కాళేశ్వరం కమిషన్ విచారణలో సరికొత్త ట్విస్ట్‌లు ఉండబోతున్నాయా? బీఆర్‌ఎస్ ముఖ్యులు ఇంకా ఇరుక్కుంటున్నారా? ఆ మంత్రి…. మాజీ మంత్రుల్ని గట్టిగా ఇరికించేస్తున్నారా? కమిషన్‌కు ముగ్గురు ముఖ్యులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వాస్తవం లేదంటూ…. తన దగ్గరున్న ఆధారాలను కమిషన్ ముందు పెట్టారా? ఎవరా మంత్రి? ఇప్పుడేం జరిగే అవకాశం ఉంది? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణే హాట్ టాపిక్. బ్యారేజీ పియర్స్ కుంగుబాటుపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ విచారణ చివరి దశకు చేరుకుంది. అయితే… ప్రాజెక్ట్ విషయంలో… అసలైన రాజకీయం ఇప్పుడే బయటపడుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈనెల ఆరున కమిషన్ ముందు విచారణకు హాజరైన మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్… అప్పటి క్యాబినెట్ నిర్ణయం మేరకే నిర్మాణం జరిగిందని చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు ప్రాణహిత- చేవెళ్ల రీ డిజైన్, రీ ఇంజనీరింగ్ కోసం ముగ్గురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు చైర్మన్ గా, తాను, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నామని స్పష్టం చేశారాయన. దీంతో అనూహ్యంగా ఈటల రాజేందర్….. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పేరును తెరమీదకు తీసుకు వచ్చినట్టయింది. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట తుమ్మల. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ… కాళేశ్వరం నిర్మాణానికి క్యాబినెట్ అనుమతి లేదని, బీఆర్‌ఎస్ హయాంలో తాను మంత్రిగా ఉన్నన్ని రోజుల్లో ఎప్పుడూ క్యాబినెట్ మీటింగ్‌లో కాళేశ్వరం చర్చ జరగలేదని, తాను ఎలాంటి సంతకాలు పెట్టలేదని ప్రకటించడం సంచలనం అయింది. అక్కడితో ఊరుకోకుండా అంతకు మించిన సంచలనానికి తెరలేపారు తుమ్మల. కాళేశ్వరం కమిషన్‌కు మంత్రి లేఖ రాయడంతో ఈ వ్యవహారం ఎట్నుంచి ఎటు టర్న్ అవుతుందోన్న ఉత్కంఠ పెరుగుతోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులు, అలాగే మంత్రివర్గ సమావేశాల మినిట్స్‌కి సంబంధించిన పత్రాలను కూడా ఆ లేఖకు జత చేశారట తుమ్మల. వాటన్నిటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోమని కోరడంతో…. ఇప్పుడు బీఆర్‌ఎస్ పెద్దలు ఇరుక్కున్నట్టేనా అన్న చర్చ జోరుగా జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్…., ప్రాజెక్ట్‌లో భాగమైన 3 బ్యారేజీల నిర్మాణాన్ని క్యాబినెట్ సబ్‌కమిటీ సూచనల మేరకే చేపట్టినట్టు తెలిపారు. కానీ…. ఈ వాదనను ఖండించారు తుమ్మల. అసలు ఉప సంఘం నివేదిక రావడానికి ముందే బ్యారేజీల నిర్మాణం ప్రారంభమైందన్నది మంత్రి వాదన. ఇదే విషయాన్ని అధికారిక పత్రాలతో సహా కమిషన్‌కు పంపారట ఆయన. దీంతో… కమిషన్ గనక ఆ లేఖను సీరియస్‌గా తీసుకుని లోతుల్లోకి వెళితే….. ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలు, వాటి వెనుక ఉన్న అధికారిక ప్రక్రియలపై విచారణకు ఇది బలమైన ఆధారంగా మారవచ్చని భావిస్తున్నారు. జులైలో కమిషన్ తుది నివేదిక ఇవ్వాల్సి ఉన్న టైంలో..తుమ్మల రాసిన తాజా లేఖ ఆ నివేదిక రూపకల్పనలో కీలకమవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో కమిషన్ గనుక లేఖ మీద స్పందిస్తే… మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీనికి తోడు అవసరమైతే… కేసీఆర్, ఈటల రాజేందర్, హరీష్ రావును మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు ఉండవచ్చంటున్నారు. ఇప్పుడు కమిషన్… తుమ్మల లేఖ లోతుల్లోకి వెళ్తుందా? లేక జరిపిన విచారణ చాలనుకుని తుది నివేదికను సిద్ధం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
