NTV Telugu Site icon

Off The Record : దువ్వాడ అతి.. ఇబ్బందులు తెస్తోందా..? వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి..!!

Otr Duvvada

Otr Duvvada

అతి సర్వత్రా… అన్నది ఆ ఎమ్మెల్సీ విషయంలో ప్రాక్టికల్‌గా నిరూపితం అవుతోందా? ఓ పద్ధతి ప్రకారం ఉచ్చు బిగించడానికి రంగం సిద్ధం అవుతోందా? తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పవర్‌ పోయాక మరో రూపంలో దూకుడు ప్రదర్శించి జనం నోళ్ళలో విపరీతంగా నానుతున్న ఆ లీడర్‌కు ఇప్పుడు సొంత పార్టీవాళ్ళే సపోర్ట్ చేసే పరిస్థితి లేదా? ఎవరా ఎమ్మెల్సీ? ఏంటాయన జిల్‌ జిల్‌ కీ కహానీ?

సిక్కోలు పాలిటిక్స్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ది డిఫరెంట్‌ స్టైల్‌. రాజకీయం అయినా… వ్యక్తిగత వ్యవహారం అయినా… దూకుడుగానే ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారాయన. ఆ దూకుడే క్రమంగా అతిగా మారిపోయి చివరికి ఆయన్నే చుట్టేసే పరిస్థితి వస్తోందా అంటే… అవును, అలాగే కనిపిస్తోందన్నది పొలిటికల్‌ పరిశీలకుల సమాధానం. గతం సంగతి ఎలా ఉన్నా… ఇటీవలి కాలంలో మాత్రం ఇంటా బయటా రకరకాల వివాదాలతో సావాసం చేస్తున్నారాయన. అయితే… కుటుంబ వివాదాలు మెల్లిగా సెట్‌ అవుతున్నాయని, వాటి నుంచి బయటపడుతూ… క్రమంగా యాక్టివ్‌ పాలిటిక్స్‌ మీద దృష్టి పెడుతున్నట్టు చెబుతున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు. ఇక్కడే సిక్కోలు అధికార పక్షం నేతలు కూడా అలర్ట్‌ అవుతున్నట్టు తెలిసింది. సహజంగానే నోటికి ఎక్కువగా పనిచెప్పే దువ్వాడ శ్రీనివాస్‌… తిరిగి రాజకీయాల్లో యాక్టివ్‌ అయితే… పాత స్టైల్‌లోనే నోరు లేస్తుందని భావిస్తున్న అధికారపక్ష నేతలు ముందే చెక్‌ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల చిట్టా బయటికి తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాటికి సంబంధించి ఎక్కడికక్కడ కేసులతో ఉక్కిరి బిక్కిరి చేసే ప్లాన్‌ ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారంటూ… ఇప్పటికే దువ్వాడ మీద కేసు బుక్‌ అయింది. ఇక జనసేన పార్టీ ఆఫీస్‌ మీద దాడి చేసిన ఘటనకు సంబంధించి తాజాగా దువ్వాడ అనుచరులకు నోటీసులు వచ్చినట్టు తెలిసింది. ఓవైపు కుటుంబ వ్యవహారాలు కొలిక్కి వస్తున్నట్టు కనిపిస్తున్నా… ఇంకా పూర్తిగా సెట్‌ అవలేదని, ఇదే సమయంలో రాజకీయంగా కేసులు చుట్టుముడితే… కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది సిక్కోలు పొలిటికల్‌ సర్కిల్స్‌లో. నేరుగా దువ్వాడతో పాటు ఆయన అనుచరుల్ని కూడా ఎక్కడికక్కడ బుక్‌ చేసేస్తే ఓ పనై పోతుందన్న అభిప్రాయం స్థానిక అధికార పక్ష నాయకుల్లో ఉందట.

అదే సమయంలో విషయం తెలిసిన ఎమ్మెల్సీ కూడా తగ్గేదే లేదంటున్నట్టు సమాచారం. ఎన్ని కేసులు పెట్టినా సై అంటున్నారట. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది. పార్టీ సపోర్ట్‌ ఉంటుందని భావిస్తూ… ఆయన అన్నిటికీ సై అంటున్నారేమోగానీ… ఇప్పుడంత సీన్‌ లేదన్న వ్యాఖ్యలు గట్టిగానే వినిపిస్తున్నాయంటున్నారు. దువ్వాడ విషయంలో స్థానిక వైసీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ప్రస్తుతం వేరు. ఆయన ఏదంటే అది చేసేసి పార్టీ సపోర్ట్‌ కావాలంటే దొరుకుతుందా అని జిల్లా వైసీపీ లీడర్స్‌ గుసగుసలాడుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ మధ్య తిరుమల కొండ మీద రీల్స్‌ చేశారంటూ… దువ్వాడ ఆప్తురాలు మాధురిపై కేసు నమోదైంది. ఆ విషయంలో పార్టీ వైపు నుంచి స్పందన ఆశించినా రాలేదన్న అసంతృప్తి ఎమ్మెల్సీ వర్గంలో ఉన్నట్టు తెలిసింది. ఇక శ్రీనివాస్‌ విషయానికి వస్తే… తాను గతంలో ఎప్పుడో చేసిన వాఖ్యలకు ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటని ఆయన సన్నిహితులు మొత్తుకుంటుంటే…. జిల్లా వైసిపిలోని మరో వర్గం మాత్రం నోరు అదుపులో లేకుండా… అవతలివాళ్ళని ఎంతమాట పడితే అంత మాట అంటే… ఊరికే ఉంటారా అంటూ సెటైర్స్‌ వేస్తున్నారట. ఈ పరిణామాలతో వైసీపీ నుంచి కూడా దువ్వాడ ఆశించినంత సపోర్ట్‌ ఉండకపోవచ్చంటున్నారు. చుట్టు ముడుతున్న వివాదాలతో… పార్టీ సపోర్ట్‌ లేకుండా ఆయన ఎంతవరకు నెగ్గుకు వస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Show comments