NTV Telugu Site icon

Off The Record : కేరాఫ్ కాంట్రావర్సీ గోరంట్ల మాధవ్

Gorantla Madhav

Gorantla Madhav

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..కానీ ఆ నేతకు మాత్రం నోరే అతి పెద్ద సమస్య అట. తిరిగే కాలు, తిట్టే నోరు అన్నట్టుగా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని వెంటేసుకుని తేడా మాటలు మాట్లాడకుంటే ఆయనకు నిద్ర పట్టదట. కానీ… ఇప్పుడు తాను ప్రతిపక్షంలో ఉన్నానన్న సంగతి మర్చిపోయి మాట్లాడటమే లేటెస్ట్‌ హాట్‌. ఇంతకీ ఎవరా నాయకుడు? తాజాగా ఏం నోరు జారాడు? మామూలుగా మనం ఎవరినైనా ఒక మాట అంటున్నామంటే…. అవతలి నుంచి వచ్చే రియాక్షన్‌ని కూడా స్వీకరించే విధంగా ఉండాలి. లేదంటే అది ఎంత దూరం వెళ్తుందో ఆలోచించి నోటికి పని చెప్పాలి. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో ఇప్పుడిదే చర్చ జరుగుతోందట రాజకీయవర్గాల్లో. మొదటి నుంచి కేరాఫ్‌ కాంట్రవర్శీ అన్న పేరు ఉంది ఆయనకు. పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వివాదాల్లో ఉండేవారు.తర్వాత ఖాకీ పై ఇంట్రెస్ట్ తగ్గి ఖద్దర్‌ మీద మోజు పెరిగినా ఆయన వైఖరి మాత్రం మారలేదంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి హిందూపురం ఎంపీగా గెలిచారు మాధవ్‌. అలా ఒక అధికారి సడన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి గెలవడం కూడా ఒక సంచలనం అయ్యింది. అయితే వచ్చిన ఆ అవకాశాన్ని ఆయన సరిగ్గా వినియోగించుకోలేకపోయారన్న అభిప్రాయం బలంగానే ఉంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. అక్కడ కూడా నిత్యం ఏదో ఒక రకమైన వివాదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారాయన. ఎంత తొందరగా ఎంపీ టికెట్ తెచ్చుకున్నారో.. అంతే తొందరగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కోల్పోయారు మాధవ్‌. అందుకు కారణాలను విశ్లేషించుకున్న పాపాన పోలేదని, ఆయనలో ఇప్పటికీ ఏ మాత్రం మార్పు కనిపించలేదన్న అభిప్రాయం తాజాగా బలపడుతోందట. ప్రస్తుతం వైసీపీలో చాలామంది నాయకులు మీడియా ముందుకు వచ్చేందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు టైం మనది కాదు అంటూ… పార్టీ వ్యవహారాలకు, అలాగే పబ్లిక్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు ఎక్కువ మంది. ఈ పరిస్థితుల్లో…గోరంట్ల మాధవ్ మాత్రం పాత శైలిని మార్చుకోకుండా ఫుల్‌ యాక్టివ్‌ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనక పోయినప్పటికీ… వైసీపీ తరఫున వాయిస్ వినిపించడంలో ముందు ఉన్నారాయన.

సొంత పార్టీ తరపున వాయిస్ వినిపించడం మంచిదే అయినా… ఇప్పటికీ తీరు మారకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు, పార్టీకి ఇబ్బందికరం కావచ్చన్న వాదన బలపడుతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లప్తె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపు తున్నాయి. కూటమి ప్రభుత్వం అన్నింటా విఫలమైందని అంటూనే… ఏకంగా నేర సామ్రాజ్యాన్ని సృష్టిస్తుందని కామెంట్‌ చేశారు మాజీ ఎంపీ. అది కూడా ఓకే అనుకున్నా… ఆ సందర్భంలో వాడిన పదజాలంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి కూటమి కేటర్ నుంచి. మాధవ్‌ పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. వాటిని బేస్‌ చేసుకునే ఇప్పుడు అనంతపురం జిల్లాలో కూటమి నాయకులంతా గోరంట్ల మాధవ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయన ఒక మాట అంటే అటువైపు నుంచి 100 అనే స్థాయికి వెళ్ళింది వ్యవహారం. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవర్తించినట్టుగానే ఇప్పుడు కూడా చేస్తే… కారం పెడతామంటూ ఘాటుగానే రియాక్ట్‌ అవుతున్నారట కూటమి పార్టీల కార్యకర్తలు. వాస్తవంగా మొదటి నుంచి గోరంట్ల మాధవ్ వివాదాలతోనే పాపులర్‌ అయ్యారు. అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా నడిచిపోయింది. ఇప్పటికీ వాస్తవాల్లోకి రాకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే… ట్రీట్‌మెంట్‌ తేడాగానే ఉంటుందంటూ వార్నింగ్‌ ఇస్తున్నారట అధికార పక్షం నాయకులు. మరి మాధవ్‌ మారతారా? లేక నేనింతే అంటూ… అధికార పక్షానికి టార్గెట్‌ అవుతారో చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.