NTV Telugu Site icon

Off The Record : వీఆర్ఎస్ ఆలోచనలో మాజీ ఎమ్మెల్యే..?

Srinivas Otr

Srinivas Otr

రాష్ట్రంలో పార్టీకి పవరుంది… నాకు జైంట్‌ కిల్లర్‌ ఇమేజ్‌ ఉంది. ఇక అడ్డేముందనుకుంటూ…. నాడు అడ్డగోలుగా మాట్లాడారా మాజీ ఎమ్మెల్యే. అవతలోడు ఎవడైతే నాకేంటి అన్నట్టుగా…. అదే శాశ్వతం అన్న భ్రమలో బతికేశారు. ఓటర్లు లాగిపెట్టి కొట్టి చెంప ఛెళ్ళుమనిపించేసరికి… దెబ్బకు పవర్‌ నిశా దిగిపోయి ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చారు. కట్‌ చేస్తే… ఉన్న పార్టీలో విలువ లేదు. పక్క పార్టీల్లో శతృవులు పెరిగారు. దీంతో పొలిటికల్‌ వీఆర్‌ఎస్‌ ఆలోచనలు చేస్తున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఏంటాయన రాజకీయ వైరాగ్యపు కహానీ? భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. 2019 ఎన్నికల్లో ఆయనో సంచలనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఓడించి అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌ అయ్యారాయన. జైంట్‌ కిల్లర్‌ ఇమేజ్‌తో నాడు గట్టిగానే ఆశించాడు మనోడు. జగన్‌ కేబినెట్‌లో మంత్రి పదవి ఆశించినా… పదవి సంగతి పక్కన బెడితే అసలు పార్టీ పరంగా కూడా దక్కాల్సినంత గౌరవం దక్కలేదని నాడు తెగ ఫీలైపోయారట. పార్టీ పెద్దల వైఖరితో చిన్నబుచ్చుకున్న గ్రంధి రాజకీయంగా మాత్రం భీమవరం మీద తన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ పై తరచూ మాటల దాడి చేశారు. మరోసారి పవన్‌ని ఓడిస్తే తాను కోరుకున్న గుర్తింపు, గౌరవం దక్కుతాయన్న ఆశతో తెగ రెచ్చిపోయేవారు. భీమవరం ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం.. ఓ పక్కపవన్‌, మరోపక్క జనసైనికులతో గ్రంధి ఓ ఆట ఆడేసుకున్నారన్నది స్థానిక రాజకీయ వర్గాల అభిప్రాయం. పవన్‌ భీమవరం పర్యటనకు వచ్చిన ప్రతిసారి చెలరేగిపోయేవారు మాజీ ఎమ్మెల్యే. మరోసారి పవనే భీమవరంలో పోటీ చేయాలి, మళ్ళీ ఆయన్ని నేనే ఓడించాలంటూ ఓ దశలో డబ్బా కొట్టుకునేదాకా వెళ్ళింది వ్యవహారం. పవన్‌ సైతం గ్రంధి శ్రీనివాస్ రౌడీయిజాన్ని కూకటి వేళ్ళతో పెకలిస్తానంటూ శపథం చేసిన సందర్భాలున్నాయి. కాలం గిర్రున తిరిగింది. ఐదేళ్ళు గడిచాయి. ఈసారి ఎన్నికల్లో సీన్‌ రివర్స్‌ అయి వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌ ఓడిపోయారు. భీమవరంలో జనసేన పాగా వేసింది.

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఇక ఇక్కడ ఫోకస్‌ పెడతారని, గ్రంధికి ఇక పొలిటికల్‌ గ్రంధులన్నీ మూసుకుపోతాయన్న టాక్‌ మొదలైంది. వైసీపీ పెద్దల మెప్పు కోసం నోటికి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడినా… ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా…ఇప్పుడు ప్రత్యర్థులకు ప్రధాన టార్గెట్‌ అయ్యానంటూ వాపోతున్నారట ఆయన. ఈ పరిస్థితుల్లో గ్రంధి శ్రీనివాస్‌ అసలు రాజకీయాల్లో కొనసాగుతారా లేక పొలిటికల్‌ వీఆర్‌ఎస్‌ తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. అంత పెద్ద నిర్ణయం ఎందుకంటే…. ఇప్పుడాయన కేవలం జనసేనకేగాక టీడీపీ, బీజేపీ రాడార్స్‌ పరిధిలో కూడా ఉన్నారన్నది సన్నిహితుల మాట. అందుకు కూడా పెద్ద కారణాలే ఉన్నాయంటున్నాయి. లోకేష్‌ యువ గళం పాదయాత్ర భీమవరం దాటే సమయంలో గ్రంధి శ్రీనివాస్ అనుచర వర్గం టిడిపి వాలంటీర్ల పై రాళ్ళ దాడులు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే యువగళం క్యాంపులోని యాభై మందిదాకా వాలంటీర్లపై కేసులు పెట్టి జైలుకు పంపారు. వాళ్ళని రోజంతా భీమవరం నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ నానా ఇబ్బందులు పెట్టారు అప్పట్లో. ఆ దెబ్బకు గ్రంధి శ్రీనివాస్ పేరు రెడ్ బుక్కులో ఎక్కిందన్న మాటలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అడ్డగోలు పనులే ఇప్పుడు గ్రంధికి బూమరాంగ్‌ అవుతున్నాయన్నది లోకల్‌ టాక్‌. జనసేన టిడిపి సంగతి పక్కనబెడితే… చివరికి భీమవరం బీజేపీ నాయకులతో కూడా మాజీ ఎమ్మెల్యేకి విభేదాలు ఉన్నాయంటున్నారు. నర్సాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మతో గ్రంధికి తేడా వ్యవహారాలున్నాయట. ఇలా … ఏ రకంగా చూసినా మూడు పార్టీల నుంచి ముప్పు తప్పేలా లేదని ఆయన వర్గం భయపడుతున్నట్టు తెలుస్తోంది. అధికారం శాశ్వతం అన్న భ్రమలో ఆయన ఏదో చేద్దామనుకుంటే…చివరికి ఏదో అయిపోయిందని, పవన్‌ని టార్గెట్‌ చేయబోయి చివరికి ఆయనే అందరి టార్గెట్‌లోకి వెళ్ళారని దగ్గరివాళ్ళు కూడా కామెంట్‌ చేసే పరిస్థితి ఉందట. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రాజకీయాల్లో కొనసాగాలా లేక ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టాలా అనే ఆలోచనలో గ్రంధి శ్రీనివాస్‌ ఉన్నారన్నది సన్నిహితుల మాట. అందుకు తగ్గట్టుగానే… ఇటీవల పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరవడం లేదాయన. ఫైనల్‌గా ఈ మాజీ ఎమ్మెల్యే నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.