నారట పోలీస్‌ పెద్దలు. లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగానే ఇరు పార్టీల నేతలను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఇక ఫ్లెక్సీ వార్ తర్వాత చేపట్టిన కాంగ్రెస్ ర్యాలీ, BRS రైతు రుణమాఫీ సమావేశం కూడా పోలీసులకు కత్తిమీద సాములా మారింది..ముందుగా కాంగ్రెస్ ర్యాలీ కోసం 20న పర్మిషన్ తీసుకోగా..అదే రోజు పోటీగా BRS రుణమాఫీ కానీ రైతులతో సమావేశం నిర్వహించింది. దీంతో మరోసారి హై టెన్షన్ ఏర్పడింది సిద్దిపేటలో. కాంగ్రెస్ ర్యాలీ కోసం మొదట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీదుగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోగా..BRS అక్కడే సమావేశం పెట్టుకోవడంతో రూట్ మార్చారు పోలీసులు. అందుకు కాంగ్రెస్ నేతలు మైనంపల్లి, పూజల హరికృష్ణ ఒప్పుకోలేదు. మొదట ఫిక్స్ చేసిన రూట్ లోనే వెళ్తామని పట్టుబట్టగా… చివరికి ఎలాగోలా నచ్చజెప్పిన పోలీసులు ఎమ్మెల్యే క్యాంప్ దగ్గర బ్యారికేడ్స్‌ పెట్టారు. చివరికి బస్సుల్ని కూడా అడ్డం పెట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఫైనల్ గా కాంగ్రెస్ నేతలు రూట్‌ మార్చుకుని వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు. కానీ… ఈ విషయంలోనూ పోలీసులు మరోసారి తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల్ని తెర మీదికి తెచ్చింది కాంగ్రెస్‌. ఇలా సిద్దిపేటలో రోజుకోరకంగా రాజుకుంటున్న కాంగ్రెస్, BRS గొడవలు.. పోలీసులకు తలపోటుగా మారాయట. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మా పరిస్థితి మారిపోయింది… ఈ వత్తిడిలో ఇలాంటి కేసుల్ని హ్యాండిల్‌ చేయడం మా వల్ల కావడం లేదు బాబోయ్‌ అంటున్నారట సిద్దిపేట పోలీసులు. అలాగే ఈ ఫ్లెక్సీ వార్‌ ఎట్నుంచి ఎటు టర్న్‌ అవుతుందోనని ఇప్పటికీ అత్యంత జాగ్రత్తగా ఉంటున్నారట పోలీసులుప. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు బలమైన ప్రతిపక్ష నేత కారణంగా ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన మాత్రం పెరుగుతూనే ఉందట.