NTV Telugu Site icon

Off The Record : దానం నాగేందర్‌ను బీజేపీ టార్గెట్ చేసిందా.. ఆయన మీదే ఎందుకు ఫిర్యాదు చేసింది?

Danam Otr

Danam Otr

ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను బీజేపీ టార్గెట్‌ చేసిందా? ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయిస్తే… ఒక్క దానం మీదనే ఎందుకు ఫిర్యాదు చేసింది? అసలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య జరుగుతున్న జంపింగ్‌ గేమ్‌లోకి బీజేపీ ఎందుకు ఎంటరైంది? దాని పరిణామాలు ఎలా మారే ఛాన్స్‌ ఉంది? తెలంగాణ పొలిటికల్‌ స్క్రీన్‌పై ఫిరాయింపుల సినిమాలో కొత్తగా కనిపించబోతున్న సీన్స్‌ ఏంటి? లెట్స్‌ వాచ్‌.

తెలంగాణ పొలిటికల్‌ జంపింగ్‌ జపాంగ్‌ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అనూహ్యంగా ఈ ఎపిసోడ్‌లోకి బీజేపీ ఎంటరైపోయింది. ఇన్నాళ్ళు బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌గా నడుస్తున్న గేమ్‌లోకి థర్డ్‌ ప్లేయర్‌ ఎంట్రీతో ఇక ఆట రసవత్తరంగా మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎవ్వరూ ఊహించని విధంగా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్తున్న ఎమ్మెల్యేల విషయంలో జోక్యం చేసుకుంది తెలంగాణ బీజేపీ. కానీ… అది అందరి విషయంలో కాకుండా కేవలం ఒక్క ఎమ్మెల్యే మేటర్‌లోనే కావడంతో ఇదేందబ్బా… ఏంది సంగతి అన్నట్టుగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటివరకు ఆరుగురు గులాబీ ఎమ్మెల్యేలు హస్తం నీడకు చేరి సేదదీరుతున్నారు. ఇంకొందరు కూడా క్యూలో ఉన్నారన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌లో టాక్‌.

ఆ క్రమంలో… వలసలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో ఉన్న కారు పార్టీ… పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయించాలన్న పట్టుదలగా ఉంది. ఈ మేరకు ఫిర్యాదు కూడా చేసింది పార్టీ నాయకత్వం. అదంతా వాళ్ళ ఇంటర్నల్‌ వ్యవహారం. చేరేది బీఆర్‌ఎస్‌ వాళ్ళు, చేర్చుకునేది కాంగ్రెస్‌ వాళ్ళు. కానీ… తాజాగా కమలం పార్టీ కూడా రంగంలోకి దిగడంలో మేటర్‌ మాంఛి రసకందాయంలో పడుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్‌ గూటికి చేరిన దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్‌కు పంపింది బీజేపీ. అయనపై వేటు వేయాలని డిమాండ్ చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. పార్టీ మారిన మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలను వదిలేసి దానం నాగేందర్‌ ఒక్కరినే బీజేపీ ఎందుకు టార్గెట్ చేసిందన్నది ఇక్కడ క్వశ్చన్‌.

అయితే ఆయన పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అంటున్నారట కమలం నేతలు. ఆయన ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ బీ ఫామ్‌ మీద గెలిచి… రాజీనామా చేయకుండానే… కాంగ్రెస్ బీ ఫామ్‌ మీద ఎంపీగా పోటీ చేశారని, అంతకు మించిన ఆధారం ఇంకేం కావాలని ప్రశ్నిస్తున్నారట బీజేపీ లీడర్స్‌. పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీదే పోటీ చేసి ఓడిపోయారు దానం. మా మీద పోటీ చేశాడు కాబట్టే… మేం సీరియస్‌గా తీసుకున్నాం…ఫిర్యాదు చేశాం.

అది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రక్రియలో భాగం తప్ప మరోటి కాదని అంటోంది కాషాయ దళం. బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూ లో గట్టిగానే ముందుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. కేంద్ర నాయకత్వం అనుమతి తీసుకున్న తర్వాత బీజేఎల్పీ ద్వారా ఫిర్యాదు వెళ్ళిందట. దీని ద్వారా పార్టీ ఫిరాయింపుల పై తాము సీరియస్‌గా ఉన్నామనే బలమైన సంకేతాలు పంపాలని బీజేపీ నిర్ణయించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ పాయింట్‌ చుట్టూనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఫిరాయింపుల్లో ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఇప్పుడు మరో ఎత్తులా ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో బీజేపీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి… ఇక మీదట జంప్‌ కావాలనుకునేవారు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఫిరాయింపుల వ్యతిరేక చట్టం తెచ్చిందే రాజీవ్ గాంధీ అని, ఇప్పుడు అదే పార్టీ వాటిని ప్రోత్సహిస్తోందంటూ కాంగ్రెస్‌ని ఎండగట్టేందుకు దానం ఇష్యూను తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలిసింది. అదే సమయంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనన్న ఆరోపణలను మాత్రం కొట్టేస్తున్నారు కాషాయ పెద్దలు. అటు కాంగ్రెస్‌ మాత్రం మీరిద్దరూ ఒక్కటే కాబట్టి ఒకరికి ఒకరు సపోర్ట్‌గా ఉన్నారంటూ కౌంటర్‌ ఇస్తోంది. దీంతో తెంలగాణ ఫిరాయింపుల రాజకీయం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

 

youtube.com/watch?v=caot3EOwLTo