NTV Telugu Site icon

Off The Record: మళ్ళీ ఆరు నెలల దాకా కేసీఆర్‌ సభలో కనిపించరా..?

Kcr

Kcr

Off The Record: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది వన్డే అసెంబ్లీ ముచ్చటేనా? బడ్జెట్‌ రోజున సభలో కూర్చుని మమ అనిపించిన కేసీఆర్‌ ఇక ఇప్పట్లో సభ వైపునకు తొంగిచూడబోరా? కేవలం సాంకేతిక అవరోధాల్ని అధిగమించడానికే… ఆ ఒక్క రోజైనా ఆయన అసెంబ్లీకి వెళ్ళారా? ఆయన విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్‌ వాచ్‌.

పదేళ్ళు అధికారంలో ఉండి… అంతా తానై నడిపించిన మాజీ సీఎం కేసీఆర్… మొదటి సారి ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసలాయన సభకు వస్తారా? రారా? అన్న అనుమానాల మధ్య మొదటిసారి బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనడానికి రావడంతో… సభ ప్రాంగణంలో కాస్త హడావుడి కనిపించింది. బీఆర్‌ఎస్‌ ఓడిపోయాక, కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందే… ఆయన ఫామ్‌హౌస్‌ జారిపడటంతో తుంటి ఎముకకు శస్త్ర చికిత్స జరిగింది. ఆ కారణంగానే కేసీఆర్‌ ఇంతకు ముందు సమావేశాలకు హాజరవలేదని చెప్పుకుంటూ వచ్చారు బీఆర్‌ఎస్ నేతలు. మొదటగా ప్రమాణ స్వీకార సెషన్‌కు రాలేదు, తర్వాత జరిగిన రెండవ సమావేశానికి కూడా హాజరవలేదు ప్రతిపక్ష నేత. దీంతో ఈసారి అసెంబ్లీ వైపు రారేమోనన్న డౌట్స్‌ కూడా వచ్చాయి కొందరికి. ఈ 23 నుంచి మొదలైన తాజా అసెంబ్లీ సమావేశాలకు కూడా మొదటి రెండు రోజులు హాజరవలేదు కేసీఆర్‌. దీంతో ఈసారి కూడా రారేమోనన్న అనుమానాలను క్లియర్‌ చేస్తూ… బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజున హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రసంగాన్ని సభలోనే కూర్చుని పూర్తిగా ఫాలో అయ్యారాయన. చివరి పేజీ ప్రసంగ సమయంలో బయటకు వచ్చి నేరుగా మీడియా పాయింట్ కు వెళ్లి అభిప్రాయం చెప్పారు. ఆ తర్వాత ఇక సభవైపు చూడలేదు విపక్ష నేత. దీంతో ఆయనదంతా వన్డే ముచ్చటేనా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఓ సినిమాలో వన్డే సీఎం కానెస్ప్ట్‌లాగా ఈయన కూడా వన్డే అపోజిషన్‌ లీడరా అన్న సెటైర్స్‌ సైతం వినిపిస్తున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

బడ్జెట్ రోజు సభకు రావడం ద్వారా… ఒక్కసారి కూడా సభకు వెళ్ళలేదన్న విమర్శలు లేకుండా చేసుకోవాలనుకున్నారా? బడ్జెట్ ప్రసంగం కాబట్టి నేరుగా తాను చేయాలనుకున్న విమర్శలు చేసేసి వెళ్ళిపోతే ఓ పనైపోతుందని అనుకున్నారా అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో మరో వాదనా వినిపిస్తోంది. ఆ రోజున కేవలం బడ్జెట్‌ ప్రసంగమే ఉంటుంది కాబట్టి సభలో విమర్శలకు తావుండదని, అదే పూర్తిగా చర్చ జరిగే మిగతా రోజుల్లో హాజరైతే… గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పొప్పులపై మాట్లాడాల్సి ఉంటుందని, తాను కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ముఖం చాటేస్తున్నారా? అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట రాజకీయవర్గాల నుంచి. బడ్జెట్ విషయంలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానన్న కేసీఆర్‌ మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమా? ఆయన సభకు వచ్చి నేరుగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేనట్టేనా అని కూడా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. అదే సమయంలో… మీరంతా… ఇంత ఆలోచిస్తున్నారుగానీ… అసలాయన జస్ట్‌ టెక్నికాలిటీ కోసమే ఒక్కరోజు సభకు వచ్చి వెళ్ళారన్న ఇంకో వాదన సైతం వినిపిస్తోంది కొన్ని సర్కిల్స్‌లో. నిబంధనల ప్రకారం చూస్తే…. ప్రతి సభ్యుడు ఆరు నెలల్లో ఒక్కసారి అయినా అసెంబ్లీకి హాజరవ్వాలి. లేదంటే… అందుకు తగిన సహేతుకమైన కారణాలను చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్‌ కూడా ఆ సాంకేతికమైన అవరోధాన్ని అధిగమించడం కోసమే ఒక్క రోజు ఇలా వచ్చి అలా వెళ్లారా అని విశ్లేషించే వాళ్ళు సైతం ఉన్నారు. ఇప్పుడాయన ఒక్కసారి వచ్చి వెళ్లారు కాబట్టి… మరో ఆరు నెలల పాటు వెసులుబాటు ఉంటుంది. మరి ఆయన ఆ వెసులుబాటును వాడుకుంటారా? లేక సభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపై గళం విప్పుతారా అని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.