కేసులు, నోటీసుల పరంపరలో ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే వంతు వచ్చిందా? ఆయన ఏకంగా 20 ఎకరాల చెరువు స్థలాన్ని ఆక్రమించేశారన్నది నిజమేనా? ప్రస్తుతం నోటీసులతో మొదలైన ప్రక్రియ ఎంతదాకా వెళ్ళే అవకాశం ఉంది? అందుకు ఆయనేమంటున్నారు? ఆ కొత్త నోటీసుల కథేంది? ఏపీ కేసుల పరంపరలో ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే వంతు వచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలీస్ నోటీసులు, కోర్టుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు, అరెస్ట్‌ల వ్యవహారం ఎప్పటికప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతోంది రాష్ట్రంలో. ఈ క్రమంలోనే… ఇప్పుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వంతు వచ్చినట్టుందని అంటున్నారు పరిశీలకులు. ఆయన ఫామ్ హౌస్ ప్రభుత్వ స్థలంలో ఉందని రెవెన్యూ అధికారులు తేల్చడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గుడ్ మార్నింగ్ అంటూ ఉదయాన్నే ప్రజల మధ్యకు వస్తూ రెండు రాష్ట్రాల్లో బాగా ఫేమ్ అయ్యారు కేతిరెడ్డి. అదే మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ధర్మవరం ఎర్రగుట్ట మీదున్న నిర్మాణాల చుట్టూ గతంలోనే రకరకాల వివాదాలు రేగాయి. వైసీపీ పవర్‌లో ఉన్నప్పుడు ఆరోపణలు రాగా… వాటికి కేతిరెడ్డి సమాధానం ఇస్తూ వచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా ధర్మవరం వచ్చినప్పుడు ఫామ్ హౌస్ వీడియోలు రిలీజ్ చేసి చాలా ఆరోపణలు చేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో చెరువును క్రమించి ఫామ్‌హౌస్ కట్టారంటూ నిరుడు నవంబర్‌లో నీటి పారుదలశాఖ అధికారులు కేతిరెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లోగా కబ్జా చేసిన స్థలాలను ఖాళీ చేయకపోతే అందులో ఉన్న నిర్మాణాలు, చెట్లు, పంటలను ప్రభుత్వం స్వాధీనంచేసుకుంటుందని అందులో పేర్కొన్నారు. అయితే…అవి పూర్తిగా రాజకీయ ప్రోద్బలంతో ఇచ్చిన నోటీసులంటూ వెంటనే కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే. అధికారులు నోటీసులు ఇచ్చినందుకు కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని.. ఆ దిశగా సివిల్ కోర్టుకు వెళ్తానని చెప్పారు. ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా వాస్తవం కాదని, గతంలో హైకోర్టు కూడా ఇదే చెప్పిందన్నారు.
ఆ తర్వాత నాలుగైదు నెలల గ్యాప్‌తో మళ్లీ కేతిరెడ్డి కోట వార్తల్లోకి ఎక్కింది. ధర్మవరం చెరువు ప్రాంతంలో గుర్రాల కొండపై నిర్మించుకున్న వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమి 2.42 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ భూమి మాజీ ఎమ్మెల్యే మరదలు గాలి వసుమతి పేరుతో రిజిస్టర్ అయింది. ఈ భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు 1960లో ధర్మవరం మండలం మోటుమర్లకు చెందిన అంకే నారాయణ, లక్ష్మీ చెన్నకేశవపురానికి చెందిన ఓబులమ్మ, రామగిరి మండలం శ్రీహరిపురానికి చెందిన తలారి అంజినమ్మలకు పట్టాలు ఇచ్చారు. వాళ్ళంతా కలిసి గాలి వసుమతికి అమ్మినట్టు రిజిస్టర్ చేయించారు. అయితే… వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇష్టం వచ్చినట్టు అమ్మడానికి అనుమతులు లేవు. దీంతో భూమి ముగ్గురికి ఇటీవల రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. మరోవైపు తాజాగా ఇచ్చిన నోటీసులను కేతిరెడ్డి కుటుంబ సభ్యులు తీసుకోలేదు. అసలు మేటర్ ఈ రెండున్నర ఎకరాలదే కాదని…గతంలో 30ఎకరాలదాకా భూమి కాజేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. ఈ రెండున్నర ఎకరాలు మాత్రం ప్రభుత్వానిదేనని అధికారికంగా తేల్చారు రెవెన్యూ అధికారులు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ఈ భూములు, వ్యవసాయ క్షేత్రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డివేనని చెబుతున్నప్పటికీ… నేరుగా ఆయన పేరుతో ఎక్కడా ఒక్క ఇటుక కూడా లేదు. మొత్తం ఆయన తమ్ముడు వెంకటకృష్ణా రెడ్డి, మరదలు వసుమతి పేర్లతోనే ఉన్నాయి వసుమతి పేరుతో రైతుల నుంచి 25 ఎకరాలు కొన్నట్టు రికార్డులో ఉంది. దానికి ఆనుకుని ఉన్న చెరువు స్థలాన్ని దాదాపు 20 ఎకరాల వరకు ఆక్రమించి కలిపేసుకున్నారన్నారన్నది టీడీపీ నేతల ఆరోపణ.కానీ ఇప్పుడు రెవెన్యూ అధికారులు మాత్రం 2.42ఎకరాలు మాత్రమే ఆక్రమించినట్టు తేల్చారు. అది కూడా ప్రభుత్వానిది కాదంటూ కోర్ట్‌కు వెళ్ళారు. ఈ వ్యవహారాల సంగతి ఎలా ఉన్నా….. పరిస్థితి చూస్తుంటే మాత్రం కేసులు, విచారణల పరంపరలో ఇప్పుడు కేతిరెడ్డి వంతు వచ్చినట్టే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.