NTV Telugu Site icon

Off The Record : కడియం శ్రీహరి కావాలనే కారు పార్టీకి దెబ్బ కొట్టారా..?

Kadiyam Otr

Kadiyam Otr

కడియం శ్రీహరి వ్యూహాత్మకంగానే కారు పార్టీని దెబ్బ కొట్టారా? ముఖ్య నేతలందర్నీ ముందే పంపేసి తాను తప్ప దిక్కులేని స్థితికి తీసుకువచ్చి… ఫైనల్‌గా హ్యాండివ్వడాన్ని ఎలా తీసుకుంటోంది బీఆర్‌ఎస్‌? తన కూతురు కావ్యను వరంగల్‌ అభ్యర్థిగా ప్రకటించాక కూడా పార్టీ మారడం వెనకున్న ఎత్తుగడ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక నేత కడియం శ్రీహరి. బీఆర్‌ఎస్‌ గూటికి చేరాక పదేళ్ళ పాటు కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. పార్టీ పరంగా ఆయనకు కూడా అత్యంత ప్రాధాన్యత దక్కింది. ముందు ఎంపీని చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి నాడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టారు కేసీఆర్‌. ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌ కావాలని పట్టుబడితే… స్టేషన్ ఘన్పూర్ టిక్కెట్‌ ఇవ్వగా ప్రస్తుతం అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. పార్టీలో అంత ప్రాధాన్యం ఉన్న కడియం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో కోలుకోలేని దెబ్బ కొట్టారన్న చర్చ నడుస్తోంది. కూతురు కావ్య రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీని దారుణంగా దెబ్బకొట్టారన్న వాదన వినిపిస్తోంది. ఎప్పటినుంచో కావ్యను రాజకీయంగా నిలబెట్టాలనుకుంటున్న కడియం శ్రీహరి… వరంగల్ పార్లమెంట్ లోక్‌సభ బరిలో దించేందుకు ప్లాన్‌ చేశారు. అందుకు తగ్గట్టుగానే… తనకు, కుమార్తెకు అడ్డుగా ఉన్న ఒక్కొక్కరిని ప్లాన్‌ ప్రకారం తప్పించుకుంటూ వచ్చారన్నది లోకల్‌ టాక్‌. బీఆర్‌ఎస్ అధిష్టానం సైతం ఆయన చెప్పినదానికల్లా తలూపడంతోనే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. శ్రీహరికి టిక్కెట్‌ ఇవ్వడం కోసం అసెంబ్లీ ఎన్నికల టైంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను పక్కనపెట్టింది బీఆర్‌ఎస్‌. దీంతో ఆయన సైడైపోయారు. ఇక వరంగల్‌ ఎంపీ టిక్కెట్‌ ఆశించిన వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు, కడియంకు మధ్య భేదాభిప్రాయాలతో ఆరూరి పార్టీ మారిపోయారు. బీజేపీలో చేరి టిక్కెట్‌ సాధించుకున్నారాయన.

 

ఇక సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌దీ అదే పరిస్థితి. ఆయన కాంగ్రెస్‌ గూటికి చేరిపోయాక ఇక కడియం కావ్యకే టిక్కెట్‌ ప్రకటించింది బీఆర్‌ఎస్‌. అయినాసరే… ఇప్పుడు నేను పోటీ చేయనంటూ కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపడం కలకలం రేపుతోంది. ఉన్నవాళ్ళందర్నీ కాదని కడియం కావ్యకు టిక్కెట్‌ ఇస్తే… ఇప్పుడామె హ్యాండ్‌ ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌ కూడా దిక్కుతోచని స్థితిలో ఉందట. మళ్ళీ కొత్త అభ్యర్థిని వెదుక్కోవాల్సిన పరిస్థితి. అంటే… కడియం శ్రీహరి ముందు నుంచే ప్లాన్డ్‌గా ఉన్నారా? ఒక్కొక్కరిని బయటికి పంపేసి… చివరికి తాము తప్ప గత్యంతరం లేని స్థితికి తీసుకువచ్చి… ఫైనల్‌గా కారును ముంచేశారా అన్న చర్చ జరుగుతోంది జిల్లా పార్టీ వర్గాల్లో. ఉమ్మడి జిల్లాలో ఒంటరి గులాబీ అన్న టాక్‌ రావడానికి కడియమే కారణమని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. సరిగ్గా వరంగల్ పార్లమెంట్ విస్తత స్థాయి సమావేశానికి ఒక్కరోజు ముందు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖ రాశారు కడియం కావ్య. అవినీతి ఆరోపణలతో పాటు భూ కబ్జాలు, ఫోన్ టాపింగ్ లాంటి అంశాలతో పార్టీ నేతల మధ్య సమన్వయం ఉండటం లేదని, ఈ పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని లేఖ రాసి కాంగ్రెస్‌లో చేరేందుకు గేట్లు ఓపెన్‌ చేసుకున్నారు. ఇలా కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసే అభ్యర్థి లేకుండా దెబ్బ తీశారని మండి పడుతున్నాయట పార్టీ వర్గాలు. అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. కడియం శ్రీహరి కూతురికి పార్టీ టిక్కెట్‌ అయితే ఇప్పించుకోగలిగారుగానీ… తర్వాత బీఆర్‌ఎస్‌కు క్షేత్ర స్థాయి వాతావరణం అంత సానుకూలంగా లేదని గ్రహించి కాంగ్రెస్‌ పల్లవి అందుకున్నారన్నది కొందమంది వాదన. కారణం ఏదైనా… జిల్లాలో గులాబీ పార్టీని కోలుకోలేని దెబ్బ తీశారన్నది విస్తృత అభిప్రాయం. నమ్మి పదవులు ఇచ్చిన పార్టీని ఎన్నికల మునంగిట్లో నట్టేట ముంచారని అంటున్నారు బీఆర్‌ఎస్‌ లీడర్స్‌. బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ కోసం పోటీలో ఉన్న నేతలంతా పార్టీ మారేదాకా వెయిట్‌ చేసి ఆ తర్వాత తాను కారు దిగేయడం ద్రోహంకాక ఇంకేంటన్న వాదన సైతం వినిపిస్తోంది. మొత్తం మీద కడియం శ్రీహరి కారు పార్టీని కనిపించకుండా దెబ్బ కొట్టారన్నది లోకల్‌ టాక్‌.

Show comments