NTV Telugu Site icon

Off The Record : ఆ అగ్రనేత కనిపించడం లేదంటూ హస్తం నేతల ప్రచారం.. గజ్వేల్ మే సవాల్ అంటున్న ఆ పార్టీలు..!

Otr Kcr

Otr Kcr

ఏమాటకామాటే! గత పదేళ్లుగా గజ్వేల్ అంటే గజ్వేలే! ఎక్కడా తగ్గేదే అన్నట్టుగా ఉండేది! కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సొంత ఇలాఖా ఆమాత్రం ఉండొద్దా! మరి ఇప్పుడు ఆ జిగేల్ ఏమైంది? కేసీఆర్ ఎక్కడున్నారు? ఇదే అంశాన్ని కాంగ్రెస్ అస్త్రంగా మలుచుకుంది! కేసీఆర్ కనిపించడం లేదంటూ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చింది! దీనికి కౌంటర్‌గా బీఆర్ఎస్ ఏం చేసింది? ఛలో చూద్దాం రండి! గజ్వేల్ నియోజకవర్గం. దీనికి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మాజీ సీఎం కేసీఆర్ ఇలాఖా! ఆయన సీఎంగా ఉన్నప్పుడు గజ్వేల్ జిగేల్‌మంది! ఏ విషయంలోనైనా అగ్రతాంబూలం ఈ నియోజకవర్గానికే! అలా పదేళ్లు ఒక వెలుగు వెలిగిన గజ్వేల్.. ఇప్పుడు మసకమసకగా కనిపిస్తోంది. కారణం.. వేరే చెప్పక్కర్లేదు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయవడం.. కేసీఆర్ ఫాం హౌజ్‌కే పరిమితం కావడం.. ఇలా సవాలక్ష రీజన్స్ ఉన్నాయి. అయితే కొంతకాలంగా గజ్వేల్‌లో కళ్యాణాలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ ఆగిపోయింది. వెయ్యికిపైగా చెక్కులు డిస్ట్రిబ్యూట్‌ కాకుండా పెండింగులో ఉన్నాయి. అందుకు కారణం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించడం లేదని.. అందుకే చెక్కులన్ని ఆగిపోయాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నెల3న గజ్వేల్‌లో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో కేసీఆర్ పై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సెటైర్లు వేశారు. కేసీఆర్ తీరు వల్లే కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయలేకపోతున్నామని, కేసీఆర్ నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక మంత్రి కొండా సురేఖ మరో అడుగు ముందుకేసి గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ ఆచూకీ దొరకడం లేదని, ఆయను వెతికి పెట్టాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మంత్రులు అలా చెప్పారో లేదో కాంగ్రెస్ నాయకులు స్టేషన్ మెట్లెక్కారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనపడటం లేదని.. తమ ఎమ్మెల్యేని వెతికి పెట్టాలని గజ్వేల్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్ గా BRS నేతలు ప్రెస్ మీట్ పెట్టారు. మరునాడు కాంగ్రెస్ నేతలు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేసీఆర్ చిత్రపటానికి వినతిపత్రం అందించారు. కేసీఆర్ టైం ఇవ్వకపోవడం వల్లనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని, నియోజకవర్గంలో సమస్యలు పెండింగులో ఉన్నాయని ఆ పత్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా క్యాంపాఫీస్ బయట గోడకు వినతి పత్రాన్ని అతికించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన BRS నాయకులు పోలీస్ స్టేషన్లో అదే కాంగ్రెస్ నాయకులపై ఉల్టా ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌పై దుష్ప్రచారం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గంలో చాలా రోజులుగా చెక్కుల పంపిణీ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నారని కౌంటర్ ఎటాక్‌కి దిగారు.

మొత్తానికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పుణ్యమాని గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వార్ మొదలైంది. రెండు పార్టీల్లో ఎవరి వాదన ఎలా ఉన్నా చెక్కుల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారుల్లో మాత్రం అయోమయం నెలకొంది. మీరూ మీరు కొట్టుకోండి కానీ మా చెక్కులు మా ముఖాన పడేయండని జనం అంటున్నారు. వచ్చిన చెక్కులు ఇవ్వకుండా రాజకీయం చేయడమేంటని జనాలు విసుక్కుంటున్నారు. జనం ఇలా రియాక్టయ్యే సరికి ఇష్యూ ఎటు వెళ్తుందో అని రెండు పార్టీల నాయకుల్లో అంతర్మథనం మొదలైందట.

Show comments