NTV Telugu Site icon

Off The Record : కేటీఆర్ ట్విట్టర్ మెసేజ్ల ఉద్దేశం అదేనా..?

Ktr Otr

Ktr Otr

పార్టీ మారిన, మారాలనుకుంటున్న ఎమ్మెల్యేల విషయంలో బీఆర్‌ఎస్‌ వైఖరి మారిందా? బతిమాలుకోవడాల ప్లేస్‌లోకి ఒక రకమైన బెదిరింపులు వచ్చేశాయా? డైరెక్ట్‌ వార్నింగ్స్‌ కాకుండా… కోర్ట్‌ తీర్పులు, రూల్స్‌ అంటూ జంపింగ్‌ జపాంగ్స్‌ ముందరి కాళ్ళకు బంధాలు వేయాలనుకుంటున్నారా? అలాంటివి ఎంతవరకు పనిచేసే అవకాశం ఉంది? సుప్రీంకోర్టు తీర్పును పదే పదే ప్రస్తావిస్తూ… సోషల్‌ మీడియా ప్రచారం చేయడం వెనకున్న ఉద్దేశ్యం ఏంటి? అవును బ్రదర్‌… మేం ఫిరాయింపుల్ని ప్రోత్సహించాం. అప్పట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని లాక్కున్నాం. అయితే ఏంటి… మాకప్పుడు రూల్స్‌ కలిసొచ్చాయి. కంప్లీట్‌గా వాడుకున్నా. కానీ… ఇప్పుడా పరిస్థితి లేదు. పార్టీ మారితే కోర్ట్‌ తీర్పులు కాల్చి వాతపెడతాయి. అందుకు మేమేం చేస్తాం… మాకున్న సదుపాయాన్ని వాడేసుకుంటాం. మా ఎమ్మెల్యేల్ని కాపాడుకుంటాం. ఇదీ… ప్రస్తుతం ఫిరాయింపుల విషయంలో బీఆర్‌ఎస్‌ వెర్షన్‌. రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఫిరాయింపుల్ని గట్టిగానే ప్రోత్సహించింది గులాబీ పార్టీ. కాంగ్రెస్, టీడీపీ, చివరకు లెఫ్ట్‌ ఎమ్మెల్యేల్ని కూడా కలిపేసుకుంది. ఆ టైంలో స్పీకర్ నిర్ణయమే అంతిమంగా… ఆయా పార్టీల శాసనసభాపక్షాల్ని సైతం విలీనం చేసుకుంది బీఆర్‌ఎస్‌. కానీ… ఈ సీజన్‌లో అది రివర్స్‌ అయింది. 2023 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం అయిన గులాబీ పార్టీ ఇప్పుడు వలసల దెబ్బకు విలవిల్లాడిపోతోంది. ఏకంగా ఆ పార్టీ గుర్తు మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌ గూటికి చేరిపోయారు. అంతేనా… 15 మంది కూడా పెట్టేబేడా సర్దుకుని రెడీగా ఉన్నారని, ఫైనల్‌గా బీఆర్‌ఎస్‌ల్పీ సీఎల్పీలో విలీనంతో ఆ ప్రక్రియ ముగుస్తుందంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఈ ప్రచారం అంతకంతకూ పెరుగుతుండటంతో…ఉలిక్కిపడ్డ బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ప్యాచప్‌ వర్క్‌ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ నిపుణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర సీనియర్‌ నేతల బృందం చర్చలు జరిపినట్టు తెలిసింది.

అటు రాజ్యాంగ నిపుణులతోనూ సుదీర్ఘ మంతనాలు జరిపిందట పార్టీ ప్రతినిధి బృందం. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ ఎమ్మెల్యేతోపాటు పలు ఇతర కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని నిపుణులు బీఆర్‌ఎస్‌ఎస్‌ టీమ్‌ దృష్టికి తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు. దాని ఆధారంగానే… గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఇక నాన్చలేరని గట్టిగా వాదిస్తోంది గులాబీ పార్టీ. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున నాన్చుడు ధోరణికి కాలం చెల్లినట్టేనన్నది బీఆర్‌ఎస్‌ వాదన. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వ్యవహారం హైకోర్ట్‌, లేదా సుప్రీం కోర్ట్‌లో నెల రోజుల్లో తేలిపోతుందని, ఆ విషయంలో డౌటేలేదని బల్లగుద్ది చెబుతున్నారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అదే జరిగితే…. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని…అప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నారాయన. అంతవరకు బాగానే ఉన్నా… అక్కడే మరో రకమైన డౌట్‌ కూడా వస్తోందట రాజకీయ వర్గాలకు. ఇలాంటి స్టేట్‌మెంట్స్‌ ద్వారా…. ఫిరాయించిన ఎమ్మెల్యేల్ని తిరిగి రప్పించుకునే ప్లాన్‌ చేస్తున్నారా? అన్న చర్చ కూడా మొదలైందట. అలాగే మహారాష్ట్ర తీర్పును చూపిస్తూ…వెళ్ళిపోదామనుకుని ఇప్పటికే సర్దుకుని రెడీగా ఉన్న వారికి కూడా వార్నింగ్‌ ఇస్తున్నారన్నది ప్రధానమైన అనుమానం. ఇలాంటి పాయింట్స్‌ని తెర మీదికి తేవడం ద్వారా… ఇంకో నాలుగేళ్ళపాటు ఎమ్మెల్యేలుగా ఉండాల్సినవాళ్ళంతా.. ఇప్పుడు ఉప ఎన్నికలకువెళ్ళే సాహసం చేయరన్నది బీఆర్‌ఎస్‌ పెద్దల భావనగా తెలుస్తోంది. అందుకే ఫిరాయింపులపై ఫిర్యాదుల అంశాన్ని కేటీఆర్ ఈ మధ్య కాలంలో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. తాజాగా తన ట్వీట్ ల ద్వారా మరోసారి మేటర్‌ని నొక్కి చెప్పాలనుకుంటున్నారట ఆయన. మరి పోతే పదవి ఊడుతుందంటూ పెడుతున్న మెస్సేజ్‌లు ఎమ్మెల్యేల్ని ఆపుతాయా? వెళ్ళిన వాళ్ళని వెనక్కు రప్పిస్తాయా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.